2, అక్టోబర్ 2011, ఆదివారం

చిక్కితే చిక్కు

ఆంద్రజ్యోతి పత్రికలో నేను చదివిన ఒక హాస్య శీర్షిక ఇక్కడ మీ కోసం. అక్కడ ఉన్నదాన్ని నా మాటల్లో చెప్తున్నాను.

ఒక వ్యక్తి బరువు తగ్గాలనుకున్నాడు.  అందుకోసం ఒక పేరున్న క్లినిక్ ని సంప్రదించి వివరాలు తీసుకున్నాడు. అయిదు రోజుల్లో అయిదు కేజీలు తగ్గిస్తామన్నారు వాళ్ళు. ఈ పెద్దాయన సరేనన్నాడు.
మర్నాడు ఉదయం ఓ అందమైన యువతి ఈయన ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. కాళ్ళకి షూస్, ప్యాంటు షర్టు వేసుకున్న ఆమె మెడలో "నన్ను పట్టుకుంటే నేను నీ దాన్ని" అనే బోర్డు. అది చూసాక, ఇంకేముంది.. ఇలాంటి అమ్మాయి దక్కితే అంతకంటే కావలసింది లేదు అనుకుని, వెంటపడటం మొదలెట్టాడు. పరిగెత్తీ పరిగెత్తీ అలసట వచ్చిందే కానీ అమ్మాయి దక్కలేదు. ఇలా అయిదు రోజులు గడిచాయి. తరవాత చూసుకుంటే నిజంగానే అయిదు కేజీలు తగ్గాడు.

మన వాడికి ఉత్సాహం వచ్చి.. వాళ్లకి ఫోన్ చేసి - నేను ఇంకా బరువు తగ్గాలి అని చెప్పాడు. సరే అయితే.. ఈ సారి అయిదు రోజుల్లో పది కేజీలు అని చెప్పారు వాళ్ళు.

మరుసటి రోజు పొద్దున్నే తలుపు తట్టింగ్... మన వాడు డోర్ ఓపెనింగ్. ఈ సారి అంతకు ముందు వచ్చిన అమ్మాయి కంటే కూడా అద్భుత సౌందర్యవతి వచ్చింది.. మెడలో మళ్ళీ అవే మాటలతో బోర్డు... "నన్ను పట్టుకుంటే నేను నీ దాన్నే..". ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిని వదులుకోకూడదని నిశ్చయించుకుని వెంట పడటం మొదలుపెట్టాడు. ఇలా అయిదు రోజుల నిర్విరామ కృషితో మన వాడు నిజంగానే పది కేజీలు తగ్గాడు. అమ్మాయి దక్కలేదే అని ఒకింత నిరాశ కలిగినా, బరువు విషయం గుర్తొచ్చి, ఇదేదో బావుందే అని అనుకుని, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ఫోన్ చేసి నేను ఇంకా బరువు తగ్గాలనుకుంటున్నాను అని చెప్పాడు. అది విని వాళ్ళు.. ఈ సారి ఏడు రోజుల్లో పాతిక కిలోలు, కానీ ఇది క్లిష్టమైన పని అని చెప్పారు. ఫరవాలేదు సిద్ధమే అని చెప్పాడు సదరు పెద్దాయన.

మర్నాడు పొద్దున ఎప్పటికంటే కూడా గట్టిగా తలుపు కొట్టిన చప్పుడయ్యేసరికి, వెళ్లి తలుపు తీశాడు ఈయన. తీరా చూస్తే.. అక్కడ ఒక దృఢకాయుడు నిలబడి ఉన్నాడు. అతని మెడలో ఉన్న బోర్డు చూశాక మన వాడు, ఈ సారి క్లినిక్ వాళ్ళు చెప్పినదాని కన్నా.. ఓ అయిదు కిలోలు ఎక్కువే తగ్గాడు. ఇంతకీ అతని మెడలో ఉన్న బోర్డు చెప్పిన మాట ఇదీ... "నేను నిన్ను పట్టుకుంటే నువ్వు నా వాడివవుతావు...."

.............!!!???

7, జులై 2011, గురువారం

చెత్త బుట్ట

అతి తక్కువ ధరలో దొరికినా మనిషికి అత్యంత విలువైన వస్తువు, చెత్త బుట్ట. దీన్ని మేనేజ్ చెయ్యటంలో ఒక్కరోజు తేడా వస్తే చాలు, మన  బతుకుల్ని దుర్గంధభరితం చెయ్యగల శక్తి దీని సొంతం. దాని తీవ్రత ఎంతలా ఉంటుందంటే.. చివరికి అసలీ దుర్గంధం అంతా మన వల్లేనా.. మనం తిన్న ఆహారం వల్లేనా.. అంటే మనం ఇంత దుర్గంధభరితమైన ఆహారాన్ని రెచ్చిపోయి మరీ మేస్తున్నామా అనే అనుమానాలొచ్చి మన మీద మనకే అసహ్యం పుట్టించేంత! అయితే ఇక్కడ కేవలం తినే వస్తువుల కారణంగానే వస్తోందా ఆ దుర్గంధం. లేదు, ఈ గంధానికి కారణం.. ఆకులూ, చెత్త కాగితాలూ, తొక్కలు - ఇలా ఇంకా రకరకాల వస్తువులు. అయితే చాలా రోజుల వరకు చెత్త అంటే ఇదే అని అనుకునేవాణ్ణి. కానీ తరవాత్తరవాత శానా విషయాలు తెలిసిపోయినాయి నాకు. ఎలాగంటే - ఇప్పుడూ... దేవుడి విషయంలో "ఇందుగలడందు లేడని లేదు ఎందెందు వెదకిన అందందే గలడు" అనే మాట నిజం. కాకపోతే మనం వెతకగలగాలి; వెతికినా కనిపించాలి; కనిపించినా మనం చూడగలగాలి. కానీ ఈ మధ్య నేను కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే.. చెత్త "ఎందెందు చూసిన అందందే కలదు" అని. అంటే దైవం వెతికితే కానీ కనిపించదు. చెత్త దర్శనం మాత్రం.. చూడాలి అని జస్ట్ అలా మనసులో అనుకుని, ప్రయత్నిస్తే చాలు.. ఎక్కడైనా సరే.. ఎందులో అయినా సరే కనిపించేస్తుంది. అంత కరుణామయి ఈ చెత్త దేవత. ఈ చెత్తలో నేను తెలుసుకున్న రకాలు చాలానే ఉన్నాయి కానీ.. ముఖ్యమైనవి కొన్ని చెప్తాను. వాటిలో మొదటిది... సరే, అందరికీ తెలిసిందే. నేను ఇందాకే చెప్పేశాను. అదే.. రోజువారీ దానికి చెయ్యాల్సిన గౌరవ మర్యాదలు దానికి చెయ్యకపోతే.. ఒక కంటితో  ఆర్తితోను, ఇంకో కంటితో కోపం గాను అలా నోరు తెరుచుకుని మన వైపు ఆరాటంగా చూస్తూ ఉండే చెత్త బుట్టలోని చెత్త.
 
ఇప్పుడు మరో రకం ఏంటంటే.. డిజిటల్ చెత్త. అబ్బో... ఇది శానా డేంజర్ లే. ఎందుకంటే.. ఈ చెత్త వాసన ఒకసారి చూశామా.. ఇహ అది వ్యసనం అయిపోతుంది. ఓ రెండుమూడేళ్ళ క్రితం నేను కూడా చూశాను దీని వాసన. మా  ఫ్రెండ్ ఒకడున్నాడులే.. వాడి ప్రోద్బలంతో చవి చూసిన అనుభూతి ఇది. అంతే.. ఇక అప్పటి నుండి అదేదో  మధురమైన జాజి మల్లెల వాసన చూడటానికి  పరితపించిపోతున్నట్టుగా.. ఈ డిజిటల్ చెత్త వాసన చూడటానిక్కూడా పరితపించిపోయేవాళ్ళం. కొంతమందికి అయితే తిండి తినటం ఓ గంట ఆలస్యమైనా ఫరవాలేదు కానీ దీని వాసన చూడకపోతే మాత్రం నాలుక పిడచ కట్టుకుపోతున్నట్టు, కళ్ళు నీరసంతో ఊడి పడిపోతాయేమో అన్నట్టూ.. ఇలా రకరకాల మానసిక శారీరక ఇబ్బందులు పడిపోయేంతలా అలవాటైపోయింది. పైగా దానికి ఇంగ్లీష్ లో ఒక ముద్దు పేరు.. స్క్రాప్ బుక్ అంటూ! దీని పేరుకి తగ్గట్టే ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళంతా నానా చెత్త విషయాలనీ మాట్లాడేసుకుంటూ ఉంటారు. చివరికి పొద్దున్నే ముక్కు చీదేప్పుడు ఎవరికైనా తుమ్ము వస్తే.. అది కూడా 'బిన్ లాడెన్ ని అమెరికా సైన్యం తుదముట్టించింది' అన్నంత ముఖ్యమైన సమాచారం అన్నట్టుగా చీదటం  మధ్యలో ఆపేసి మరీ వచ్చి.. వాళ్ళ ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ 'ఇప్పుడే అందిన వార్తా' అని అరుచుకుంటూ మరీ చెప్పేస్తారు. దాన్ని చదివిన వాళ్ళంతా పూల బొకేలతో సదరు వ్యక్తికి ప్రగాఢ పరామర్శ ఒకటీ. ఈ మధ్య ఈ చెత్త అందరికీ కనిపించేట్టుగా ఉందనే భావనతో.. దాన్ని కప్పి పెట్టేలా మూత ఉన్న చెత్త కుండీలు కావాలని జనం కోరుకుంటున్నారన్న విషయం కొంత మందికి తెలిసిందేమో.. దాంతో వెంటనే కొత్త ప్యాంటు షర్టు వేసుకుని వచ్చేసి మరీ.. ఒక కొత్త అందమైన చెత్తకుండీని తయారు చేసి ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క చెత్తబుట్టని చేతిలో పెట్టి మరీ వెళ్ళారు. దానికి ఇంకో అందమైన పేరు.. "ముఖ పుస్తకం" అని.  మనసులో ఉండే చెత్తనంతా అవతలి వాళ్ళ మొహాన్ని పుస్తకంగా చేసుకుని అక్కడ కక్కి పారేయి.. అదేలెండి.. అక్కడ రాసి పారెయ్యండి అని చెప్తున్నట్టుగా.. ఫేస్ బుక్ అంటూ ఒక  కొత్త చెత్తకుండి..! "ఒక కొత్త చెత్తకుండి" అన్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన  విషయం ఏంటంటే.. కొత్త చెత్త వేసుకునే కుండి అని కాదు. చెత్త పాతదే.. దాన్ని వేసుకునే కుండీ మాత్రం కొత్తది అని. అంటే "old wine in new bottle" లాగా అన్నమాట. వైన్ పాతబడుతున్న కొద్దీ ఎంత భీభత్సమైన వాసన వస్తూ మందుబాబులకి కిక్కెక్కిస్తుందో... చెత్త కూడా ఓల్డ్ అవుతున్న కొద్దీ మాంచి కిక్కెక్కిస్తూ ఉంటుంది ఇక్కడి డిజిటల్ జనాలకి. డిజిటల్ జనాలంటే వాళ్ళెవరో మర మనుషులనుకునేరు.. కానే కాదు. డిజిటల్ చెత్తకి అలవాటు పడ్డ జనాలు అని నా ఉద్దేశ్యం. అవును మరి.. మాటలు ఎంత చెత్తగా ఉన్నా సరే.. ఎంత విసుగు తెప్పించేవిగా ఉన్నా సరే.. ఇవే మాటల్ని మాట్లాడుకునే మనుషులు రోజురోజుకీ పెరుగుతున్నారు అంటే ఏంటీ.. దీని కంపు.. సారీ.. దీని సువాసన వీళ్ళందరికీ మత్తెక్..కాదు.. కిక్కెక్కిస్తోంది అనే కదా.

