26, మే 2012, శనివారం

శోగ్గాడి పెళ్లి

వీడికి పాపం లేక లేక పెళ్లి కుదిరింది. కుదిరింది కదా.. తిక్క కూడా కుదురుతుందిలే అని అనుకున్నారంతా. కానీ సహజంగానే అది ఎక్కువై కూర్చుంది.. కాదు కాదు.. నిలబడి నాట్యాలు కూడా చేసింది, వీడి చేత చేయించింది. రకరకాల భంగిమల్లో వచ్చేవాడు పాపం ఆఫీసుకి. అలా వస్తున్న రోజుల్లో ధగధగ మెరుస్తున్న కరెంటు స్థంభం లాగా ఉండేవాడు. పెళ్లి కుదిరిందో లేదో - పల్లెటూళ్ళో మారుమూల వెలగాలా వద్దా అనే సందేహం నుండి బయటపడలేక  కొట్టుకుంటూ బితుకు బితుకుమంటున్న బల్బ్ లాగా తయారైంది పాపం వీడి పరిస్థితి. అవును మరి.. దానిక్కారణాలున్నాయిలే. అతి సహజంగానే... వీడి ఈ పరిస్థితికి కారణం ఆ అమ్మాయే అని అనిపించే అవకాశం ఉంది. కానీ అది తప్పు. పాపం ఆ అమ్మాయిదేం తప్పు లేదు. అంతా వీడి స్వయంకృతాపరాధం. వెధవ.. కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉన్న ప్రాణానికి కొని తెచ్చుకున్నాడు వేరే టీంలో చేరిపోయి. ఇక్కడున్నప్పుడు అసలు పని చెయ్యాలో వద్దో ఓ నాలుగు రోజుల పాటు ఆలోచించుకుని ప్రశాంతంగా..నెమ్మదిగా..నింపాదిగా మొదలుపెట్టి పని పూర్తిచేసే పరిస్థితి వాడిది. ఇప్పుడు కూడా వాడు అదే ఆలోచిస్తున్నాడు. కాకపోతే పని చెయ్యాలో వద్దో అని కాదు. అసలు పని చెయ్యటం ఎప్పుడు ఆగితే అప్పుడు వెళ్ళి ఓ నాలుగు రోజులకి సరిపడా ఊపిరి పీల్చుకుందాం అనే విషయం గురించి. నిజం చెప్పాలంటే కనీసం ఇది ఆలోచించటానిక్కూడా వాడికి సమయం లేదు. ఆ లెవెల్లో చావగొట్టి చెవులు మూస్తున్నారు వీణ్ణి కొత్త టీంలో. సరిగ్గా అక్కడికెళ్ళిన అతి కొద్దిరోజుల్లోనే  వీడికి తిక్క కుదిరింది...సారీ.. పెళ్ళి మాత్రమే.
ఇప్పుడు పెళ్ళి కుదిరిందని ఆనందించాలో.. లేక పెళ్ళి ఇప్పుడు కుదిరిందని బాధపడాలో తెలీక అలా రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు పాపం.

పెళ్లి కుదరకముందు రకరకాల అవతారాల్లో వచ్చేవాడు. అన్నయ్యల చొక్కాలు తమ్ముళ్ళకీ, అక్కల డ్రెస్ లు చెల్లెళ్ళకీ వచ్చినట్టు.. చిన్నప్పుడు వీడి చెల్లెలు స్కూల్ కి వెళ్తూ పెట్టుకున్న హెయిర్ బాండ్స్, పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళేప్పుడు వీడి మొహాన కొట్టేసి వెళ్లినట్టుంది.. ఆ విధంగా సంక్రమించిన ఆస్థిని ఇప్పుడు వీడు వాడుకుంటున్నాడు. అలా వాటిని పెట్టుకుని వాడు ఆఫీసులోకి వస్తుంటే, వాడి అందం చూసి అమ్మాయిలంతా వాడి వెంటపడేవాళ్ళు (తిట్టటానికి). అలాంటిది ఇప్పుడు.. ఎందుకీ జీవితం అనిపించేస్తోందట వాడికి. కాబోయే పెళ్ళాంతో పట్టుమని పది నిమిషాలు ఫోన్ లో మాట్లాడుకోనివ్వకుండా, రుబ్బురోలుకీ వీడి బతుక్కీ తేడా లేదు అన్నట్టుగా తయారుచేశారు వీణ్ణి. అదేదో సినిమాలో లాగా.. వీడి బతుకు జయమాలిని తాగిన మజ్జిగ్లాసు లాగా తయారైంది. దాని ప్రభావమో ఏంటో.. అంతటి శోగ్గాడు కూడా ఈ మధ్య అ-శోగ్గాడైపోయి వస్తున్నాడు ఆఫీసుకి.

