27, నవంబర్ 2010, శనివారం

అమావాస్య - చంద్రుడు


మాములుగానే వెన్నెల అంటే చాలా ఇష్టం నాకు..! కానీ అదేంటో.. అది ఇష్టం నుండి పిచ్చిలోకి మారిపోయింది ఈ మధ్య..! చంద్రుడంటే ఎందుకంత ఇష్టం అంటే.. ఏమో మరి...తెలీదు...! ఆ మాటకొస్తే...నిండు చంద్రుడే కానక్కర్లేదు...నెలవంక అయినా కూడా తెగ ఇష్టంగా ఉంటుంది నాకు..! ఎంత అందంగా ఉంటాడో చంద్రుడు నెల'వంకర గా ఉన్నప్పుడు కూడా..! తెలుపు రంగు మంచికీ, స్వచ్ఛతకీ మారుపేరు అయితే చల్లదనానికి మారుపేరు చందమామ. చల్లటి హృదయంతో స్వచ్చమైన చంద్రుడు కటిక చీకట్లో నిలబడి ఒక ఆజానుబాహుడిలా నవ్వుతుంటే కేవలం ఆయన పెదవులు మాత్రమే చిరుమందహాసంతో తెల్లగా కనపడుతుంటే మనకిలా నెలవంక లాగా అయిపోయి కనపడుతూ ఉంటాడేమో అనిపిస్తుంది...!
ఒక్కోసారి మరీను...అమావాస్య కోసం ఎంత ఎదురు చూస్తానో.. మరి అమావాస్య వస్తేనే కదా నా నెలవంక ఎదురు పాడేది..! ఈ చీకటి నాకో బహుమతిని ఇస్తూ ఉంటుంది ప్రతి నెల రోజులకో సరి..! అదే..నెలవంక..! ఆకాశంలో చీకటిని నేను ఆరాధిస్తే తరవాత కేవలం మూడు నాలుగు రోజుల్లో నెలవంకని ప్రత్యక్షమయ్యేట్టు చేస్తుంది అదే చీకటి నాకోసం..! మరి చీకటే లేకపోతే నేను నెలవంకని స్పష్టంగా చూడలేనుగా..అందుకే నాకు ఈ విధంగా సహాయం చేస్తున్న చీకటంటే ఏదో తెలియని అభిమానం, ఆప్యాయత..! అందరూ పౌర్ణమి అంటే ఇష్టపడతారు..నాకెందుకో అమావాస్య అంటే కూడా ఇష్టమే..ఎందుకో ఏముంది...ఇందుకేనేమో..! ఎంత చక్కగా నవ్వుతాడో అమావాస్య తరవాత చంద్రుడు..! చిరుమంద హాసంతో మొదలెట్టి రోజుకు కొంచెం చొప్పున తన నవ్వుల శబ్దాన్ని.. అదేలే..బరువుని పెంచుతూ నెమ్మది నెమ్మదిగా మన ముందు పూర్తిగా ప్రత్యక్షమౌతాడు..! అంటే చంద్రుడు కొద్దికొద్దిగా ఆకృతిని దాల్చుతుంటేనే మనం పౌర్ణమి అందాన్ని ఆస్వాదిస్తున్నామేమో..! అమావాస్య తరవాత ఒక్కసారిగా ఉన్నట్టుండి పౌర్ణమి వచ్చేస్తే మనం ఇంతగా  ఆస్వాదించలేమేమో..లేక తట్టుకోలేమేమో..! ఏమో మరి..! చీకటిలో కూడా ఇంత అద్భుతం ఉందా..ఇంత ఆనందం ఉందా..ఇంత అందం ఉందా..?
అంత బానే ఉంది కానీ...మరి నక్షత్రాలెందుకు అలా దోబూచులాడుతూ ఉంటాయి ఒక్కోసారి..వాటికి కూడా మన చంద్రుడు రాకపోతే ఇష్టంగా ఉండదేమో..! ఎట్లా అయితే చంద్రుడు కొద్దికొద్దిగా ఆకారాన్ని పొందుతూ ఉంటాడో ...దానికి తగ్గట్టే ఒక్కొక్క నక్షత్రం బయటికొచ్చి వొళ్ళు విరుచుకుంటూ ఉంటుంది బద్ధకంగా..! మ్... ఎక్కడో ఆకాశంలో ఉన్న వాటికి కూడా ఈ మత్తు ఏంటో... ఈ బద్ధకం ఏంటో..మనకు లాగానే..! ఓ సారెప్పుడో  నేను, మా భరణి గాడు చీకట్లో మా ఇంటి మీద పడుకుని ఆకాశంలో చూస్తూ కబుర్లాడుకుంటూ ఉంటే ఉన్నట్టుండి నాకు అనుమానం వచ్చేసరకి వాణ్ని అడిగాను... "వొరే...ఎందుకురా ఈ రోజు చుక్కలు సరిగ్గా కనిపించట్లేదు ఆకాశంలో" అని..! వాడన్నాడు కదా... "చంద్రుడు లేని ఆకాశం వాటికి కూడా అక్కర్లేదేమోరా" అని..! ఇంతకీ ఆ రోజు అమావాస్య..అదీ విషయం..! అదేంటో...చంద్రుడి కంటే ఎంతో ఎంతెంతో ఎత్తులో ఉండే చుక్కలకి చంద్రుడితో పనేంటో .!