మనన్ని మభ్య పెడుతున్న మరో చెత్త... సినిమా చెత్త. ఒకానొకప్పుడు.. అంటే రంగుల బొమ్మలు లేని రోజుల్లో.. సినిమా అనేది ఒక అద్భుతమైన కళ... అదొక అందమైన కళాత్మక రంగం అని పేరు. దానికి తగ్గట్టే మంచి మంచి చిత్రాలెన్నో వచ్చేవి. రంగుల ప్రపంచం ఆవిష్కృతం అయ్యాక కూడా చాలానే మంచి చిత్రాలొచ్చాయి. కానీ ఎటొచ్చీ.. ఒక నాలుగైదారేడెనిమిదేళ్ళుగా వచ్చిన సినిమాలలో పట్టుమని పది సినిమాలని కూడా మంచివి అని చెప్పలేకపోతున్నాం. దీనిక్కారణం కూడా ఎవరో కాదండోయ్... మనమే. కధ ఎటువంటిదైనా, నటీనటులెవరైనా, ఆ చిత్రాన్ని నిర్మించేది ఎవరైనా.. ఇవన్నీ అనవసరం. సినిమా హాల్ కి వెళ్ళామా.. కొంచెం సేపు అక్కడ కూర్చున్నామా.. వాడు చూపించిన చెత్తని చూశామా.. ఎంతసేపు ఇదే తప్ప.. ఆ సినిమా ఏంటీ.. అందులో చూపించింది ఏంటీ.. ఆ చిత్రం ద్వారా మనకి చెప్పాలనుకున్న సందేశం ఏంటీ.. ఇవేమీ చూడకుండా మనం వెళ్లిపోతూ ఉంటాం, వాటి వెంట పరిగెత్తుతూ. ఇటువంటి మనన్ని చూసి.. అసలు కధ ఏదైనా ఫరవాలేదు.. ఇటువంటి జనాలున్నంత వరకు మనకు ధోకా లేదు అని అనుకుంటూ... సినీ దర్శకులు జనమేజయులు అయిపోతున్నారు. జనమేజయులు అంటే.. ఇటువంటి తింగరి జనాల వల్ల అజేయులు అయ్యేవారు అని తెలుగు సాహిత్యం కొత్తగా చెప్తున్న అర్ధం. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నాక ఇక్కడ ఎవరు చెత్త అనేది చెప్పటం నా వల్ల కావట్లేదు. ఎందుకంటే ఇటువంటి సినిమాలు తీస్తున్నందుకు గాను దర్శకులు, నిర్మాతలని చెత్త అనాలా? లేక ఈ సినిమాల్లో నటించే కళాకారులని చెత్త అనాలా? లేక వీటిని ప్రోత్సహిస్తూ ఆనందిస్తున్న జనాలని చెత్త అనాలా? నాకైతే చివరిది సరి అయిందేమో అనిపిస్తోంది.
 
ఇకపోతే మరో రకం చెత్త. ఇది కొంచెం భయంకరమైంది. అయితే అసలీ చెత్త ఏంటి, ఇది ఏ రకానికి చెందింది అనే దాన్ని చెప్పటానికి ముందు నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే.. సృష్టిలో ఏదీ వ్యర్ధం కాదు. వ్యర్ధం అనేది లేదు అనేదాన్ని నిజం చేద్దాం అని అనుకున్నారేమో; పైగా రాష్ట్రంలో చెత్త బాగా  పేరుకుపోతోందీ.. దీని వల్ల చాలా పర్యావరణ, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి; పైగా పెరుగుతున్న జనాభాకి కావలసినంత ఇంధనం కూడా మన దగ్గర లేదు; వీటన్నికి చక్కటి పరిష్కారం.. చెత్త నుండి  ఇంధనం/ విద్యుత్తూ తయారు చెయ్యటమే.. కాబట్టి ఆ  విధంగా మనం ముందుకెళ్దాం అని అంటూ ఒక చక్కటి ఉపాయంతో ముందుకొచ్చింది అప్పటి చంద్రబాబునాయిడు గారి ముఖ్యమంత్రిత్వం. మరి అది ఏ కాలనీలో చెత్తకుండీ వరకు ముందుకెళ్ళిందో, ఎంతవరకు ఈ కల సాకారమైందో నాకు తెలీదు కానీ.. ఆలోచన అయితే చాలా మంచిది. చెత్త తగ్గుతుంది. ఇంధనం పెరుగుతుంది. జనం అవసరాలు తీరుతాయి కూడాను. సరే, ఇప్పుడు  విషయానికొస్తే.. మరో రకం చెత్త ఏదైతే ఉందో.. అది ఇలా దేనికోసమైనా సదుపయోగం చెయ్యదగింది కూడా కాదు. అదేంటీ.. సృష్టిలో ఏదీ వ్యర్ధం కానేరదు అని కదా అన్నావు అని అడుగుతారేమో. నిజమే.. కానీ నాక్కూడా ఈ మధ్యే తెలిసింది; అసలేమాత్రం పనికి రానివీ, ఉపయోగించలేనివీ, పైగా మానవాళికి చాలా నష్టాన్ని తెచ్చిపెట్టేవి కూడా ఉన్నాయని.
 
రకరకాల ఆపరేషన్లలో ఉపయోగించటం వల్ల నానా రకాల మరకలు పడ్డ దూది.. కొన్ని నాలాల నుండి మురుగుకంపు కొట్టే చెత్త.. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో కలిపే భయంకరమైన రసాయన వ్యర్ధాలు.. కొన్ని నదుల నుండి తీసి బయటపడేసే కొన్ని జంతువుల మృత కళేబరాలు.. ఇలా రకరకాల చెత్త కనిపిస్తూ ఉంటుంది. వాటి నుండి వచ్చే వాసన సంగతి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే దేనికీ పనికి రాకుండా ఉండే చెత్త నిజానికి ఇది కాదు, కానీ వీటన్నిటినీ ఎందుకు చెప్తున్నానంటే.. ఇక్కడ నేను చెప్పిన ఈ మూడు నాలుగు రకాల చెత్తనీ ఎప్పుడైనా లారీలలో తీసుకెళ్ళి.. అక్కడెక్కడో డంప్ చెయ్యటం కంట పడితే.. చెత్తని డంప్ చేస్తున్నట్టుగా కనిపించదు నాకు. ఉదాహరణకి.. హుస్సేన్ సాగర్ విషయమే తీసుకుంటే.. ఆ రసాయనిక  చెత్తని డంప్ చేస్తుంటే.. అతి ప్రమాదకరమైన కొంతమంది రాయలసీమ ప్రజా నాయకుల (?) ని డంప్ చేస్తున్నట్టుగా; ఆసుపత్రుల దూదిని డంప్ చేస్తుంటే.. వోక్స్ వాగెన్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి రాకపోవటానికి కారణమైన ఒక చెత్త
నాయకుడిని డంప్ చేస్తున్నట్టుగా; మృత కళేబరాలని డంప్ చేస్తున్నప్పుడేమో.. రాష్ట్రంలో అసలు 'లా అండ్ ఆర్డర్' అనేది ఉందా అనే అనుమానం వచ్చేట్టుగా పాలన సాగిస్తున్న కొన్ని రాజ-కిరణాలని డంప్ చేస్తున్నట్టుగా; నాలాల నుండి తీసిన చెండాలమైన మురికిని డంప్ చేస్తుంటే.. తెలంగాణా పేరుతో సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్న వ్యక్తి.. ఇలా ఒక్కో రకమైన చెత్తకీ ఒక్కో రాజకీయ నాయకుడు/రాలు గుర్తొస్తూ ఉంటారు నాకు. ఇదంతా రాజకీయానికి చెందిన చెత్త అని నాకనిపిస్తోంది.
 
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద చెత్త పురాణమే తయారవుతుంది. మొత్తం చదివేశాక అసలిక్కడ రాసిందంతా ఒక చెత్త అని అనిపించుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే.. ఈ పెపంచకంలో నానా రకాల చెత్త బుట్టలూ ఉన్నాయని చెప్పుకుంటూ పోయి చివరికి నేను రాసిన దానికే "చెత్త బుట్ట" నామకరణం జరక్కూదడనే ఉద్దేశ్యంతో ఇక్కడితో నా చేత్తోపాఖ్యానాన్ని ఆపేస్తున్నాను. లేదంటే నిజంగానే ఇదొక చెత్త బుట్ట అయిపోతుంది.

28, జూన్ 2011, మంగళవారం

రమణీయం

కొహోతి కొమ్మచ్చి
కొమ్మకి రెమ్మొచ్చి
రెమ్మకి పువ్వొచ్చి
పువ్వుకి నవ్వొచ్చి
నవ్వుకి నువ్వొచ్చి
నీకు నేనొచ్చి
కోతి కొమ్మచ్చి..!

పదాలతో ఆడుకుంటూ, పాడుకుంటూ, మనన్ని ఒక ఆట ఆడించిన (ఆడుకున్న) ముళ్ళపూడి వెంకటరమణుల వారికి ముందుగా శతకోటి నమస్సుమాంజళులు. పదాలతో నవ్వించినా.. అక్షరాలతో గారడీ చేసినా.. మనసు తేలిక పడేలా చేసినా.. ఆయనకే చెల్లు. ఎందుకంటే ఆయన కళామతల్లి ముద్దుబిడ్డ కాబట్టి. నేను నవ్వను, నేనింతే... అని రాయి కంటే కూడా గట్టిగా బిగుసుకుని ఉండే వ్యక్తిని కూడా నవ్వించగల శక్తి ఆయన సొంతం. కళ అనే పదానికి చక్కటి నిర్వచనం రమణులవారు. అవును మరి, మాటలు రాయటం.. ఆ రాతలని పలికించటం.. ఆ పలుకులని చిత్రీకరించటం.. ఆ చిత్రాన్ని అందంగా చూపించటం.. ఆ అందాన్ని ఆనందించేలా చెయ్యటం.. ఆ ఆనందాన్ని మనకివ్వటం.. ఇవన్నీ ఒకే మనిషి  చెయ్యగలడా..? ఈయన చేశారు. నువ్వు రాసేవాడివైతే నేను గీసేవాణ్ని అంటూ రమణగారి మాటలని అత్యద్భుతంగా బొమ్మీకరించారు ఈయన చిరకాల స్నేహితుడైన బాపుగారు.

"నను గోడ లేని చిత్తరువుగా చేసి వెళ్ళిపోయిన నా వెంకట్రావు కోటి కోట్ల జ్ఞాపకాలకు సభక్తికంగా" అంటూ నమస్కరిస్తున్నబాపుగారికి ప్రణామం చేస్తున్నాను.

వీళ్ళిద్దరి స్నేహం గురించి మాట్లాడుకోవాలంటే బహుశా ఒక గ్రంధం చదివినంత పని అవుతుందేమో. ఎందుకంటే స్నేహమనే పదంలో చెరో అక్షరం వీళ్ళిద్దరూ. సృష్టిలో వీళ్ళు లేకపోతే అసలు స్నేహం అనే పదానికి అర్ధం ఉండేది కాదేమో అనేంత అందమైన బంధం వీళ్ళది. ఇప్పటికీ చాలామంది ఆంధ్రులకి బాపు, రమణ అనే వాళ్ళు ఇద్దరు వ్యక్తులు అంటే తెలీదు. బాపు రమణ అనేది ఒకే వ్యక్తి పేరు అని అనుకొంటారు. అంతలా కలిసిపోయారు వీళ్ళిద్దరూ. వీళ్ళని ఒకటిగా చూశాం కానీ ఇద్దరిగా చూడలేకపోయాం. ఇంత మంచి స్నేహితులు ఉన్న కాలంలో మనం కూడా ఉన్నాం అనే భావన గొప్పగా ఉంటుంది.

