7, జులై 2011, గురువారం

చెత్త బుట్ట

అతి తక్కువ ధరలో దొరికినా మనిషికి అత్యంత విలువైన వస్తువు, చెత్త బుట్ట. దీన్ని మేనేజ్ చెయ్యటంలో ఒక్కరోజు తేడా వస్తే చాలు, మన  బతుకుల్ని దుర్గంధభరితం చెయ్యగల శక్తి దీని సొంతం. దాని తీవ్రత ఎంతలా ఉంటుందంటే.. చివరికి అసలీ దుర్గంధం అంతా మన వల్లేనా.. మనం తిన్న ఆహారం వల్లేనా.. అంటే మనం ఇంత దుర్గంధభరితమైన ఆహారాన్ని రెచ్చిపోయి మరీ మేస్తున్నామా అనే అనుమానాలొచ్చి మన మీద మనకే అసహ్యం పుట్టించేంత! అయితే ఇక్కడ కేవలం తినే వస్తువుల కారణంగానే వస్తోందా ఆ దుర్గంధం. లేదు, ఈ గంధానికి కారణం.. ఆకులూ, చెత్త కాగితాలూ, తొక్కలు - ఇలా ఇంకా రకరకాల వస్తువులు. అయితే చాలా రోజుల వరకు చెత్త అంటే ఇదే అని అనుకునేవాణ్ణి. కానీ తరవాత్తరవాత శానా విషయాలు తెలిసిపోయినాయి నాకు. ఎలాగంటే - ఇప్పుడూ... దేవుడి విషయంలో "ఇందుగలడందు లేడని లేదు ఎందెందు వెదకిన అందందే గలడు" అనే మాట నిజం. కాకపోతే మనం వెతకగలగాలి; వెతికినా కనిపించాలి; కనిపించినా మనం చూడగలగాలి. కానీ ఈ మధ్య నేను కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే.. చెత్త "ఎందెందు చూసిన అందందే కలదు" అని. అంటే దైవం వెతికితే కానీ కనిపించదు. చెత్త దర్శనం మాత్రం.. చూడాలి అని జస్ట్ అలా మనసులో అనుకుని, ప్రయత్నిస్తే చాలు.. ఎక్కడైనా సరే.. ఎందులో అయినా సరే కనిపించేస్తుంది. అంత కరుణామయి ఈ చెత్త దేవత. ఈ చెత్తలో నేను తెలుసుకున్న రకాలు చాలానే ఉన్నాయి కానీ.. ముఖ్యమైనవి కొన్ని చెప్తాను. వాటిలో మొదటిది... సరే, అందరికీ తెలిసిందే. నేను ఇందాకే చెప్పేశాను. అదే.. రోజువారీ దానికి చెయ్యాల్సిన గౌరవ మర్యాదలు దానికి చెయ్యకపోతే.. ఒక కంటితో  ఆర్తితోను, ఇంకో కంటితో కోపం గాను అలా నోరు తెరుచుకుని మన వైపు ఆరాటంగా చూస్తూ ఉండే చెత్త బుట్టలోని చెత్త.
 