వాటికంటే ఎంతో తక్కువ ఎత్తులో ఉండే ఈయన వల్ల వాటికెందుకో అంత ఆనందం..! సామాన్యంగా ఎవరైనా వాళ్ళకంటే ఎక్కువ ఎత్తులో ఉండేవాళ్ళకోసం చూస్తారు. మరి ఈ చుక్కల తీరేంటో నాకైతే అర్ధం కాలేదు..! హా.. ఆలోచించగా చించగా..నాకో విషయం తట్టింది ఏంటంటే.. మన కంటే ఎక్కువ ఎత్తులో ఉండే వాళ్ళు ఏ విధంగా అయితే మనకి ఆదర్శమో..మన కంటే తక్కువ ఎత్తులో ఉండే వాళ్ళు అదే విధంగా మనకి ఆనందాన్ని కలిగిస్తారేమో అని. కాబట్టి...ఎవరి ఎత్తు ఎంత అనే విశ్లేషణలని పక్కన పెట్టి అటువంటి పోలికలని మానేసి అందరితోను ప్రేమతో, ఆరాధనతో, అభిమానంతో ఉంటే అందరూ ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటారు అనే సందేశాన్ని ఇస్తున్నాయేమో..! అందుకే నక్షత్రాలు వాటి కంటే ఎంతో కిందకి ఉన్న చంద్రుణ్ణి కూడా, వాటిలో ఎటువంటి గర్వము లేకుండా...వినమ్రంగా తలలు వంచి మరీ..కిందికి చూస్తూ ఆరాధిస్తున్నాయేమో..! ఏమో... నిజమేనేమో..!
హా.. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే...అంత ఎత్తున ఉండే చుక్కలు తలలు వంచి మరీ ఆయన్ని చూస్తుంటే..ఆయన కంటే ఎత్తులో ఉన్న చుక్కల కోసం పాకులాడాల్సింది పోయి...ఆయనేమో ఆయనకంటే కింద ఎక్కడో ఉన్న మన కోసం చూస్తూ ఉంటాడు. లోకరక్షకుడు అయినటువంటి విష్ణుమూర్తి బావమరిది కదా.. అంతెందుకు..ఆయన రెండు కళ్ళలో ఒకటి ఈయనే కదా..మరి అంత గొప్ప వాడు అయ్యుండీ, మనకోసం ఆయనకెందుకు ఆరాటం..విచిత్రం కదా..! పైగా మొన్నామధ్య "ఎందుకు మాస్టారు మీకు మాతో.. మీరసలే బిజీ కదా" అని కొంచెంగా దెప్పుతుంటే, నాతో అన్నాడు కదా..."అల్లుడు...మీరంతా లేకపోతే నేను మాత్రం ఉండి ఏం చేస్తాను..నాలో మీరు ఇష్టపడే వెన్నెలని మీ కోసం కాకపోతే మరి ఎవరి కోసం కురిపించాలి....దాన్ని అడవిని కాయాలా.. సముద్రాన కురిపించాలా...అక్కడెవరున్నారు చెప్పు నాకు మాత్రం..! మీరేగా నా ఆత్మీయులు, నా వాళ్ళునూ..! నాకూ, నానుండి కురిసే ఈ వెన్నెలకీ ఓ అర్ధాన్ని పరమార్ధాన్నీ కలిగించింది మీరేగా...మీ మనుషులేగా..నీలాంటి అభిమానులేగా..! మీరే కనుక లేకపోతే ఈ రోజున అసలు నా గురించి మాట్లాడుకునే వారెవరుంటారు చెప్పు..! నాకంటే ఎంతో ఎత్తులో ఉండే నక్షత్రాలు నన్ను చూసి ఆనందించేవే తప్ప ఎప్పుడూ మాట్లాడుకోవు...!" అనేసాడు..పిచ్చి మావయ్య..! చూసావా..ఆయన నుండి వచ్చే వెన్నెలనీ..దాని గొప్పతనాన్నీ, ఇంకా ఆయన ప్రత్యేకతలనీ ...ఇలా అన్నిటినీ మనకే ఆపాదించేసి మనకే గొప్పదనాన్ని తెచ్చిపెట్టాడు..! పిచ్చభిమానం కదూ..! ఏంటో.. ఈ అభిమానాలు...ఆప్యాయతలు..! మనమేం ఇచ్చామని ఆయనకీ, మనమంటే అంత ఇష్టం..! పైగా...పర్యావరణాన్ని పాడు చేసి ఆయనకి కూడా మచ్చ తెచ్చిపెడుతున్నాం  మనం..!
అందుకే పెద్ద వాళ్ళు అంటూ ఉంటారేమో..అందరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటూనే ఉంటుంది అనీ! లేకపోతే మరి అందరినీ ఎందుకు సృష్టించాడు ఈ విధాత..! మానసికంగా పిచ్చి వాడి వల్ల కూడా ఏదో జరగాల్సి ఉందేమో...అందుకే సృష్టించాడేమో..! ఏమో..! ఆ క్షణాన ఎవరెక్కడుంటే ఏంలే..ప్రతి వాళ్ళు ఏదో సాధించాలి...ఏదో చెయ్యాలి...ఏదో నిర్వర్తించాలి...వాళ్ళెంత ఎత్తులో ఉన్నారన్నదాంతో సంబంధం లేకుండా..!