నీ రాతలు - నా గీతలు అంటున్నట్టుగా... ముళ్ళపూడి వారి మాటలకి బాపుగారి బొమ్మలు ఉండేవి. అసలు నాకొక అనుమానం ఎప్పటి నుండో అలా ఉండిపోయింది. అదేంటంటే, రమణగారు రాస్తే.. దానికి తగ్గట్టుగా బాపు బొమ్మలు రూపుదిద్దుకునేవా? లేక బాపుగారు గీస్తే.. వాటికి తగ్గట్టుగా రమణగారి మాటలు పలికేవా? ఏది ఏమైనా... దాదాపు ఏడు దశాబ్దాల స్నేహం.. అంతే వయసు గల రచన. ఈయన బొమ్మలు ప్రాణం పోసుకొంటూనే ఉన్నాయి. అంతలోనే ఆ కలం అలసిపోయింది. రాసింది చాల్లే కానీ ఇక రావయ్యా అంటూ లాక్కెళ్ళాడు ఆ రామయ్య. 'అదేంటీ నువ్వే లేకపోతే నా బొమ్మలకి మాటలు నేర్పించేది ఎవరు మరి' అని ఒక పక్కన ప్రియనేస్తం అడుగుతున్నా సరే వినిపించుకోకుండా రాముడంటే వెళ్ళిపోయింది ఈ కలం. పాపం.. ఆ బొమ్మలన్నీ మూగరోదనతో అలా చూస్తూ ఉండటం తప్ప ఏమీ చెయ్యలేకపోయాయి. మాటలొచ్చిన బొమ్మలు మాత్రం ఇక ఇప్పటినుండి ఒకళ్ళకొకళ్ళం అంటూ నమ్మలేని ఈ నిజాన్ని జీర్ణించుకోటానికి ప్రయత్నిస్తున్నాయి. మాటలు నేర్చిన మనం మాత్రం ఈయన చేతుల్లో బొమ్మలమైపోయాం. ఆ బొమ్మలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు ఈ పెద్దాయన. కానీ చివరికి ఇలా ఏ మాత్రం కనికరం లేకుండా ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు.. చెప్పా పెట్టకుండా. ఇప్పుడు ఈయన రాతలతో, రాతల విన్యాసాలతో స్వర్గలోకపు వాసులని అలరించటానికి, రాములోరి చెంత చేరి సేద తీరుతున్నాడు. ఈయన కోసం ఎంతోమంది దేవతలు భూలోకానికి చేరుతుంటే, ఈయన మాత్రం స్వర్గలోకానికి భవ బంధనాల ముళ్ళ"పూడిక" తొలగించుకుని మరీ వెళ్ళాడు. ఇదిగో..ఇప్పుడిలా హాయిగా నవ్వుతూ స్వర్గలోక వాసులని కూడా ఆయన చతురోక్తులతో ఓలలాడిస్తున్నాడు.



చరిత్రలో క్రీస్తుశకం 1931వ సంవత్సరం ఎంతో అదృష్టం చేసుకుంది. ఎందుకంటే ఈ సంవత్సరం రమణగారికి జన్మనిచ్చింది మరి. అదే జరిగి ఉండకపోతే, ఈ రోజున అసలు సాహితీలోకం ఈ సంవత్సరం గురించి మాట్లాడుకునే  అవకాశమే ఉండేది కాదేమో. ఆహా.. ఎంతటి అదృష్టం ఈ సంవత్సరానికి. అలా ఓ మనిషికి జన్మనిచ్చి.. ఇలా శాశ్వతమైన ప్రఖ్యాతి కొట్టేసింది. దాని తరవాత మళ్ళీ అంతటి ముఖ్యమైన సంవత్సరంగా స్థిరపడిపోయింది 1942. ఈ సంవత్సరంలోనే రమణ గారు అందమైన స్నేహ బంధానికి తెర తీస్తున్నారు అన్నట్టుగా బాపుగారిని మొట్టమొదటిసారిగా కలిశారు.

సినీ రమణీయం, బాపు రమణీయం, కధా రమణీయం, కదంబ రమణీయం... లాంటి ఎన్నో పుస్తకాలు ఆంధ్రుల మనస్సులలో ఎంత రమణీయంగా నాటుకుపోయాయో  తెలిసిందే.

ఆయన రాసిన మొట్టమొదటి గల్పిక "అమ్మ మాట వినకపోతే" 1945లో అచ్చు వేయబడటంతో మొదలైంది ఆయన సాహితీ ప్రస్థానం. అటుపైన చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండగా 1953లో ఆంధ్రపత్రికలో రిపోర్టర్ గా ఉద్యోగం సంపాదించి.. తరవాత నెమ్మదిగా చిత్రసీమతో సాన్నిహిత్యం కలిగేసరికి ఆయనలోని పూర్తిస్థాయి కళ  బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం దొరికింది. అది వినా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదనే చెప్పచ్చు. కధా రచయితగా, మాటల రచయితగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న రమణగారు - అందమైన చిత్రాల స్రష్ట కూడా.

అన్నపూర్ణమ్మ సహాయంతో "ఇద్దరు మిత్రుల"ని కలిపినా..
"బుద్ధిమంతుడి"గా కనిపిస్తూనే "ప్రేమించి చూడు" అని ఊరించి కవ్వించినా..
"సంపూర్ణ రామాయణా"న్ని అత్యద్భుతంగా ఆవిష్కరించినా..
"గోరంత దీపం"తో సాహితీ ప్రియులకి కొండంత వెలుగుని అందించినా..
మహా భక్తుడైనటువంటి "త్యాగయ్య" చేతనే కీర్తనలు పాడించినా..
తెలుగువారి మీదికి హాస్య "బుల్లెట్"లు విసిరినా..
"ముత్యాల ముగ్గు" వేసి మరీ "అందాల రాముణ్ణి" ఆహ్వానించినా..
"మూగ మనసుల" వలన మాట్లాడలేకపోయిన సావిత్రీ నాగేశ్వరరావులని "నవరాత్రుల"లో నానా అల్లరీ చేయించి చివరికి వాళ్ళిద్దరినీ కలిపినా..
"Mr. పెళ్ళాం" తో "దాగుడుమూతలా"డించినా..
చక్కటి హాస్యానికి మాత్రం "సాక్షి"గా నిలవటం.. సాహిత్యంలో "పూలరంగడి"లా ఉండటం ఆయనకే చెల్లింది. బాపు గారి సహచర్యంతో "ప్రాణ మిత్రులు"గా ఇద్దరు స్థిరపడిపోయారు.

తెలుగులో ఆణిముత్యాల్లాంటి 37 చిత్రాలతో పాటు.. హిందీలో హిట్ హిట్ హుర్రే అనిపించుకున్న "హమ్ పాంచ్" లాంటి రెండు చిత్రాల కోసం పనిచేసి బాలీవుడ్ లో కూడా జెండా పాతారు. ఆయన పని చేసిన కొన్ని సినిమాలలోని డైలాగులు విన్నాక ప్రేక్షకులు నవ్వీ నవ్వీ బాపు'రే అనటం మామూలే.
ఇడిగిడిగో బుడుగు అని అంటూనే వాణ్ని "చిచ్చుల పిడుగు" అని అభివర్ణించినా... "వైకేరియస్ లయబిలిటీ"  (vicarious liability) లాంటి పదాలని ప్రయోగించి జీవితంలో ఎదుర్కున్న కష్టాల్ని కూడా అత్యంత హాస్యంగా వర్ణించినా... ఈ రోజున బుడుగు పుస్తకంలోని ఎన్నో మాటలని పెద్ద వాళ్ళు, వాళ్ళ పిల్లలకి  అలవాటయ్యేలా నేర్పించినా.. ఎంతో మంది ప్రేమికులు ఆయన సృష్టించిన రాధాగోపాళాల లాగానే  ఉండాలని  ప్రయత్నించినా.. పక్కింట్లో లావుపాటి పిన్నిగారు లాంటి వ్యక్తి ఉండాలని కోరుకున్నా.. ప్రతి ఇంట్లోను ఒక బాబాయ్ ఉండాలనుకున్నా.. ఒకవేళ లేకపోతే బాబాయ్ ఉన్నట్టుగా ఊహించుకుంటూ మాట్లాడినా.. ఇవన్నీ మన జీవితాల మీద ఆయన రాతల ప్రభావం ఎంతగా ఉందో రుజువు చేసేవే.

తెలుగింటి దంపతులకు 'బుడుగు' ముళ్ళపూడి వారి వరప్రసాదం. వాళ్ళ పిల్లలు సరిగ్గా ఇలాగే ఉండాలని కోరుకునేంత అందంగా సృష్టించారు వేంకటరమణుల వారు. బుడుగు చేసే అల్లరి పనులు, వాడి చేష్టలు.. అలాగే పెసూ వేసే కొంటె ప్రశ్నలు...దాని హావ భావాలు..ఇలా ఎంతో ఆహ్లాదకర హాస్య పూరిత సుందర పర్ణశాలలో తిప్పుతారు రచయిత వారి మైత్రి బాపుతో సహా.

ఆయన జీవితచరిత్రని తెలుసుకోవాలన్నా.. అసలు జీవితంలో ఎదురయ్యే సమస్యలని ఎంత సులభంగా అధిగమించచ్చు అనే విషయాన్ని అర్ధం చేసుకోవాలన్నా.. సమస్యల్లో కూడా నవ్వగలగటం ఎలా అనే  రహస్యాన్ని వంటపట్టించుకోవాలన్నా.. అసలు సమస్యని చూసే దృక్కోణం ఎలా ఉండాలనే విషయాన్ని అర్ధం చేసుకోవాలనుకున్నా.. ముళ్ళపూడి వారి "కోతి కొమ్మచ్చి" ఆటలని చూస్తే సరి. ఇంత వయసులో కూడా అన్నన్ని కుప్పి గంతులేస్తూ.. ఆయనతో పాటే మనన్ని కూడా ఒక కొమ్మ మీది నుండి ఇంకో కొమ్మ మీదికి  తీసుకెళ్తూ... ఆ గంతుల్లోనే ఎన్నో విషయాల్ని చక్కటి  హాస్యంతో చూపించిన ఈయనకి... సలాం....!!! ఈయన జీవితాన్ని కోతికొమ్మచ్చితో పోల్చి.. అసలు జీవితమంటే ఇదే.. ఎన్నో విషయాలని ఒకే సమయంలో ఎన్నో ఆటలాడటమే అనేట్టుగా చిత్రీకరిస్తూ అంతలోనే.. ఇంకోతి కొమ్మచ్చి అంటూ మరెన్నో విషయాలతో మనన్ని గుక్క తిప్పుకోకుండా చేసిన ఈయన... సాహిత్యంలో అమరులయ్యారు, వంగ్యపూరిత వర్ణనలో మహర్షులయ్యారు.