ఇప్పుడు మరో రకం ఏంటంటే.. డిజిటల్ చెత్త. అబ్బో... ఇది శానా డేంజర్ లే. ఎందుకంటే.. ఈ చెత్త వాసన ఒకసారి చూశామా.. ఇహ అది వ్యసనం అయిపోతుంది. ఓ రెండుమూడేళ్ళ క్రితం నేను కూడా చూశాను దీని వాసన. మా  ఫ్రెండ్ ఒకడున్నాడులే.. వాడి ప్రోద్బలంతో చవి చూసిన అనుభూతి ఇది. అంతే.. ఇక అప్పటి నుండి అదేదో  మధురమైన జాజి మల్లెల వాసన చూడటానికి  పరితపించిపోతున్నట్టుగా.. ఈ డిజిటల్ చెత్త వాసన చూడటానిక్కూడా పరితపించిపోయేవాళ్ళం. కొంతమందికి అయితే తిండి తినటం ఓ గంట ఆలస్యమైనా ఫరవాలేదు కానీ దీని వాసన చూడకపోతే మాత్రం నాలుక పిడచ కట్టుకుపోతున్నట్టు, కళ్ళు నీరసంతో ఊడి పడిపోతాయేమో అన్నట్టూ.. ఇలా రకరకాల మానసిక శారీరక ఇబ్బందులు పడిపోయేంతలా అలవాటైపోయింది. పైగా దానికి ఇంగ్లీష్ లో ఒక ముద్దు పేరు.. స్క్రాప్ బుక్ అంటూ! దీని పేరుకి తగ్గట్టే ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళంతా నానా చెత్త విషయాలనీ మాట్లాడేసుకుంటూ ఉంటారు. చివరికి పొద్దున్నే ముక్కు చీదేప్పుడు ఎవరికైనా తుమ్ము వస్తే.. అది కూడా 'బిన్ లాడెన్ ని అమెరికా సైన్యం తుదముట్టించింది' అన్నంత ముఖ్యమైన సమాచారం అన్నట్టుగా చీదటం  మధ్యలో ఆపేసి మరీ వచ్చి.. వాళ్ళ ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ 'ఇప్పుడే అందిన వార్తా' అని అరుచుకుంటూ మరీ చెప్పేస్తారు. దాన్ని చదివిన వాళ్ళంతా పూల బొకేలతో సదరు వ్యక్తికి ప్రగాఢ పరామర్శ ఒకటీ. ఈ మధ్య ఈ చెత్త అందరికీ కనిపించేట్టుగా ఉందనే భావనతో.. దాన్ని కప్పి పెట్టేలా మూత ఉన్న చెత్త కుండీలు కావాలని జనం కోరుకుంటున్నారన్న విషయం కొంత మందికి తెలిసిందేమో.. దాంతో వెంటనే కొత్త ప్యాంటు షర్టు వేసుకుని వచ్చేసి మరీ.. ఒక కొత్త అందమైన చెత్తకుండీని తయారు చేసి ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క చెత్తబుట్టని చేతిలో పెట్టి మరీ వెళ్ళారు. దానికి ఇంకో అందమైన పేరు.. "ముఖ పుస్తకం" అని.  మనసులో ఉండే చెత్తనంతా అవతలి వాళ్ళ మొహాన్ని పుస్తకంగా చేసుకుని అక్కడ కక్కి పారేయి.. అదేలెండి.. అక్కడ రాసి పారెయ్యండి అని చెప్తున్నట్టుగా.. ఫేస్ బుక్ అంటూ ఒక  కొత్త చెత్తకుండి..! "ఒక కొత్త చెత్తకుండి" అన్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన  విషయం ఏంటంటే.. కొత్త చెత్త వేసుకునే కుండి అని కాదు. చెత్త పాతదే.. దాన్ని వేసుకునే కుండీ మాత్రం కొత్తది అని. అంటే "old wine in new bottle" లాగా అన్నమాట. వైన్ పాతబడుతున్న కొద్దీ ఎంత భీభత్సమైన వాసన వస్తూ మందుబాబులకి కిక్కెక్కిస్తుందో... చెత్త కూడా ఓల్డ్ అవుతున్న కొద్దీ మాంచి కిక్కెక్కిస్తూ ఉంటుంది ఇక్కడి డిజిటల్ జనాలకి. డిజిటల్ జనాలంటే వాళ్ళెవరో మర మనుషులనుకునేరు.. కానే కాదు. డిజిటల్ చెత్తకి అలవాటు పడ్డ జనాలు అని నా ఉద్దేశ్యం. అవును మరి.. మాటలు ఎంత చెత్తగా ఉన్నా సరే.. ఎంత విసుగు తెప్పించేవిగా ఉన్నా సరే.. ఇవే మాటల్ని మాట్లాడుకునే మనుషులు రోజురోజుకీ పెరుగుతున్నారు అంటే ఏంటీ.. దీని కంపు.. సారీ.. దీని సువాసన వీళ్ళందరికీ మత్తెక్..కాదు.. కిక్కెక్కిస్తోంది అనే కదా.