ఆడపిల్లలకి ఉంటే బావుంటుంది అనుకునే పెద్దపెద్ద కళ్ళు వీడికున్నాయి. చుట్టుపక్కల పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళ తల్లులు వాళ్ళని బూచాడికి పట్టిస్తానని చెప్తూ వీణ్ణి చూపిస్తుంటే కిక్కురుమనకుండా
పెట్టింది తిని స్కూల్ కి వెళ్ళొస్తున్నారట ఈ మధ్య. దాంతో ఆ పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతున్నారట. ఆ రకంగా వీడు సమాజానికి గొప్ప సేవ చేస్తూ వీడికి తెలీకుండానే ససేకుడు (సమాజ సేవకుడు) అయిపోయాడు.
సరే... పెళ్లి దగ్గరికొస్తోంది కదా... ఓ పదిహేనిరవై రోజులపాటు సెలవు అడుగుదామని మేనేజర్ దగ్గరికెళ్ళాడు. వాడి గోడు విని మేనేజర్ ఒక్క చూపు చూశాడు. ఆ చూపులో "ఒక పక్కన క్వార్టర్ ఎండింగ్ హడావిడి అవుతుంటే నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా.. ఆయ్.. హన్నా.." అనే అర్ధం..! సీన్ కట్ చేస్తే.. మనవాడు డెస్క్ దగ్గర ఆడిటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. రెండు రోజుల తరవాత మళ్ళీ ఓ సారి బేరం చేద్దాం అని మేనేజర్ దగ్గరికెళ్ళి... సాఆఆర్ అని సాగేసరికి.. 'ఆదివారం కదయ్యా పెళ్లి.. అయితే శనివారం ఒక్కరోజు సెలవు తీసుకో చాలు' అన్నాడట. అది విని 'శనివారం సెలవే కదా సార్' అనేసరికి, 'అవును కదా.. ఈ లెక్కన నీకు అసలు సెలవుతో పనే లేదు. ఇంకేం.. పెళ్ళయ్యాక మామూలుగా సోమవారం ఆఫీసుకి వచ్చేయి' అని చెప్పగానే వీడికి గొంతులో పచ్చి కొబ్బరిబొండాం పడినట్టైంది. సరే, చివరికి ఎలాగో వీడి అదృష్టం పుచ్చి, లాంగ్ లీవ్ మంజూరు అయింది.. పెళ్లి ముందు శుక్రవారం, పెళ్లి తరవాత సోమవారం. దాంతో మనోడు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంతో గంతులేసుకుంటూ వెళ్లి.. మళ్ళీ ఆడిట్ లో తల-మునకలేశాడు.

వేదిక.. పెళ్లి మండటం!!!
తారాగణం... సదరు సోగ్గాడు, పెళ్లి కూతురు, చుట్టుపక్కల జనాలు... వాళ్ళ మధ్యలో ధగధగా మెరుస్తూ వాడి మేనేజర్.
సమయం.. ముహూర్త సమయమే.
సందేహం... పెళ్లికొడుకు మనసులో.
విషయం ఏంటంటే... వీడు చేసేది ఆడిట్ కదా, అది నరనరానా జీర్ణించుకుపోయిందేమో... అసంకల్పితంగానే "ఎవరయ్యా ఈ పని చేసిందీ..." అంటూ ఒక్క అరుపు అరిచేశాడు.
"ఏవైంది అల్లుడు గారూ..." - వాళ్ళ మావగారు..!
"ఏవైందిరా..." - వాళ్ళ నాన్న గారు..!
"ఏవయిందండీ .." - పెళ్లి కూతురు..!
"ఏవైంది బా...బూ.." - వాళ్ళ అత్తగారు..!
(నింపాదిగా - మనసులో) "ఏమయిందబ్బా.." - వాడి మేనేజర్.