ఈ రోజు (జూన్ 28) ముళ్ళపూడి వెంకటరమణగారి జయంతి. ఈ సందర్భంగా... ముళ్ళపూడి వారికి నమస్కరిస్తూ... అందరికీ సుపరిచితమే అయినా... ఈతరం వాళ్ళు, వీళ్ళ ద్వారా రాబోయే తరం వాళ్ళు కూడా ఈ పుస్తకాలని చదవాలి... తద్వారా.. చక్కటి సాహిత్యంతో కూడిన అందమైన హాస్యాన్ని అందరూ ఆస్వాదించాలనే ఒక కోరికతో.. తెలుగు తీయదనం అంటే ఇలా ఉంటుందని రుజువు చేయాలనే తపనతో.. ఇక్కడ నా ఆంధ్రులందరి కోసం బుడుగు పుస్తకం లింక్ ఇస్తున్నాను. దాంతో పాటే.. బాపు హాస్యగుళికలని కూడా రెండు భాగాలుగా జత చేశాను. ఎవరికి ఎప్పుడు ఏ రోగం వచ్చినా కూడా ఈ పుస్తకాల్లో నుండి వారిక్కావలసిన మందు ఏదో ఒకదాన్ని తీసుకుని వేసుకోవచ్చు. ముఖ్య గమనిక.. ఈ గుళికలని ఉపయోగించిన తరవాత భోజనానికి కనీసం ఒక రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి, లేదంటే భోజనం వంట పట్టదు.ఆ తరవాత మీ ఇష్టం.

Budugu pustakam
Bapucartoons-part - 1
Bapu cartoons part - 2

ఝాటర్ ఢమాల్....!!!!

19, మే 2011, గురువారం

డామేజర్ అను ఒక మేనేజర్...

డైరెక్టర్ రూంలో బాగా వాయింపు అయినట్టుంది...మొహం మాడ్చుకుని బయటికొచ్చాడు. అదేంటో... వాడలా బయటికొస్తుంటే రకరకాల భావాలు కనిపిస్తున్నాయి మొహంలో...! సినిమా మధ్యలో దొరికిన బ్రేక్ టైంలో ఓపెనర్ తో ట్రీంగ్...ట్రూయీంగ్.. అంటూ కూల్ డ్రింక్స్ బాటిల్స్ మీద ఓపెనర్ తో రాస్తూ అమ్ముకోటానికి వచ్చే వాడిలాగా..కోఠి బస్సు స్టాండ్లో "యే పల్లి బఠానేయ్ గరం గరం.. " అని అరుస్తూ జనం వెంటపడే వాడిలాగా... కిరాణా కొట్టులో పని చేసే పిల్ల వాడిని "ఒరేయ్.. కిలో కంది పప్పు కట్టమని చెప్పాను...కట్టావా" అంటూ కసురుకునే వాడిలాగా... అదేంటో...ఇలా రకరకాలుగా కనపడుతూ ఉంటాడు. అక్కడికేదో మునిగిపోతున్నట్టు..హడావిడిగా వాడి డెస్క్ దగ్గరికొచ్చేసి... అర్జెంటుగా ఓ నలుగురి మీద ఏ మాత్రం అవసరం లేకపోయినా సరే కాకి లాగా అరిచేస్తే కానీ...నాలుక మీద దురద తీరదు అన్నట్టు...మనశ్శాంతి ఉండదు అన్నట్టు.. పరిగెట్టుకొచ్చేస్తూ  ఉంటాడు... తీరా  చూస్తే  అక్కడేమీ అంత అజ్జెంటు పని ఉండి చావదు... వెధవ మొహానికి. అదేలెండి.. నేను  మాట్లాడేది  మీరనుకుంటున్న సదరు మహానుభావుడి గురించే. ఆఫీసు ల్యాండ్ లైన్ నుండి నా సెల్ ఫోన్ కి  మిస్ కాల్  ఇచ్చే కక్కుర్తి  మొహమూ వాడునూ. అదేంటో... ఈ మేనేజర్ అనేవాడు ఉన్నాడు చూసారు... ఏదో  చేసేద్దామనుకుని  ఏదేదో  మొదలెట్టేస్తాడు... చివరికి చేసేదేమీ ఉండదు. కొంతమంది మేనేజర్లు అయితే  మరీనూ, వాళ్లకన్నీ  తెలుసనుకుంటారు. కానీ వాడొక మైదానంగాడన్న సంగతి అందరికీ తెలుసన్న సంగతి వాడికి తెలీదు. పైగా ఒక దిక్కుమాలిన భావం ఒకటీ మొహానికి.. అదేదో సినిమాలో బాలకృష్ణ గావుకేకలు పెడుతూ "నేను కొట్టినా చస్తావు..నన్ను కొట్టినా చస్తావు..." అని అంటున్నట్టుగా..!!!

ఒక్కోసారి చూడండి.... డైరెక్టర్ రూంలో నుండి బయటికి వస్తూ... అదేదో అడ్వర్టైస్మెంట్ లో... (క్లోజ్-అప్ అనుకుంటా) వాడి నవ్వు చూడగానే.. "దగ్గరగా రా...దగ్గరగా రా..." అనే ఒక ఆర్తనాదం గుర్తొస్తుంది. అబ్బో, లేక లేక ప్రేమతో గుఱ్ఱం పళ్ళేసుకుని సకిలించుకుంటూ మరీ పిలిచాడు కదా అని నవ్వుకుంటూ  దగ్గరికెళ్తామా... తీరా చూస్తే మళ్ళీ అదే కంపు, అవే అరుపులు, అవే తిట్లు, అదే కసురు. అప్పుడర్ధమౌతుంది అసలు విషయం, ఇది ఏడవలేక నవ్వూ అనీ. కంపెనీ కాబ్ లో కూరగాయలు కొనుక్కోటానికెళ్ళే  పింజారీ మొహమూ...వాడూను.

ఆ మధ్య ఓసారి ఉన్నట్టుండి డెస్క్ దగ్గరికొచ్చి, రేపు శనివారం షాపింగ్ కి వెళ్దాం రాగలవా శాండిల్య అని అడిగాడు. ఇంతమంది ఉంటే నన్ను అడుగుతున్నాడేంటబ్బా..  ఇదేదో ఉపద్రవానికొచ్చినట్టుందే అని అనుకుని, "హా వస్తానండి.. ఇంతకీ ఏం కొనాలి మీరు అని అడిగాను. వాడు ఓ చిన్న లిస్టు చూపించాడు. ఆ అతి చిన్న లిస్టు  చదవటానికి నాకు కనీసం ఓ  ముప్పావు  గంట పట్టింది. అసలు వాడు ఈ లిస్టుని రాయటానికి చేసిన కృషి  చదువుకునేప్పుడు కనుక చేసి ఉంటే.. ఈ పాటికి ICWAI పాస్ అయిపోయి ఉండేవాడు దరిద్రుడు. పైగా..  అందులో  వాడు కొనాలనుకుని రాసిన వస్తువులు ఏంటా అని చదివేసరికి.. ఈ వస్తువులు కొనుక్కోటానికి ఎవడైనా పెళ్ళాన్ని తీసుకుని వెళ్తాడ్రా పిచ్చుక పీనుగా.. అలాంటిది నన్ను అడుగుతావెంట్రా ముష్టి మిధునం అని తిట్టుకుని "అంటే ఇప్పుడు నేను రావటం కుదురుతుందో లేదో తెలీదు" అని అంటూ నసుగుతూ తటపటాయించాను. నేను రాను, రాలేను అని అంటానేమో అని వాడు గ్రహించినట్టున్నాడు, వెంటనే, ఆర్టీసీ బస్సులో పక్కసీట్లో  ఉన్నవాడు లేవగానే అక్కడ ఇంకొకడు వచ్చి కుర్చుంటాడేమో అని, అందరినీ తోసేసుకుంటూ.. ఓ నలుగురు కింద పడిపోయేలా గంతులేస్తూ వెళ్లి మరీ ఆ సీట్లో కూలబడే కక్కుర్తి మొహంగాడిలాగా.. నన్ను ఇంకో మాట మాట్లాడనివ్వకుండా "నువ్వొస్తున్నావు అంతే" అనేశాడు. సరే కానీలే.. శనిగ్రహం బలం ఎక్కువగా ఉన్నప్పుడు మనం తప్పించుకోవటం కష్టం అనిపించి సరేనన్నాను. పైగా శనిగ్రహానికి ఉపగ్రహంగాడే  ప్రత్యక్షంగా  చెప్తున్నాడు.. నీకు బ్యాడ్ టైం స్టార్ట్  అయిపొయింది అని. అలాంటప్పుడు ఇంక చేసేదేముంటుంది. అసలు వాడు కొనాలనుకున్న వస్తువుల్లో తొంభై శాతం అన్నీ వంటింటి సామానే ఉన్నాయి. ఇంతకీ వీటి షాపింగ్ విషయంలో వాడు నన్నే పిలవటానికి కారణం.. వీడు తెలుగువాడే అయినప్పటికీ చిన్నప్పటి నుండి బెంగుళూరులోనే ఉండి చచ్చాడు. అందువల్ల హైదరాబాద్  అంతగా పరిచయం లేదుట.. అది నా  ప్రాణానికొచ్చింది ఇప్పుడు. అసలు నాకు అనుమానం ఏంటంటే... ఇలా లిస్టు రాసేప్పుడు వాడు వాళ్ళావిడతో చెప్పి ఉంటాడు.. "ఇవన్నీ కొనేప్పుడు నాతో రావటానికి ఓ గైడ్ ఉన్నాడు, హైదరాబాద్లో వాడు మనకి డ్రైవర్ లాంటివాడు" అని..!

