12, జులై 2012, గురువారం

నాకో కల వచ్చింది

ఆ మధ్య ఒకానొక రాత్రి.. విచిత్రమైన కల ఒకటొచ్చింది. 'ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి' అంటూ సినిమా డైలాగులు కొట్టటం ఆపేసి ముందు నే చెప్పేది వినండెహే. రాత్రి అంటే రాత్రి కూడా కాదు. నేను పడుకునేదే రాత్రి రెండింటికి కదా. కాబట్టి నాకొచ్చిన ఆ కల పొద్దున దాదాపు ఏడింటప్పుడు వచ్చిందేమో. చాలా బావుంది ఆ కల.

ఏదో ఊళ్ళో ఉన్నాను. ఆ ఊరు ఎలా ఉందంటే.. గుంటూరు జిల్లాలోని కారంపూడి, మాచెర్ల, పిడుగురాళ్ళ లాంటి ఊళ్లలోని వాతావరణం కనిపించింది. ఇప్పుడంటే ఆ ఊళ్లలో రోడ్లు వేశారు కానీ, నా చిన్నప్పుడు గుంటూరు జిల్లాలోని ఊళ్ల సందుల్లో బండలు పరచబడి ఉండేవి. వాటి మీది నుండే గుర్రబ్బళ్ళు వెళ్ళేవి. సరిగ్గా అలాంటి సందులోనుండే ఇప్పుడీ కలలో కూడా నేను నడుచుకుంటూ వెళ్తున్నానన్న మాట. కాబట్టి ఇప్పుడు నాతో పాటు నడుస్తున్నప్పుడు ఆ బండల మధ్య ఉన్న చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటాయేమో.. మీరు జాగ్రత్త. అలా
నడుస్తూ అక్కడున్న కొన్ని ఇరుకైన సందుల్లో నుండి నేను వెళ్తున్నానట. ఇళ్ళముందు చక్కటి ముగ్గులు; సమయం సాయంత్రం దాదాపు అయిదున్నర - ఆరు గంటల ప్రాంతం. కొంతమంది ముసలివాళ్ళు ఆరుబయట అరుగుల మీద కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. ఇంకో చోట ఒక పే....ద్ద వేప చెట్టు కింద అరుగు మీద కొంతమంది, అంటే దాదాపు పదిహేనిరవై మంది మగ  తాతయ్యలు  వింటూ ఉంటే.. పళ్ళూడిపోయిన ఒక సీనియర్ తాతయ్య పురాణ పఠనం చేస్తున్నాడు. ఆడ నాయనమ్మలు కూడా కొంతమంది ఉన్నారులే బోసి నవ్వులు నవ్వుతూ.  పొద్దున్నే పని మీద వెళ్ళిన వాళ్ళంతా గూటికి చేరే క్రమంలో చక్కటి జనపదాలు పాడుకుంటూ, మధ్య మధ్యలో ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు రువ్వుకుంటూ, రోజు మొత్తమ్మీద జరిగిన కొన్ని హాస్య సన్నివేశాలని తలచుకుని నవ్వుకుంటూ... కులాసాగా వచ్చేస్తున్నారు. ఇక పిల్లల హడావిడి చెప్పనే అక్కర్లేదు...కోతులే భయపడేట్టుగా అల్లరి చేసే మగ పోరగాళ్ళు, వాళ్ళతో సమానంగా గోల చేస్తున్న ఆడపిల్లలు. యువకులంటారా... కాలేజీ నుండి రెండు నిమిషాల్లో ఇంటికి చేరే దారిని వదిలి... కనీసం అర్ధగంటపాటు నడిస్తేనే కానీ ఇల్లు చేరని దారి వెంబడి వెళ్ళటం. మరి ఆ దారిలోనే కదా ఆ అమ్మాయి ఉండేది. నిజానికి ఆ అమ్మాయికి కావలసింది కూడా అదేలే. మధ్యలో ఒక కొంటెగాడు.. అక్కడ పురాణం వింటున్నవాళ్ళలో ఒక బామ్మ మీదికి వేప పళ్ళు విసిరి పరిగెత్తటం.