మనన్ని మభ్య పెడుతున్న మరో చెత్త... సినిమా చెత్త. ఒకానొకప్పుడు.. అంటే రంగుల బొమ్మలు లేని రోజుల్లో.. సినిమా అనేది ఒక అద్భుతమైన కళ... అదొక అందమైన కళాత్మక రంగం అని పేరు. దానికి తగ్గట్టే మంచి మంచి చిత్రాలెన్నో వచ్చేవి. రంగుల ప్రపంచం ఆవిష్కృతం అయ్యాక కూడా చాలానే మంచి చిత్రాలొచ్చాయి. కానీ ఎటొచ్చీ.. ఒక నాలుగైదారేడెనిమిదేళ్ళుగా వచ్చిన సినిమాలలో పట్టుమని పది సినిమాలని కూడా మంచివి అని చెప్పలేకపోతున్నాం. దీనిక్కారణం కూడా ఎవరో కాదండోయ్... మనమే. కధ ఎటువంటిదైనా, నటీనటులెవరైనా, ఆ చిత్రాన్ని నిర్మించేది ఎవరైనా.. ఇవన్నీ అనవసరం. సినిమా హాల్ కి వెళ్ళామా.. కొంచెం సేపు అక్కడ కూర్చున్నామా.. వాడు చూపించిన చెత్తని చూశామా.. ఎంతసేపు ఇదే తప్ప.. ఆ సినిమా ఏంటీ.. అందులో చూపించింది ఏంటీ.. ఆ చిత్రం ద్వారా మనకి చెప్పాలనుకున్న సందేశం ఏంటీ.. ఇవేమీ చూడకుండా మనం వెళ్లిపోతూ ఉంటాం, వాటి వెంట పరిగెత్తుతూ. ఇటువంటి మనన్ని చూసి.. అసలు కధ ఏదైనా ఫరవాలేదు.. ఇటువంటి జనాలున్నంత వరకు మనకు ధోకా లేదు అని అనుకుంటూ... సినీ దర్శకులు జనమేజయులు అయిపోతున్నారు. జనమేజయులు అంటే.. ఇటువంటి తింగరి జనాల వల్ల అజేయులు అయ్యేవారు అని తెలుగు సాహిత్యం కొత్తగా చెప్తున్న అర్ధం. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నాక ఇక్కడ ఎవరు చెత్త అనేది చెప్పటం నా వల్ల కావట్లేదు. ఎందుకంటే ఇటువంటి సినిమాలు తీస్తున్నందుకు గాను దర్శకులు, నిర్మాతలని చెత్త అనాలా? లేక ఈ సినిమాల్లో నటించే కళాకారులని చెత్త అనాలా? లేక వీటిని ప్రోత్సహిస్తూ ఆనందిస్తున్న జనాలని చెత్త అనాలా? నాకైతే చివరిది సరి అయిందేమో అనిపిస్తోంది.
 
ఇకపోతే మరో రకం చెత్త. ఇది కొంచెం భయంకరమైంది. అయితే అసలీ చెత్త ఏంటి, ఇది ఏ రకానికి చెందింది అనే దాన్ని చెప్పటానికి ముందు నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే.. సృష్టిలో ఏదీ వ్యర్ధం కాదు. వ్యర్ధం అనేది లేదు అనేదాన్ని నిజం చేద్దాం అని అనుకున్నారేమో; పైగా రాష్ట్రంలో చెత్త బాగా  పేరుకుపోతోందీ.. దీని వల్ల చాలా పర్యావరణ, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి; పైగా పెరుగుతున్న జనాభాకి కావలసినంత ఇంధనం కూడా మన దగ్గర లేదు; వీటన్నికి చక్కటి పరిష్కారం.. చెత్త నుండి  ఇంధనం/ విద్యుత్తూ తయారు చెయ్యటమే.. కాబట్టి ఆ  విధంగా మనం ముందుకెళ్దాం అని అంటూ ఒక చక్కటి ఉపాయంతో ముందుకొచ్చింది అప్పటి చంద్రబాబునాయిడు గారి ముఖ్యమంత్రిత్వం. మరి అది ఏ కాలనీలో చెత్తకుండీ వరకు ముందుకెళ్ళిందో, ఎంతవరకు ఈ కల సాకారమైందో నాకు తెలీదు కానీ.. ఆలోచన అయితే చాలా మంచిది. చెత్త తగ్గుతుంది. ఇంధనం పెరుగుతుంది. జనం అవసరాలు తీరుతాయి కూడాను. సరే, ఇప్పుడు  విషయానికొస్తే.. మరో రకం చెత్త ఏదైతే ఉందో.. అది ఇలా దేనికోసమైనా సదుపయోగం చెయ్యదగింది కూడా కాదు. అదేంటీ.. సృష్టిలో ఏదీ వ్యర్ధం కానేరదు అని కదా అన్నావు అని అడుగుతారేమో. నిజమే.. కానీ నాక్కూడా ఈ మధ్యే తెలిసింది; అసలేమాత్రం పనికి రానివీ, ఉపయోగించలేనివీ, పైగా మానవాళికి చాలా నష్టాన్ని తెచ్చిపెట్టేవి కూడా ఉన్నాయని.
 