సరే.. ఇంకేం.. శనిగాడు, శనివారం రానే వచ్చాయి. అసలు ఇవన్నీ కొనాలంటే మేము వెళ్ళాల్సిన ప్రాంతం... అత్యంత భయంకరమైన జన సమ్మర్దంగా ఉండే ప్రాంతం. ఇక్కడికి రాగానే ఓ చిలిపి ఆలోచన వచ్చింది - "ఇసుక వేస్తే రాలనంత జనాలు" అని అంటూ ఉంటారు కదా.. అసలది ఎంతవరకూ నిజమో చూద్దాం అని. అంతే.. వచ్చిందే తడవుగా అలా విసిరి చూశాను. "రాలను పో" అని ఓ వెటకారపు నవ్వు నవ్వి అలా గాల్లోనే కలిసిపోయింది పాపం ఆ ఇసుక. ప్రాణం లేని ఆ ఇసుక ప్రాణాలు ఆ విధంగా గాల్లోనే కలిసిపోయేలా చేసిన పాపం చుట్టుకున్నాను.. కింద అంతమంది జనాలున్నారు మరి! హుమ్మ్.. అంతా నా భ్రమలే అని అనుకుని.. మళ్ళీ ప్రయత్నిద్దాం అని అలాగే చేశాను. ఓ గుప్పెడు ఇసుకని పైకెగరేసి అలా చూస్తూ ఉన్నాను. ఓ నాలుగైదు నిమిషాల తరవాత  "అలా రోడ్డు మధ్యలో నిలబడి నోరు తెరుచుకుని మరీ చూస్తావెంట్రా దరిద్రుడా.. నీ చుట్టూ ఇంతమందిని పెట్టుకుని కింద పడమంటే ఎట్లా.. నీ బుర్రని ఏమనాల్రా పిచ్చి పీనుగా" అని కొన్ని మధురమైన వాక్కులు వినిపించాయి. చంటి పిల్లలని చంపెయ్యటానికి ఆకాశంలోకి ఎగరేసిన కంసుడితో పలికినట్టుగా నాతో కూడా ఆకాశవాణి అలా అంటోందేమో అని అనుకున్నాను.. ఆ తరవాత అర్ధమైంది.. నన్నలా తిట్టింది నేను విసిరిన ఇసుకే అని. అదేంటో.. ఈ శనిగాడు పక్కనుండేసరికి దాని ప్రభావం వల్లనేమో నాకు  ఈ రోజు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి! అప్పుడు రుజువైంది నాకు బ్యాడ్ టైం చాలా దారుణంగా  మొదలైపోయిందని! అయినా ఇంత మంది జనం ఉండే ప్రదేశం ఏంటా, ఎక్కడుందా అని కదూ మీ అనుమానం.. సామాన్యంగా జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు  అక్కడికెళ్ళి మోక్ష ప్రాప్తి కోసం చూస్తూ ఉంటారు కొంతమంది మా హైదరాబాద్ వాళ్ళు! అంతటి పుణ్య ధామం అది. అక్కడి దుమ్ము.. క్షమించండి.. ధూళి పవిత్రమైంది. నుదుటి మీద పూసుకోవక్కర్లేదు, దానంతట అదే మొహం అంతా పులుముకుంటుంది. అక్కడి మనుషుల మనసులు.. అబ్బో ఇంక దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏవండీ అని పిలిస్తే చాలు.. అక్కడికేదో మనం వాణ్ని అమ్మ నా బూతులూ ఉపయోగించి తిడుతూ పలకరించినట్టు చూస్తూ ఉంటాడు ప్రతి వాడూను. హుమ్మ్... ఇంకా అర్ధం కాలేదా, అదే... హైదరాబాద్లోనే అత్యంత అందమైన ప్రదేశం... అఫ్జల్ గంజ్ అని ఒకటుందిలే.
సరే.. ఎలాగో మొత్తమ్మీద అక్కడ మా శనిగాడు, నేను కలిసి వాడిక్కావలసిన చెత్త మొత్తం దాదాపు కొనేశాం.. ఇంతలో అలా ఉన్నట్టుండి దారి తప్పి.. వాడు నేను చెరోవైపుకి  వెళ్ళిపోయాం. ఎక్కడున్నాడా కనుక్కుందాం.. అసలే హైదరాబాద్ తెలిసి చావదు వీడికి అని ఫోన్ చేసి "ఎక్కడున్నారు సార్ మీరు?" అని అడిగితే వాడిచ్చిన సమాధానం విని... ప్రపంచంలో బూతు అనే మాట కూడా సిగ్గుపడేలా తిట్టుకున్నాను వాణ్ని! మా మేనేజర్ పీనుగు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా...  "నీకు చంద్రుడు కనిపిస్తున్నాడా" అని అడిగాడు. ఇంత మంది మధ్యలో వీడికి కేరాఫ్ చంద్రుడి అడ్రస్ ఎందుకబ్బా అని అనిపించింది. వీడు ఏ చంద్రుడి విషయం అడుగుతున్నాడో అర్ధమయ్యి చావక తల పైకెత్తి "హా కనిపిస్తున్నాడండి" అని చెప్పాను "హా.. సరిగ్గా దానికింద ఓ షాప్ ఉంది, దాని ముందు నిలబడి ఉన్నాను" అని చెప్పాడు. "ఇన్ని లక్షలమందీ ఉన్నది చంద్రుడి కిందనే కదరా... అమావాస్య రోజు వెన్నెల కోసం మిడిగుడ్లేసుకుని ఎదురుచూసే గుడ్డి బద్రీ" అని తిట్టుకుని... తరవాత ఎందుకో అనుమానం వచ్చి చుట్టూ పరికించి చూశాను. అప్పుడు అర్ధమైంది వీడి కక్కుర్తి పవర్ ఏంటో... అది వీడి చేత ఎలా మాట్లాడిస్తుందో. వీడికి తాగుడు పిచ్చి. తెగ తాగి చస్తాడు. మంచి నీళ్ళు కాదు, మత్తెక్కించే మంచి తీర్థం గురించి చెప్తున్నాను నేను! బార్ కనిపిస్తే చాలు.. కుక్కలాగా చొంగ కార్చుకుంటూ మరీ పరిగెత్తుతాడు. అక్కడేదో చంద్ర బార్ అని ఉంది. దానికి ఈ నికృష్టుడు పెట్టుకున్న ముద్దు పేరు చంద్రుడు. దాని కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో నగల దుకాణం  ఉంటే.. దొంగతనం చేశాకా వాడి సహ-దొంగ కార్ తీసుకు రాగానే అందులోకి దూకేసి చకాచకా పారిపోయే ప్లాన్ లో ఉన్న దొంగవెధవ లాగా కళ్ళు తిప్పుతూ అక్కడ నాకోసం చూస్తూ ఉన్నాడు. వంటింటి సామగ్రి కావాలంటూ.. ఆభరణాల షాప్ కి వెళ్లి ఏం చేసి చస్తున్నావురా దరిద్రుడా అని ఓసారి మా మేనేజర్ని  అతి సామాన్యంగా తలచుకుని... వాడి దగ్గరికెళ్ళి "ఇంక ఇంటికి వెళ్దామా సార్.. అయిపోయిందిగా షాపింగ్" అని అడిగాను. వీణ్ణి అంత తేలిగ్గా వదిలితే ఎక్కడ త్వరగా కొంపకెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటాడో అని అనుకున్నాడేమో.. ఇప్పుడు వెళ్లి బట్టలు కొనుక్కుందాం పద అన్నాడు. ఇప్పుడు వీటన్నిటినీ ఏ షాప్ వాడూ లోపలికి రానివ్వడు సార్ అని చెప్పాను. ఓహో అవును కదా అని ఆలోచిస్తుంటే.. అమ్మయ్య, అయితే  ఈ రోజుకి  వద్దులే అని అంటాడనుకున్నాను. వాడు ఊరుకుంటాడా "దీని గురించి ఎందుకు కంగారు.. నా కార్ ఉందిగా.. అందులో వేసి పారేద్దాం" అని అన్నాడు. అప్పుడనుకున్నాను.. "అందులో వేసి పారేద్దాం" అనే వీడి మాటలు నిజమయ్యేట్టుగా.. వీడి సామాను, కార్ తో సహా దొంగలెట్టుకెళ్తే పీడా విరగడైపోతుంది అని అనుకుని.. తప్పదుగా.. సరేనన్నాను. అక్కడ కూడా వీడి చేష్టలు, హావ భావాలు చూసి నాకు షాపింగ్ అంటేనే విరక్తి పుట్టేసింది. వీడెళ్లి అక్కడ ఓ పింక్ కలర్ ప్యాంటు, ఎల్లో కలర్ షర్టు కొనుక్కుని, దాని మీదికి చాలా బాగా సూట్ అవుతుంది అని గెంతుకుంటూ వెళ్లి  ఒక ఆకుపచ్చ రంగు టై కొనుక్కున్నాడు. అప్పుడు మాత్రం.. అదేదో సినిమాలో సుత్తీరబద్దర్రావ్ తిట్టుకున్నట్టు, నేను కూడా "నన్ను షాపింగ్ కి అని పిలిచీ ఇలాంటి దారుణమైన పనులు చేస్తావారా.. పోతావురోరేయ్.. నాశనమైపోతావురా! ఇంకోసారి నన్ను షాపింగ్ అని పిలిస్తే నీ నవరంధ్రాల్లో మైనం కూరుతాను వెధవ్వా!!!" అని తిట్టుకున్నాను.
ఆ తరవాత ఎండా కాలంలో అనుకోకుండా వచ్చే చల్లటి వర్షం అన్నట్టు.. ఏదో అలా అలా వీడికి పొరపాటున మంచితనం అనేది పుట్టిందేమో, నన్ను ఇంటి దాకా దింపుతాను అనేసరికి హాశ్చర్యంతో నోరు తెరిచేసాను. బయట వేడికి తట్టుకోలేక, లోపల చల్లగా ఉందనుకున్నాయేమో... ఈలోగా నాలుగైదు ఈగిల్స్ (ఈగలు కాదు)  అలా కొంచెం సేపు నా నోట్లో విహరించి మరీ వచ్చేసాయి. షాపింగ్ చేసీ చేసీ బాగా ఆకలిగా ఉన్నట్టుంది, ఇంటికెళ్తూ దారిలో వాడు బెంగుళూరులో చేసిన అరివీర భయంకర సాహసోపేత కృత్యాలన్నిటినీ నాకు చెప్తూ కడుపు నింపుకున్నాడు.

కానీ మనకంటూ ఒకడు ధైర్యం చెప్పేవాడు.. కష్ట సమయాల్లో నేనున్నానంటూ వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు; ఒకే సమయంలో తన పై అధికారులకి సమాధానం చెప్పుకుంటూ, తన కిందివాళ్ళని సంభాళించుకుంటూ, పని సాఫీగా జరిగేలా జాగ్రత్త పడుతూ, ఎన్నో చికాకులని అదుపులో పెట్టుకుంటూ; మనకేదైనా కావాలంటే అతడున్నాడు అనే ధైర్యాన్ని మనసులలో కలిగిస్తూ... ముందుకు సాగే ఒక హీరో కూడా అతడే.

మళ్ళీ ఇదేంటీ ఉన్నట్టుండి అనుకుంటారేమో.. ఏం లేదులెండి.. ఎంత కాదనుకున్నా త్వరలో నేను కూడా ఓ మేనేజర్ని అవాల్సినవాణ్ణేగా.. కాబట్టి వీణ్ణి అన్న మాటల్లో నన్ను నేను చూసుకోలేక, వాణ్ని తిట్టుకున్న ప్రతిసారీ చివరిలో ఇలా కూడా అనుకుంటూ తృప్తి పడుతూ ఉంటాను. అంతే కానీ వాడి మీద అభిమానంతో మాత్రం కాదు. అసలు మా మేనేజర్ని మనస్ఫూర్తిగా  అభిమానించగలిగే జీవి ఈ భూమ్మీద ఉంటుందని కూడా నేననుకోవట్లేదు.
హెల్మెట్ పెట్టుకుని కార్ నడిపే తింగరి మొహమూ వాడూ..!

16, ఏప్రిల్ 2011, శనివారం

అందాల నీడలు..!!


"కౌసల్య సుప్రజా రామా పూర్వా సన్ధ్యా  ప్రవర్తతే...
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవమాహ్నికం..." 
హలో.. ఇలా సుప్రభాతం చదవటం అంటే దాని అర్ధం తెల్లారింది అని..! ఇప్పుడు ఉన్నట్టుండి ఎలా చదివేస్తున్నాడేంటని అనుకుంటున్నారేమో..!! పొద్దున్నే  ద్వారకా తిరుమల స్వామి వారి దర్శనం అయిపోయాక వెంటనే బయల్దేరి పాలకొల్లు వెళ్లాలని ఆలోచన..! కానీ అనుకున్న సమయానికి బయల్దేరలేకపోవటం వల్ల... భీమవరంకి ముందు వెళ్లాలని నిర్ణయించేసుకుని... అక్కడికెళ్ళిపోయాం... ద్వారకా తిరుమల నుండి భీమవరంకి మూడు గంటలు ప్రయాణం..! అద్దీ.. ఇక్కడే అసలు విషయం; ప్రకృతి... అందాలు... పచ్చదనం... పొలాలు... పచ్చిక  బయళ్ళు... చెట్లూ...తోటలూ... పంట కాలువలూ... అబ్బో... ఒకటేమిటిలే...అసలు ఈ మూడు గంటల ప్రయాణం  మాత్రం... మనసుని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది..!