ఆ వేప చెట్టుకి ఎదురుగా ఒక పాత శివాలయం. లోపలినుండి ఏవో మంత్రాలు కూడా వినిపిస్తున్నాయిలే. ఆ గుడి ప్రాంగణంలో ఒక పెద్ద రావి చెట్టు.. దానిమీద పక్షులతో  పిచ్చాపాటీ  మాట్లాడుతూ లెక్కపెట్టలేనన్ని కోతులు. ఆ గుడి పక్కనే, శివ సాన్నిధ్యంలో దాక్కున్నట్టుగా ఒక సన్నటి సందు. అసలక్కడ ఒక సందు ఉందనే విషయం అక్కడిదాకా వెళ్లి చూస్తేనే కానీ కనిపెట్టలేం. సందు చూసుకుని ఆ దారిలోకి ప్రవేశించగానే ఎక్కడినుండి వస్తోందో తెలీని ఒక మంచి సువాసన... మల్లె, తులసి, మరువం కలిసిన పరిమళం అది. కొంచెం తరచి చూస్తే తెలిసింది... అక్కడ మరువం, మల్లె మొక్కల వరుస దారికి రెండువైపులా స్వాగతం పలుకుతున్నట్టుగా  కూర్చబడిందని. స్వాగతం మనకి కాదండోయ్.. ఆ సందులో ఉన్న ఒకానొక గుళ్ళో ఉండే పెద్ద దేవుడికి. ఆ పెద్ద దేవుడు వాహ్యాళికి వచ్చినప్పుడు ఈ మొక్కలు వాటి సువాసనతో ఆయన పల్లకీని మోస్తాయట. అసలు వాటికోసమే ఆయన వారానికొక రోజున అలా వాహ్యాళికి వస్తాడట. దాన్నే ఆ ఊరివాళ్ళు ఊరేగింపు అంటూ ఉంటారు.  విషయం ఏంటంటే.. ఆ దారిలో వెళ్తుంటే ఒక గుడి కనిపిస్తుంది. అది మనకి ఎడమవైపున కనిపించే చాలా చాలా పాత గుడి. దాన్ని దాటి ఓ పదిహేనిరవైయ్యడుగులు ముందుకెళ్తే అక్కడ కుడివైపున కొత్తగా కట్టిన ఒక గుడి ఉంటుంది. ఈ కొత్త గుళ్ళోకి, ఆ పాత గుడి నుండి విగ్రహాలని తరలించి ప్రతిష్ఠించారట. ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది అని నేను ఎవరినో అడిగితే.. 'మొన్న ఇరవయ్యవ తారీఖున అయింది' అని వాళ్ళు అంటారట. అది మరి ఏ ఇరవయ్యో తారీఖో నాకైతే తెలీదు కానీ... 'అరే, కొంచెంలో మంచి అవకాశం పోయిందే.. తెలిస్తే అప్పుడే వచ్చేవాణ్ని' అని అనుకుంటానట.