రకరకాల ఆపరేషన్లలో ఉపయోగించటం వల్ల నానా రకాల మరకలు పడ్డ దూది.. కొన్ని నాలాల నుండి మురుగుకంపు కొట్టే చెత్త.. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో కలిపే భయంకరమైన రసాయన వ్యర్ధాలు.. కొన్ని నదుల నుండి తీసి బయటపడేసే కొన్ని జంతువుల మృత కళేబరాలు.. ఇలా రకరకాల చెత్త కనిపిస్తూ ఉంటుంది. వాటి నుండి వచ్చే వాసన సంగతి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే దేనికీ పనికి రాకుండా ఉండే చెత్త నిజానికి ఇది కాదు, కానీ వీటన్నిటినీ ఎందుకు చెప్తున్నానంటే.. ఇక్కడ నేను చెప్పిన ఈ మూడు నాలుగు రకాల చెత్తనీ ఎప్పుడైనా లారీలలో తీసుకెళ్ళి.. అక్కడెక్కడో డంప్ చెయ్యటం కంట పడితే.. చెత్తని డంప్ చేస్తున్నట్టుగా కనిపించదు నాకు. ఉదాహరణకి.. హుస్సేన్ సాగర్ విషయమే తీసుకుంటే.. ఆ రసాయనిక  చెత్తని డంప్ చేస్తుంటే.. అతి ప్రమాదకరమైన కొంతమంది రాయలసీమ ప్రజా నాయకుల (?) ని డంప్ చేస్తున్నట్టుగా; ఆసుపత్రుల దూదిని డంప్ చేస్తుంటే.. వోక్స్ వాగెన్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి రాకపోవటానికి కారణమైన ఒక చెత్త
నాయకుడిని డంప్ చేస్తున్నట్టుగా; మృత కళేబరాలని డంప్ చేస్తున్నప్పుడేమో.. రాష్ట్రంలో అసలు 'లా అండ్ ఆర్డర్' అనేది ఉందా అనే అనుమానం వచ్చేట్టుగా పాలన సాగిస్తున్న కొన్ని రాజ-కిరణాలని డంప్ చేస్తున్నట్టుగా; నాలాల నుండి తీసిన చెండాలమైన మురికిని డంప్ చేస్తుంటే.. తెలంగాణా పేరుతో సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్న వ్యక్తి.. ఇలా ఒక్కో రకమైన చెత్తకీ ఒక్కో రాజకీయ నాయకుడు/రాలు గుర్తొస్తూ ఉంటారు నాకు. ఇదంతా రాజకీయానికి చెందిన చెత్త అని నాకనిపిస్తోంది.
 
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద చెత్త పురాణమే తయారవుతుంది. మొత్తం చదివేశాక అసలిక్కడ రాసిందంతా ఒక చెత్త అని అనిపించుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే.. ఈ పెపంచకంలో నానా రకాల చెత్త బుట్టలూ ఉన్నాయని చెప్పుకుంటూ పోయి చివరికి నేను రాసిన దానికే "చెత్త బుట్ట" నామకరణం జరక్కూదడనే ఉద్దేశ్యంతో ఇక్కడితో నా చేత్తోపాఖ్యానాన్ని ఆపేస్తున్నాను. లేదంటే నిజంగానే ఇదొక చెత్త బుట్ట అయిపోతుంది.