ఎంత అందంగా ఉంటుందంటే దారి మొత్తం... ఓహ్...అసలు ఒకటని చెప్పలేం. దారి.. దాని పక్కనే కుడి వైపు ఇళ్ళు, ఎడమ వైపు పంటకాలువ... అది కనీసం పది అడుగుల వెడల్పుతో ఉంటుంది... పెద్దగా లోతు ఉండదు..మహా అయితే ఓ పది అడుగులు ఉంటుందేమో..! ప్రతి ఒకటి రెండు కిలోమీటర్లకి ఒకచోట ఆ పంట కాలువని ఆనుకుని  ఓ చిన్న గుడి...రాముల వారిదో... కృష్ణుడిదో... శివాలయమో... అమ్మవారో... సాయిబాబానో...ఇలా ఎవరో ఒకళ్ల ఆశీస్సులు..! ఆ గుడి వెంబడే మెట్లు ఉంటాయి... అక్కడే అక్కడి వాళ్ళు బట్టలు ఉతుక్కోవటం...ఈతలు కొట్టటం... అసలు ఎంత అందమైన జీవితం వాళ్ళది...హాయిగా ఉంటున్నారు అనిపించింది..! ఇక్కడే అసలు విషయం ఒకటి గమనించాలి... దారికి ఎడమ వైపున పంట కాలువ ఉంది కదా.. దాని అవతల కనుచూపు మేరలో  పొలాలు... ఎక్కడా కనీసం ఒక్క చోటైనా... కనీసం ఒక్క అడుగైనా వ్యర్ధంగా వదిలేసిన స్థలం అనేది కనిపించదు... అంతలా ఉపయోగించేస్తారు అక్కడి వాళ్ళు భూమిని..! అయితే ఏదో ఒక పంట...లేదంటే... ఏదో ఒక చెట్టు... ఇంక ఉపయోగించకుండా వదిలేసిన నేల అనేది ఎక్కడుంటుంది... అవకాశమే లేదుగా..! సరే అక్కడి వరకు బానే ఉంది... కొన్నిచోట్ల అయితే మరీను... పొలం గట్ల వెంబడి వరసగా కొబ్బరి చెట్లు.. సైనికులు నిలబడ్డట్టుగా ఎంత అందంగా  ఉంటుందో చూడటానికి..! మనుషులకి క్రమశిక్షణ అంటే ఏంటో మనం నేర్పిద్దాం అన్నట్టు ఉండే పొడుగైన చెట్లు..! వాటిని చూస్తే తెలుస్తుంది... మనసు క్రమశిక్షణతో ఉంటే... జీవితం కూడా క్రమశిక్షణతో ఉంటుంది... అప్పుడు ఆరోగ్యం దానంతట అదే వస్తుంది అని చెప్పేట్టుగా దేహ దారుఢ్యంతో ఉంటాయి అక్కడి చెట్లు..! అద్భుతంలే..! ఒక్కో చెట్టు నుండి ఒక్కో సందేశం..! భూమీ, నీరు, ఆకాశం... ఎక్కడ చూసినా చెట్లే..! అదేంటీ.. నీటిలో ఎలా ఉంటాయి అంటారా... అవును, ఎక్కడ పడితే అక్కడ సెలయేళ్ల లాంటి అందమైన పంట కాలువలు ఉంటే మరి వాటిలో  కనిపించేది అక్కడి చెట్ల ప్రతిబింబాలేగా..! మరి ఆకాశంలో ఉండటం ఎలా సాధ్యం అంటారా ..మరి మన మీద ఎండ పడితే మనం ఎక్కడ కందిపోతామో లేక ఎక్కడ విలవిలలాడిపోతామో అని అనుకున్నాయో ఏమో... మనన్ని అతి జాగ్రత్తగా రక్షిస్తూ... ఎటు చూసినా సరే...అంత తొందరగా మనకి సూర్యుడి ప్రతాపం తగలకుండా కప్పేసి ఉంచుతాయి... వాటి చల్లటి గాలిని కూడా మనకి అందిస్తూ..! మరి ఆకాశంలో ఎటు చూసినా చెట్లు మాత్రమే ఉంటేనే కదా మనకి ఇంత హాయిగా ఉండేది ..! మనుషులలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏ మాత్రం జాలి లేని ఈ రోజుల్లో... పాపం మనకి ఏమౌతుందో... మనం ఏమైపోతామో అనే తపనతో, ప్రేమతో... అవి ఎండలో మాడుతూ... మనన్ని రక్షించుకుంటున్నాయి ఆ కదలలేని మూగజీవాలు..! మరి మనం అలా వాటిచేత రక్షించబడితేనే కదా వాటికి కావలసినంత పోషణ చెయ్యగలిగేది... ఇది కూడా ఆలోచించి ఉంటాయి ఆ వృక్షాలు...! అంటే మన చేత బతికించబడుతూ... మనన్ని బతికిస్తూ...!! అసలిది ఎంత గొప్ప తత్త్వమో కదా అనిపిస్తుంది..! కష్టంలో దైవం ఉంటుంది అంటారు... దైవానికి ఒక రూపం వస్తే... అది ఇలా మానవాళికి మేలు చేసే పచ్చదనంగా శోభిల్లుతుందేమో అన్నట్టుగా కూడా అనిపించింది నాకు అక్కడి అందాలని చూస్తుంటే..! ఒక్కో మలుపు దగ్గర ఒక్కో అద్భుతమైన దృశ్యం..! అక్కడి మనుషుల ఆతిధ్యం గురించి ఇక చెప్పనే అక్కర్లేదు..! ఇది కొత్త విషయం ఏం కాదనుకోండి... కానీ ఆంధ్ర వైపు అనగానే ఎందుకో తెలీకుండానే అభిమానం వచేస్తూ ఉంటుంది...! గుంటూరు ప్రాంతాలలో  తిరుగుతున్నప్పుడు ఒక రకంగా... గోదావరి ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు ఒక రకంగా... ఇలా రకరకాల అనుభూతులు... అన్నీ మంచివే... అన్నీ సంతోషం కలిగించేవే... అవన్నీ మనవే అనిపించేట్టు..! ఏమిటోలే...! అక్కడి ఊళ్లలో తిరుగుతున్నంతసేపు ఒకటే భావన... అసలు నాగరికతకి మనం ఎంత దూరం అయిపోతున్నాం... నాగరికులం అని చెప్పుకునే మనం ఎంత అనాగరికంగా ఉంటున్నాం... సున్నితత్త్వం నీడలో ఎంత మోటుగా బతుకులీడుస్తున్నాం... రసాత్మక జీవితాన్ని ఎంతగా వదులుకుంటున్నాం... ధనాత్మక జీవితానికి ఎంతగా అలవాటు  పడిపోయి శ్లేష్మంలో పడ్డ ఈగ లాగా ఎంత దారుణమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం... ఇలా ఏవో ఏవేవో భావాలు  మనసులో..! బస్సులో వెళ్తున్నంత సేపు ఇవే..!

ఇక్కడే, ఈ అందాలని ఆస్వాదిస్తున్నంతలోనే మనసులో ఉన్నట్టుండి ఆవేదన..! కారణం.. ఈ అందాల మాటున కొన్ని భయంకరమైన నిజాలు... మనిషి తనలోని లోపాలనీ, బలహీనతలనీ బయటపెట్టుకునే విధంగా... కొన్ని నీచ ప్రవర్తనలు..! ఇక్కడ లేనిది అక్కడేముందని అక్కడి వస్తువు మీద అంత మమకారం..! మనది కాని దాని మీద మనకెందుకు అంత ఆత్రం..! సమాధానాలు లేని, సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఇవి..! ఎందుకంటే సమాధానం తెలిసినా కూడా, అవతలి విషయాల మీద మమకారం, వాటి వల్ల  అంతర్లీనంగా వస్తున్న లాభం... అయాచిత వరం... అది విషసమానం అని తెలిసినా కూడా అదే ధోరణి..!  ఆ గోదావరి ప్రకృతి అందాలు, వాటి నీడలు ఎంతగా ఆహ్లాదాన్ని అందిస్తాయో, ఆ నీడల మాటున జరిగే విషయాలు ఒక్కసారి తరచి చూస్తే అంతకంటే భయంకరమైన సత్యాలని తెలియచేస్తాయి..!
ప్రాంతీయ విభేదాల నుండి పాశ్చాత్య దేశాల కక్కుర్తి దాకా చాలా విషయాలు కారణాలుగా కనిపిస్తాయి అక్కడ జరుగుతున్న ఆ దారుణాల వెనుక..!
మన సంస్కృతిని వదిలి పరమత ఆచారాలు..!
వేలాది సంవత్సరాల చరిత్ర వున్న హైందవంలో లేని అందం, నిన్న మొన్న పుట్టిన మతంలో ఉందీ అని వాదించటం..!
అన్నిటికీ సమాధానాలు చెప్తూ, అన్ని సందర్భాలలోనూ కాపాడుతూ వచ్చే హైందవ సంస్కృతిని వదిలి, ఎన్నో ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానాలు వెతుక్కుంటున్న మతాల వెంట పడటం..!
ఏంటిదీ...? ఎందుకిలా జరుగుతోంది..? మన దేశంలోనే ఇలా జరుగుతోందా..? ప్రపంచమంతటా అలాగే ఉందా..?ప్రపంచమంతటా అలాగే ఉంటే, మరి వాళ్ళ దేశాల్లో అటువంటి ఛాయలు కనపడవేం..?
పైగా, మతం మార్పిడి ఎందుకు చేసుకోవాల్సొచ్చింది అని అక్కడి వాళ్ళని ఎవరినైనా అడిగితే, మనశ్శాంతి కోసం అంటూ దానికి ఓ బంగారు పూత..! ఎందుకీ దాపరికపు విషక్రీడ..! హిందువుగా పుట్టటమే అదృష్టం అని అనుకునే సంస్కృతి నుండి మతం మారడమే పరమావధి అన్నట్టు నీచంగా వ్యవహరిస్తూ దిగజారటం..! సింధు నాగరికతలో లేని మనశ్శాంతి అన్యమతంలో ఎక్కడిదీ..? మనశ్శాంతి అనేది ఎలా వస్తుంది..? మతాన్ని బట్టి మనశ్శాంతి అనేది ఉంటే, మరి ఇన్ని మతాలెందుకు? పురాణ ప్రజలకి తెలీదా ఇన్ని మతాలు ఉండటం అనవసరం అని...? కేవలం మనశ్శాంతితోనే బతికేలా ఎందుకు నేర్పించలేదు వాళ్ళు...? హైందవ సంసృతి అనేది ఒక మతం కాదు...నిజానికి అది ఒక జీవన శైలి..! ఇలా జీవిస్తే మనసు బావుంటుంది, ఇలా ప్రవర్తిస్తే మనశ్శాంతి కలుగుతుంది, ఇలా సంభాషిస్తే దైవానికి దగ్గరవుతాం.. ఇలా ఆలోచిస్తే మంచి జరుగుతుంది అంటూ అడుగడుగునా మార్గదర్శనంగా ఉంటున్న మన సంస్కృతిలో లేనిది అక్కడ ఎక్కడి నుండి వచ్చింది..? ఇలా ప్రశ్నిస్తే... నిజానికి సమాధానం చెప్పరు.. ఎందుకంటే వాళ్లకి కూడా తెలుసు, అన్యమతాన్ని అవలంబించాలనే నిర్ణయం వెనుక వాళ్ళు దాసోహం అనబడిన డబ్బు ఉందని..! ఆ డబ్బుని, ఆ సంపదని, కష్టపడకుండానే వచ్చి పడుతున్న ఆ ధన రాసులనీ కాదనుకోలేక, మనసుని చంపుకుని మరీ మనశ్శాంతిని పొందుతున్నారు..! చచ్చిపోయిన మనసుకి శాంతి ఎక్కడిదో మరి...!