అయితే...అక్కడొక ప్రత్యేకత ఉంటుంది. అది నాకు ముందే తెలుసు; కానీ ఆ సమయంలో.. అంటే గుళ్ళో ఉన్న సమయంలో ఆ విషయాన్ని నేను ఎప్పటిలాగానే అతి సహజంగా మర్చిపోతానన్నమాట. కానీ.. ఆ విషయం ఓసారెప్పుడో నాకు మాటల మధ్యలో రసజ్ఞ గారు చెప్పినట్టుగా సరిగ్గా ఆ సమయానికి గుర్తొస్తుందన్నమాట.(నిజానికి నేను, రసజ్ఞ గారు మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడూ ఈ విషయం మా మధ్య రాలేదు. కానీ అదేంటో, ఆమెనే ఈ విషయం నాకు చెప్పినట్టుగా ఆ కలలో అనిపిస్తూ ఉంటుంది). ఆ విషయం ఏంటంటే.. "అక్కడ స్వామి వారి పాదాలు చూశారా మీరు" అని నన్ను ఆ సమయంలో అడిగినట్టుగా అనిపించింది. 'అరే అవును కదా.. ఈ గుళ్ళోనే కదా ఆయన పాదాల గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు' అని నాకు అప్పుడు అనిపించింది. దాంతో వెంటనే గర్భగుడి దగ్గరికెళ్ళిపోయి, అలా ఆయన పాదాల్ని తీక్షణంగా గమనించేసరికి, "ఎంత విచిత్రం" అనిపించింది నాకు. ఎందుకంటే, ఆయన కుడికాలు.. మునివేళ్ళ మీద నిలబడ్డట్టుగా ఉంటుంది; ఎడమకాలు పాదం మాత్రం...ముందుకు అడుగు వేస్తున్నట్టుగా ఒక నాలుగైదు అంగుళాలు ముందుకి జరిపి.. పాదాన్ని ఎడమ వైపుకి వంచినట్టుగా... అంటే పాదం కుడివైపు నుండి ఎడమవైపుకి వంచి.. నేలకి ఆనించినట్టుగా ఉంటుంది. లోక కళ్యాణానికి పూనుకున్నవాడై, దుష్ట సంహారం చేయగోరి ఉద్యుక్తుడవుతూ ముందడుగు వేస్తున్నారేమో స్వామి వారు అన్నట్టుగా ఉంది అక్కడి దృశ్యం. చూడగానే చాలా స్పష్టంగా కనిపించింది స్వామి వారి విగ్రహం. ఇప్పటికీ నాకు కళ్ళలో కదులుతోంది ఆ కలలోని దృశ్యం. అంత స్పష్టంగా కనిపించింది.

అయితే... ఈ కొత్తగా కట్టిన గుళ్ళో చాలామటుకు స్థంభాలని పాత గుడిలో ఉన్నట్టుగానే నిర్మించారు. గుళ్ళోకి ప్రవేశించగానే కుడి వైపున రెండు పెద్ద పెద్ద గదులుంటాయట. ఒక్కోదాంట్లో ఒక్కొక్కళ్ళు చొప్పున పెద్ద దేవుడి కుమారులు ఉంటారట. ఎడమవైపున కూడా అలానే మళ్ళీ రెండు గదులుంటాయట. అందులో కూడా ఒక్కొక్కళ్ళు చొప్పున ఎవరో దేవుళ్ళు. ఆడ దేవుళ్ళో.. మగ దేవుళ్ళో గుర్తు లేదు కానీ... దేవుళ్ళైతే ఉన్నారు (బహుశా ఆడదేవుళ్ళే అయ్యుంటారు... మన దేవుళ్లలో చాలా మందికి ఇద్దరేసి చొప్పున పెళ్లాలుండటం సహజమేగా..అందుకనే ఇద్దరమ్మవార్లేమో అని నా అనుమానం). అయితే... మామూలుగా మనం చూస్తాం కదా గుడిలో పక్కన ఉండే గదులు అతి చిన్నగా ఉండి... వాటిలో విగ్రహాలు కూడా చిన్నగా ఉంటాయని. కానీ ఇక్కడ మాత్రం ఒక్కొక్క గదిలో కనీసం ముప్ఫైమంది కూర్చునేంత స్థలం ఉంటుందట. అంత పెద్ద పెద్ద గదులతో విశాలమైన గుడి. అందులో ఒక్కొక్కటీ ఏడు నుండి ఫది అడుగుల విగ్రహాలు. పెద్ద దేవుడికి మాత్రం చాలా అందంగా అలంకరణ చేసి ఉంటుందట. తులసి మాలలు, మరువం సువాసనలు, మల్లె గుభాళింపులు. మందార పూలు స్వామివారికి పాదసేవ చేసుకుంటూ ఉన్నాయి. అవకాశం దొరికింది కదా అని సంపెంగ పూలు ఆయన నెత్తినెక్కి కూర్చున్నాయి. 'మీరెంత ఆరాటపడ్డా, ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోతారు. కానీ మేము మాత్రమే ఎప్పటికీ ఇక్కడే స్వామి వారి చెంతనే ఉండిపోతాం' అనుకుంటూ ఒకలాంటి ధీమాతో ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్ళిపోయాయి అక్కడి దీపారాధనలు.