ఇంతమంది అరిచింది వాడికి వినిపించలేదు కానీ.. మనసులో ఆరా తీస్తున్న మేనేజర్ గారి మాట మాత్రం మైక్ లో చెప్పినంత స్పష్టంగా వినిపించింది వాడికి. దాంతో వెంటనే ఆయన వైపు చూస్తూ ఖోపంగా... 'చూడండి సార్, ఎవరో ఈ కాంట్రాక్టుని ఆడిట్ చెయ్యకుండానే సబ్మిట్ చేసారు. అసలు దీన్ని ప్రాసెస్ చేసింది ఎవరు, వాళ్ళ పేరు కూడా రాయలేదిక్కడ. మొన్నటికి మొన్న.. మన టీంలో గణేష్ వచ్చి ఆడిట్ చెయ్యమంటూ పేపర్స్ సబ్మిట్ చేస్తే, అందులో బండబూతులున్నాయి. అలాంటిది... జీవితాంతం ప్రభావితం చేసే విషయం.. దీన్ని ఆడిట్ చెయ్యకుండా ఎలా ముందుకెళ్ళేది. ఇలాగైతే ఎలా? నేనొప్పుకోనంతే" అంటూ బెట్టు చేసేసరికి వాళ్ళ మావగారి మొహం ఒక్కసారిగా ఆడిట్ చెయ్యని కాంట్రాక్టు కాపీ లాగా తయారైంది. 'ఇప్పుడా ఆడిట్ గోల అవసరమా.. ప్రశాంతంగా తాళి కట్టరా' అని వాళ్ళ నాన్నగారు చెప్పినా వినట్లేదు. పరిస్థితి వేడెక్కుతోంది. వాళ్ళ మావగారికి ముచ్చెమటలు. ఫైనాన్సు అల్లుడు అంటే ఇంత ఖచ్చితంగా ఉంటాడా అని ఆయనకి తెలిసొచ్చింది ఆ రోజు. పెళ్లికూతురు తరపు వాళ్లకి ఏం చెయ్యాలో తెలీక.. కాళ్ళలో షాక్ లు మొదలయ్యాయి (వీడికి కాబోయేది కరెంట్ పెళ్ళాంలే. ఆ అమ్మాయి ఎలక్ట్రిసిటి డిపార్టుమెంటులో ఇంజనీర్..) ఈలోగా పెళ్లికొడుకు తల్లి.. చిన్నప్పుడు హోంవర్క్ చెయ్యనప్పుడు వాణ్నిచూసిన ఒక హింసాత్మకమైన చూపు చూశారు. అయినా వీడు లొంగలేదు. దాంతో వీడు పెద్దోడైపోయాడని అందరికీ అర్ధమైంది. ఈలోగా నేను కలగజేసుకుని 'ఒరేయ్.. ఆ ఆడిట్ ఏదో నేను చేస్తాలే కానీ, నువ్వు కానీరా' అని చెప్పా. లాభం లేకపోయింది. వీడు ఎర్రబడ్డ ఇన్వాయిస్ మొహంతో ఊగిపోతున్నాడు (కళ్ళు పెద్దవి చేసుకుని..).