సరే... మన ఆచారాల కారణంగా కూడా కొంతమంది బడుగు వర్గాల వారు అణగదొక్కబడ్డారు, కాబట్టే అలా వాళ్ళు అన్య మతాల వైపు చూడాల్సి వస్తోంది అని వాదించే వాళ్ళు ఉన్నారు..! నేను కూడా దాన్ని సమర్ధిస్తున్నాను..! ఎందుకంటే, అగ్రవర్ణాల వారి అరాచకాల వలన కలత చెందిన మనసులు, వాళ్ళని మనుషులుగా గౌరవించే వారి వైపుకి మొగ్గు చూపేలా చేసింది..! ఈ వాదనకి నేను కూడా వ్యతిరేకిని కాను..! కానీ నిజానికి ఏం జరుగుతోంది... సదరు బడుగు వర్గాల ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అన్యమతస్థులు వాళ్ళచేత మతం మార్పిడి చేయిస్తున్నారు కానీ అది వాళ్ళ మీద ఉన్న ప్రేమతో  కాదు..!
ఒకవేళ వాళ్లకి అంత ప్రేమే ఉంటే... డబ్బుని ఎర వేసి మరీ మతం మార్చాల్సిన అవసరం ఏంటి..! వాళ్ళ మతంలో ఉన్న మంచిని, దాని గొప్పతనాన్ని చాటిచెప్పి కూడా వాళ్లలోకి ఆహ్వానించవచ్చు...! 
లేదా... మతంతో సంబంధం లేకుండా వాళ్ళని ఆర్ధికంగా పైకి తీసుకురావాలన్న చిత్తశుద్ధితో కూడా చేతనైన సహాయం చెయ్యచ్చు..! కానీ అది జరగట్లేదు..! పైగా... కొన్నిచోట్ల, పాపం అమాయకులని బెదిరించి మరీ మత మార్పిడి చేయించటం..! ఎంత అమానుషం...! ఎంత దారుణం..! ఈ పచ్చదనాల వెనుక మాటేసిన మత మౌఢ్యులు... ఎంతకి ఒడిగట్టారు...!!!
పచ్చని చీర కట్టుకున్న భూమాత ఆశీర్వాదాలు కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి అక్కడ..! అంతలోనే, పచ్చిక బయళ్ళ మధ్య నుండి వెళ్తున్న మత మౌఢ్యపు కాలి అడుగుల గుర్తులు..!

1980 - 1985 ప్రాంతంలో భారత దేశాన్ని దర్శించటానికి వాటికన్ సిటీ నుండి విచ్చేసిన ఒక సాధువుకి ఇక్కడి హైందవ వైభవాన్ని చూసి కన్ను కుట్టిందో ఏమో, ఒక పెద్ద సభలో బహిరంగంగా  - "ఏం జరుగుతోంది ఇక్కడ, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు నలభై సంవత్సరాలు గడిచినా ఇంకా ఇక్కడి జనాభాలో కేవలం రెండు శాతం మంది మాత్రమే మన మతస్థులున్నారు... ఇక్కడ ఇంతమంది ఉండీ మీరంతా చేస్తున్నారు...ఇంకా ఎప్పటికి మన మతవ్యాప్తి జరిగేది..." అంటూ వాకృచ్చారు..! సదరు సాధువు గారు ఎవరో కాదు... ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోప్ జాన్ పాల్ II. పాపం ఆయన కంగారు పడిపోయిన మతం తమ మతం అయినటువంటి క్రైస్తవ మతం..! ఇప్పుడు మన దేశ జనాభాలో దాదాపు పదమూడు శాతం మంది క్రైస్తవులు ఉన్నారు..! అంటే స్వతంత్రం సిద్ధించిన తరవాత నలభై సంవత్సరాలలో ఉన్న రెండు శాతం జనాభా ఆ తరవాత కేవలం ఇరవై ఐదేళ్ళలో మరో పది శాతానికి పెరిగింది అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో  అర్ధం చేసుకోవచ్చు..!

స్వమతాన్ని కాదని అన్యమతాల వైపు చూడటం అంటే అది ఆత్మహత్యతో సమానం అని యుగపురుషుడు వివేకానందుల వారు ప్రవచించారు..! మరి ఇన్ని ఆత్మహత్యలని సర్కారు వారు ఎందుకు ఆపట్లేదు... ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే, వాళ్ళే దగ్గరుండి మరీ ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు చేయిస్తున్నారు..! స్వార్ధం..! ప్రభుత్వం నడిచేదే అన్యమతాల వారి పర్యవేక్షణలో... పాశ్చాత్య దేశాల వారి కనుసన్నల్లో..! "వారంలో ఒక రోజున ప్రత్యేకంగా ఒక ఎర్ర పుస్తకాన్ని చేతులో పట్టుకుని ప్రార్ధనా స్థలాల వైపు పరుగులు తీసినంత మాత్రానా వారు హిందువులు కాకపోరు ... ఈ సింధుగడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తీ హిందువే అవుతాడు..." ఈ మాట ఒకానొక సందర్భంలో సామవేదం షణ్ముఖశర్మ గారు చెప్పటం జరిగింది! నిజమే... ఎవరు ఏం చేసినా, ఏం చెయ్యాలనుకున్నా.. ఎంతగా ప్రయత్నించినా... వేల సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన నా హైందవ మతాన్ని ఏమీ చెయ్యలేరు... హాని చెయ్యాలనుకున్న ప్రతివాడు ఒకరోజున దారుణమైన ప్రతిఫలాన్ని చవిచూస్తాడు..! 

ఇతర మతాలని అగౌరవ పరచమని హిందూతత్త్వం ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు, పైగా.. పరమత సహనం ఉండాలి అని కూడా చెప్పింది..! అటువంటి మనసు ఉన్న హిందువులని అకారణంగా మతోన్మాదంతో ముద్ర వేసారు... మరి దొడ్డి దారిన వచ్చి ఇక్కడి వారి మతాన్ని మార్చుతున్న వారి బుద్ధిని ఏమనాలి..! వారి మత వ్యాప్తి కోసం ఇతర మతాలని కించపరిచే విధంగా వ్యాఖ్యానించే వారు, పాటలు రాసేవారు ఉన్న ఆ వర్గాన్ని ఏమనాలి..! (ఒక పాట విన్నాను... "ఎన్నో ఏళ్ళుగా విగ్రహారాధన చేస్తూ ఉన్నాను... శాంతి కలుగలేదు, ప్రభువా నిన్ను ఆరాధించటం మొదలుపెట్టాను... బతుకు బాగుపడిందీ" అంటూ వస్తుంది ఆ పాటలోని ఒక వాక్యం..! ప్రపంచంలో విగ్రహారాధన చేసేది ఒక్క హిందువులు మాత్రమే..! మరే మతానికీ ఈ అలవాటు లేదు...! అంటే ఆ పాట రచయిత హైందవ మతారాధనని ప్రత్యక్షంగా కించపరచినట్టేగా..! ఈ నికృష్ట ఆలోచనలు హిందువులకి ఉండవు..డబ్బుకి అమ్ముడుపోయిన కక్కుర్తి మనసులకి మాత్రమే వచ్చే ఆలోచనలివి..!) అసలు దానిని ఏమైనా అనటానికి భాష అనేది ఉంటుందా..! ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం లేక ఇలా దోపిడీ దొంగల తీరున, రాత్రి పూట మాత్రమే సంచరించే నీచ జీవాల మాదిరిగా... అడ్డదారిలో అమాయకుల మనసుని మార్చి, సమాజాన్ని ఏమార్చినంత మాత్రాన, నా హైందవ మతానికి ఎటువంటి హానీ జరుగదు..! ఎందుకంటే హిందూత్త్వం తనని తానే రక్షించుకోగలిగే ఒక పటిష్టమైన వటవృక్షం..!

పొలం గట్ల వెంబడి కనపడే వృక్ష సౌందర్యం మనన్ని ఆశీర్వదించే శివ గణాలు అయితే, తోటల్లో కనిపించే అందమైన చెట్ల సముదాయం గంధర్వ గాన బృందం..!
పచ్చని పొలాల వెంబడి కనిపించేది కాషాయ వర్ణమే... నామ సౌందర్యమే... గోవింద వైభవమే... ఈశ్వరానుగ్రహమే...!
అక్కడి పొలాల మీదుగా వీచేది ఓంకార నాదమే..!

29, మార్చి 2011, మంగళవారం

ఫాల్గుణ పున్నమి

ఈ మాసపు పున్నమికి  ప్రత్యేకత... అది ఈ సంవత్సరపు చివరి వెన్నెల రోజు కావటమే..! చివరిదైతేనేం... కాలంలో అది కూడా ఒక అందమైన రోజు... అంతకంటే ముఖ్యంగా... మన మనసులకి అతి  చేరువవుతున్న రోజు...చూపులకి అన్ని అందాలు కనిపించేటంతగా దగ్గరవుతున్న రోజు..! ఆ తరవాత  ఇంకా అంతకంటే కూడా అందమైన రోజులని అందించటానికి నాంది పడే రోజు..! మరి అంతకు  ముందెప్పుడూ ఆయన మనకి అంత దగ్గరగా లేడా... మనన్ని ఎప్పుడూ దూరంగానే ఉంచేశాడా... అదేం  కాదు... ఆయనెక్కడున్నా... ఎంత దూరంలో ఉన్నా మనసులు దగ్గరగా ఉంటే చాలు అన్నట్టుగా  ఉన్నాడు... ఇప్పుడు కూడా అంతే..! ఇది నిజానికి చివరిది కాదు... కాల గమనంలో మరొక పున్నమి రోజు ... అంతే అని తెలియజేసే రోజు..!

వెన్నలోని చల్లదనాన్ని, చంద్రుడిలోని వన్నెలనీ... మల్లె మొగ్గలలోని మధురిమలనీ... జాజి  పూవులలోని మకరందాన్నీ... నిశా రాత్రి తాలూకు అందాలనీ... అంతలోనే ధవళ కాంతులనీ ... చల్లటి  గాలుల ఝరులనీ ... శృతిలయల సవ్వడులనీ... లయబద్ధంగా వీచే వేప వాసనలనీ... చుట్టూ మిణుగురు పురుగుల్లా అలరిస్తున్న చుక్కల ముగ్గునీ... అక్కడి వింతలనీ కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తూ... వీనుల విందైన ఘంటసాల మాష్టారి మధుర గీతాలు చెవులకి సార్ధకత కలిగిస్తూ ఉండగా... అప్పుడు తెలిసింది... ఓహ్... మావయ్య మనకి అతి దగ్గరగా వచ్చి పలకరిస్తూ మనల్ని అలరించే రోజు...అదే...ఫాల్గుణ  పున్నమి రోజు ఇదే కదూ... చూస్తూ ఉండగానే అద్భుత కౌముది క్షణాలు మన ముందుకొచ్చేశాయే అని..! అలా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోవటం నా వంతు అయింది...!



విరోధి నామ సంవత్సర చివరి పౌర్ణమి రోజున ఇలా చంద్రుడు మనకి ఇంత దగ్గరికి రావటం వింతేనేమో.. మరి లేకపోతే... ఏడాది కాలంగా లేనిది ఇప్పుడే ఈయన ఇంత దగ్గరికెందుకొస్తున్నట్టో..! ఖర నామ సంవత్సరంలో మనం ఇంకా ఇంకా ఇంతకంటే కూడా దగ్గరయ్యి .. చంద్ర శే"ఖర" నామ సంవత్సరంగా పిలిచుకునే అవకాశం మనకిస్తున్నాడేమో..! తెలుగు భాషలో ఖరము అనే పదానికి ఉన్న అర్ధం గార్ధభం అయినప్పటికీ... అంతకంటే శేఖరమునే తలపింపచేస్తున్న మన మావయ్యకి జోహార్లు..!