గుడి ఖాళీగానే ఉంటుంది. కానీ ఇంకా ఏవో శిల్పాల చెక్కుళ్ళు అవుతూ ఉంటాయి దాని నిర్మాణానికి సంబంధించి. స్వామివారి సేవ నిమిత్తం దేవలోకపు శిల్పులు మనుష్యుల అవతారం ఎత్తి.. అదిగో..అక్కడ అంత ఎత్తున వేళ్ళాడుతూ అహో రాత్రులు కష్టపడి, వాళ్ళలోని జీవాన్ని రాళ్ళలోకి పోస్తూ అత్యద్భుత శిల్పాలుగా మలిచే కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. అలా ఒక్కొక్క శిల్పం జీవకళతో ఉట్టిపడుతూ.. ఒక దశలో.. వాటిని తీర్చిదిద్దుతున్న శిల్పులు కూడా వాటి మధ్యలో 'కదిలే శిల్పాలేనేమో' అనిపించింది. అంతలా మనుష్యులకీ శిల్పాలకీ బేధం లేకుండా చేసేస్తున్నారీ కళాకారులు.

ఇంకోటి ఏంటంటే ఆ గుళ్ళో అలా ఆ దేవుణ్ణి చూస్తుంటే కొంచెం సేపయ్యాక నాకొక ఫోన్ కాల్ వస్తుందట. ఎవరా అని ఆ కాల్ తీసుకుంటే, అందులో ప్రతిరోజు పొద్దున్నే.. ఆకాశవాణిలో "ఇతీ వార్తః షూయంతాం.. ప్రవాచికః పతంజలి కుమారో భాటియా.." అంటూ 'ఆంగ్ల వార్తలు' వస్తూ ఉంటాయట. అదేంటబ్బా... నాకు ఫోన్ చేసి మరీ వార్తలు వినిపిస్తున్నారు ఎవరో అని అనుకుంటూ ఉంటాను; సరిగ్గా ఆ సమయంలో వెనకనుండి ఎవరో అన్నారు అది 'విరూపాక్ష దేవాలయం' అని. కాదని నేనంటాను. 'సరిగ్గా చూడు నీకే తెలుస్తుంది' అని వాళ్ళు అనగానే, 'మళ్ళీ వెనక్కి వెళ్లి చూద్దాం ఓసారి ఆయన పాదాలు' అనుకుంటూ వెనక్కి తిరిగానో లేదో... మెడకాయ పట్టేసింది...!!! ఇంతకీ ఆ దేవుడు ఎవరో అర్ధం కాలేదు.

ఆ తరవాత మళ్ళీ నిద్ర పట్టలేదు.

ఇంతకీ ఇప్పుడు నేను చూపించిన ఈ దేవాలయం ఎక్కడుందో.. అక్కడి దేవుడెవరో... అది ఏ ఊరో... ఎవరైనా చెప్తారేమో అని చూస్తున్నాను... ఇంతవరకూ ఎవరూ తారసపడలేదు.

2 కామెంట్‌లు:

  1. annayyaa chaala baavundi kaani idi nijamaa endukante idi chadivaaka naaku aavuuru kaadu kaani aagudi ekkado chusinattu anipistondi-bhargavi

    రిప్లయితొలగించండి
  2. బహుశః మీరు మీ కలలో చూసిన గుడి కృష్ణా జిల్లా మైలవరం దగ్గరున్న వెల్లటూరు గ్రామం లో ఉన్న రాజగోపాలస్వామి కావచ్చు. కావచ్చు కాదు ! అదే గుడి. విజయవాడ నుండి వేల్లటూరుకు కాళేశ్వరరావు మార్కెట్ ఎదురుగా హెడ్ పోస్టాఫీస్ వద్ద బస్సు దొరుకుతుంది. ఎక్కి వెల్లటూరు అంటే టికెట్ ఇస్తాడు కండక్టరు. గుడి వద్ద స్టాపు ఉంది. వెళ్ళి ఆచార్లు గారిని అర్చన చేయమంటే చేస్తారు. ఆయన అర్చన చేసేటప్పుడు స్వామి వారి పాదాలు గమనించండి. మీరు కలలో కన్న వ్యస్త్యస్థ పాదారవిన్దాలు అవే ! ఈ సారి అలాంటి కల వస్తే నన్ను పిలవండి.సమస్య ఉత్పన్నం కాదు

    రిప్లయితొలగించండి