ఇంతలో ఆపద్బాంధవుడు.. అదే.. మా మేనేజర్ గొంతెత్తారు. ఆయనకి తెలుసు.. వీడిని ఎలా చల్లబరచాలో. "ప్రస్తుతానికి నేను interim approval ఇస్తున్నాను.. U can proceed" అని SMS పంపించారు. మెయిల్ లో అప్రూవల్ పంపించాను అని చెప్తే వీడు ఉన్నఫళాన పరిగెత్తుకుంటూ వెళ్లి మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటాడేమో అని కూడా అనిపించింది వీడి వాలకం చూస్తుంటే. ఆ SMS చూసుకుని.. అప్పుడు వాడు చల్లబడి.. "తాళి ఎక్కడా.." అని అరిచేసరికి "మింగేస్తా" అన్నట్టుగా బ్రహ్మగారికి వినిపించేసరికి వాడి చేతికి తాళి అందించారు ఆయన. ఈ అదరగండంగాడి వాలకం చూసి సదరు బ్రహ్మగారు బహుశా పెళ్ళిళ్ళు చేయించటం మానేసి ఉంటారని నా అనుమానం. ఒకవేళ చేయిస్తున్నా, ఫైనాన్సు డిపార్టుమెంటులో చేసే పెళ్లి కొడుకుల గురించి బాగా ఆరా తీసి, అందులోనూ అశోక్ అనే పేరుగల వాళ్ళెవరూ లేరని నిర్ధారించుకుని కానీ వెళ్లరేమో పెళ్లి సంభావన తీసుకోటానికి.
పెళ్ళయ్యాక.. వాడి కొలీగ్స్ ని.. అంటే మమ్మల్ని కలవటానికొచ్చి మాట్లాడుతూ, అప్పుడే అటుగా వెళ్తున్న వాడి మరదల్ని పిలిచి ఉన్నట్టుండి నా వైపు తిరిగి.. "అదిరా విషయం" అన్నాడు. పెళ్లి చేసుకున్నందుకు ఒక మరదలు దొరికిందని సంతోషంగా చెప్తున్నాడో.. లేక అందరి ముందూ, ఒకమ్మాయితో మాట్లాడే ధైర్యం వచ్చిందని ఈ తింగరోడు నిరూపించుకుంటున్నాడో మాకు అర్ధం కాలేదు.
భోజనాల దగ్గర మరో తంతు. వంకాయ కూరలో ఉప్పెక్కువైంది.. అసలు ఏ రూల్ ప్రకారం వేశారు ఇంత ఉప్పు? ఎవరయ్యా వీళ్ళకి అనుమతి ఇచ్చింది? టాక్స్ లో తేడా వచ్చేస్తుంది ఇలా అయితే.. పిలవండి వాళ్ళ మేనేజర్ ని.. అప్ప్రూవల్ మెయిల్ ఉందా ఇంత ఉప్పు వెయ్యటానికి... ఠా..ఠూ...ఠ్... అంటూ చిందులేస్తున్నాడు. ఈలోగా వెనక నుండి వీడి మేనేజర్ గారొచ్చి, మొహం మీద చిరుమందహాసంతో వాడి భుజం మీద చేతులేసేసరికి.. వీడు కంట్రోల్ అయ్యాడు. లేదంటే మాడిపోయిన వంకాయ కూర అయిపోయేది పరిస్థితి వీడి ధాటికి.

కాంట్రాక్టు ఆడిట్ అయ్యి ఉండకపోతే.. మేనేజర్ అప్ప్రూవల్ లేనిదే ముందుకు కదలకూడదనే కఠిన నిబంధన వీడిచేత ఎంత పని చేయించిందో ఆ రోజు చూశాం. ఆ మరుసటి రోజు, మేనేజర్... "పెళ్లి కాబోతున్నవాళ్ళెవరైనా సరే... పెళ్ళికి ముందు పదిహేను రోజులపాటు ఆడిట్ లో ఉండకూడదు" అని చెప్తూ, నిబంధనలని సడలించారు.

సోగ్గాడు అ-శోగ్గాడు అవ్వటం...వాడి పెళ్లి ఆఫీసులో నిబంధనలనే ప్రభావితం చెయ్యటం చూశాక...పాపం ఆ కరెంట్ పెళ్ళాం ఈ ఫైనాన్సు మొగుణ్ణి ఎలా భరిస్తోందో అనిపిస్తోంది. వీడెళ్లి ట్రాన్స్ఫార్మర్లకి ఆడిట్ చేస్తున్నాడో.. లేక ఆ అమ్మాయి వచ్చి వీడి కాంట్రాక్టు కాపీలకి ఫ్యూస్ లు అంటిస్తోందో... ఏంటో.. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారో.. అంత అయోమయంగా ఉందిలే.

పెళ్ళైన సంతోషంలో వీడి బుర్ర పని చెయ్యటం మానేసిందని అందరూ అనుకున్నారు.
పెళ్ళైన వత్తిడిలో వీడికి లేని బుర్ర పూర్తిగా పాడైపోయింది అని నేననుకున్నాను.