ఈయనెవరో కాదు... మల్లె పూల రేడు..! మల్లె శేఖరుడు...! మల్లికార్జునుడి శిరస్సు మీద ఉండీ ఉండీ ...మల్లె శేఖరుడు అయిపోయాడు...మా చంద్రయ్య..! అవును మరి...ఇద్దరికీ సారూప్యత ఉందిగా...!!
మల్లె  పూలు ఆయన్ని చూసి విరబూస్తే...చంద్రుడు వాటిని చూసి వికసిస్తాడు..! చంద్రుడి రంగుని మల్లె పూలు పులుముకుంటే... వాటి పరిమళాన్ని రంగరించి చంద్రుడు వెన్నెల కురిపిస్తాడు...! వెన్నెలని  పీల్చుకుందామని అనుకుంటామా... అది కమ్మని మల్లె పూల వాసనతోనే ముక్కులోకి దూరిపోతుంది..! ఆ రోజున వాళ్ళిద్దరూ అలా కలగలిసిపోయి నాట్యాలాడుతుంటే... అది చూసి జాజి పూల పరవశం మాటల్లో  చెప్పలేనిది..! ఎందుకంటే మీ రంగు, పరిమళాలకి నా రుచి కలిస్తేనే మీకు అందం అని చెప్తూ... వాటితో  పాటు సంగమించి .. చక్కటి రుచిని చేకూరుస్తాయి మా విరజాజులు..! ఇక్కడ ఒక వింత గమనించారా... మల్లె పూలు చంద్రుణ్ణి ప్రత్యక్షంగా చూడచ్చుగా.. కానీ అలా వద్దట...ఎందుకంటే అలా ప్రత్యక్షంగా చూస్తుంటే చంద్రుడిలో ఏదో లోపం ఉందిట... అందుకే అవి ..తొంగి తొంగి జాజి కొమ్మల్లో నుండి దోబూచులాడుతూనే కనిపించీ కనిపించని చంద్రుణ్ణి చూస్తాయట... అంటే జాజి పూల తాలూకు మకరందం చంద్రుడి కాంతుల్లో  కలిస్తేనే మల్లె పూలకి నచ్చుతుందిట..! ఈ మూడిటి బంధం ఎంటో మానవ మాత్రులకి అర్ధం కానిదీ... అర్ధం చేసుకోలేనిదీ కూడా..! అసలెప్పటిదో ఈ బంధం...!

ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది... వేప పువ్వు వాసనలు...మధురమైన జాజి పువ్వు మకరందపు  పరిమళాలు.. మల్లె పూల మధురిమలు... ఇవన్నీ ఉండగా వచ్చిన వెన్నెలలో  అలా రాత్రంతా  తడిస్తే... ఉదయాన్నే లేచి చూసేసరికి... మన శరీరాలు మనకి తెలీకుండానే తెల్లగా అయిపోయినట్టుగా  అనిపించటమో... లేక ..ఆ మధుర సువాసనలు మనకి వంటబట్టి... అలా కొంచెం సేపు ఉండిపోతాయనో  అనిపిస్తూ ఉంటుంది..!

పైగా... ఫల్గుణ పౌర్ణమి అంటే ఆ రోజున రంగుల పండగ..! ప్రజలంతా ఆనందోత్సాహాలలో తేలియాడే రోజు..! రంగు రంగులతో పగలంతా గడిపేసి... చీకటి పడేసరికి...అన్ని రంగులనీ మర్చిపోతూ అందరూ ఒకే రంగుని పులుముకుని... ధవళ  కాంతిలో మెరిసిపోతూ ఉంటారు..! ఎన్ని రంగులు పూసుకున్నా.. ఎన్ని రంగుల్లో మనన్ని మనం  చూసుకున్నా.. అదేంటో ఆయన.. అదే.. మనందరికీ మావయ్యా.. చంద్రయ్య అలా మన పైకి  రాగానే.. మన రంగులన్నీ వెలవెలబోతాయి..! మరి ఆయన తన వెన్నెల దుప్పట్లో మనల్ని అందరినీ  కప్పేస్తాడుగా..! ఆ దుప్పటి మన మీద పడగానే రంగులన్నీ పోయి... కేవలం ఒకే ఒక్క వర్ణం...అదే.. మానవ జాతికి కావలసిన .. కల్మషం లేని... వెండి వర్ణం... చల్లని తెలుపు వర్ణం పులుముకుంటుంది...! అసలు మనుషుల రంగులు వేరు ఏమో కానీ .. వాళ్ళ మనసుల రంగు మాత్రం ఇది మాత్రమే ఉండాలి అని చాటి చెప్పే వర్ణం! మరి వర్ణం ఒకటే అయితే....వైరుధ్యం అనేది ఉండదుగా..! వైరుధ్యం అనేదే లేనప్పుడు విరోధి ఉండడుగా.! విరోధి లేకపోతే మరి ఉండేది ఏంటీ .. వైభవమేగా..! మరి ఆ వైభవం కోసమేగా ఖర నామం రాబోతోంది ..అదే...శేఖర నామం రాబోతోంది..!

ఫల్గుణ (కొంచెం సేపు ఫాల్గుణ అని అనుకోకపోతే) అంటే అర్జునుడు  అని కదా..! మరి అదే  అర్జునునికి  విజయ,  కిరీటి, సవ్యసాచి లాంటి నామాలెన్నో ఉన్నాయి కదా..! అంటే ఈ పున్నమి నుండి మనం కూడా  అన్నిటిలోనూ  విజయం సాధిస్తూ కీర్తి కిరీటాలని సాధించబోతున్నామా..? ఏమో...నిజమేనేమో..!

అందుకే ఈ ఖర నామం...శేఖర నామంగా అయ్యి..వచ్చే సంవత్సరం మొత్తం అందరికీ సకల శుభాలు జరగాలనీ...జరుగుతాయనీ.. జరగటానికి ఈ ఫాల్గుణ పౌర్ణమి ఒక నాందిగా అవుతుందని ఆశిస్తున్నాను ..!

12, ఫిబ్రవరి 2011, శనివారం

నట రాజయకీయం

ప్రజారాజ్యం మరణించింది..!
ప్రజారాజ్యం అసువులు బాసింది..!
ప్రజారాజ్యం నికృష్ట చావుని చూసింది..!
ప్రజారాజ్యం దారుణ హత్య..!
ప్రజారాజ్యం నీచ ముగింపు..!


ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ప్రజారాజ్యానికి సరిగ్గా అతికినట్టు సరిపోతుందేమో..! నేను సైతం అంటూ ఉప్పెనలా వచ్చి.. అశ్రువొక్కటి ధారవోసాను అంటూ బీరాలు పలికి... ప్రజలను మోసం చేసిన కొంత మంది చిరాయువులు...చివరికి వెన్ను పోటు పొడిచి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు..! చివరికి...సదరు ప్రజారాజ్యాన్ని నమ్ముకుని సమిధలు అయింది ఎవరు... దాని కోసం పని చేసిన కార్యకర్తలు..! దాని స్థాపకుల అభిమానులు..! సత్య పాలన తాలూకు ప్రగల్భాలని నమ్మిన ప్రజలు..!


గత ఆరు దశాబ్దాలుగా లభించని, కనిపించని అభివృద్ధి ఇప్పటికైనా వస్తుంది అని ఎవరిని చూసి ఆశించారో... ఎవరిని నమ్ముకుని చర్చించుకున్నారో... ఎవరిని నిజమైన జగదేక వీరుడని అనుకున్నారో... ఎవరిని చూసి అన్యాయాన్ని, అవినీతిని అంతం చేసే త్రినేత్రుడని అనుకున్నారో..."ఊరికి ఇచ్చిన మాట" ని నిలబెట్టుకునే "మగమహారాజు" అని  ఎవరిని సమర్ధించారో.. ఆ "చిరంజీవి" ఒక "మహానగరంలో మాయగాడన్న" సంగతి...అతి భయంకర అవినీతి పరులతో చేయి కలిపి, పదవి కోసం పాకులాడుతూ...దాని కోసం ఎంతకైనా తెగించే "రాక్షసుడన్న"  సంగతి... ఇష్టంతో స్థాపించుకున్న రాజకీయ సంస్థని స్వార్ధంతో అన్యులకు ధారాదత్తం చేసే "లంకేశ్వరుడన్న" సంగతి ఎవరూ కనిపెట్టలేకపోయారు..!


నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అని పలికి... ఇప్పుడు అదే ప్రపంచం తెల్లబోయేలా ప్రవర్తించింది ఎందుకు...? "చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలూ, ధనవంతుల పన్నాగాలూ, ఇంకానా? ఇకపై చెల్లవు"... "సమన్యాయమే మన లక్ష్యం... సమ సమాజమే మన గమ్యం" అంటూ ఢంకా భజాయించారు....! కానీ జరిగిందేమిటి... తరచి చూడకుండానే తెలుస్తోందిగా... అవినీతి పాలిట "రుద్రనేత్రుడు" అని అనుకున్నవాడు "దేవాంతకు"డయ్యాడు..!

అభివృద్ధి ఆశలు చూపిస్తూ... వేంకటేశుడి పాదాల సాక్షిగా చేసిన "చాణక్య శపధాన్ని"  తుంగలో తొక్కి జనం నమ్మకాన్ని వమ్ము చేస్తూ... అభిమానులు, కార్యకర్తల ఉత్సాహాన్ని నీరు గారిచిన కిరాతకుడయ్యాడు... "రాక్షసుడయ్యాడు"..!

పురిటి నొప్పులు పడినంత సేపు పట్టలేదు... ఇది ఎంతో కాలం నిలబడేది కాదు అనే నిష్టుర సత్యాన్ని గ్రహించటానికి... ఎలాగో దీపాన్ని నిలబెట్టాములే అని అనుకుంటున్నంతలోనే అంతర్గత విబేధాలు... మనసుల మధ్య లుకలుకలు...! అవన్నీ సద్దుమణగకముందే ఎన్నికలు...మరి విజయం రమ్మంటే ఎలా వస్తుంది...ఐకమత్యం లేనివాళ్ళని ప్రజలెలా నమ్ముతారు...! అందుకే తగిన గుణపాఠం...పజ్జెనిమిదితో సరిపెట్టుకో అంటూ..! మరి అనుభవం పాఠం నేర్పిందా.... లేదు...! అప్పటికీ ఇంకా ఏవో శుష్క ప్రవచనాలు..! దాని ఫలితమే చివరికి ఆరిపోయిన ఈ దీపం..! అంటే... కేవలం రెండు సంవత్సరాల పసికందుని హత్య చేసిన మహా పాపం..!

నాయకత్వం చేతకాకపోవటం తప్పు కాదు...అలాంటప్పుడు ఎవరి సహాయాన్ని అర్ధించాలో కూడా తెలీని మానసిక దౌర్బల్యంతో ఉండటం కూడా తప్పు కాదు..! కానీ కొన్ని విషయాలని అడ్డం పెట్టుకుని ప్రజలని మోసం చేయాలనుకోవటం మాత్రం క్షమించరాని నేరం..! ఏ క్షణాన దురితులతో చేతులు కలిపాడో...స్వార్ధ రాజకీయుల పంచన నిలిచాడో... ఆ క్షణానే ధర్మ పాలననీ... అవినీతి నిర్మూలననీ కాంక్షించే వారి దృష్టిలో "నకిలీ మనిషి" అనే ముద్ర వేయించుకున్నాడు...!

నటించిన ప్రతి సారీ విజయమే సిద్ధిస్తుంది అని భ్రమించే వాళ్లకి ఇదొక గట్టి పాఠం..! జీవించాడే అనేట్టుగా నటిస్తే చప్పట్లు కొట్టే అభిమానులే... నటననే జీవితంగా మార్చాలనుకుంటే...ఏమార్చాలనుకుంటే...  ఏమౌతుందో తెలియ చెప్పారు..! అన్ని పాత్రలలోనూ నటించటం అంత సులభం కాదన్న విషయం ఇప్పటికైనా తెలుసుకుని మసలుకుంటే మంచిది..లేదంటే కనీసం నటించటానికి కూడా అవకాశం లేని జీవితాన్ని ప్రసాదించే శక్తి అదే అభిమానులకి ఉంటుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి వస్తుంది సదరు "రాజా వక్రమార్కుల" వారికి...!
నటన నటనే... జీవితం జీవితమే అన్నట్టుగా ప్రవర్తించి... అభివృద్ధి కాంక్షని చేతల్లో చూపించి... దాన్ని సాకారం చేసి చూపించిన అన్నగారికి... రాజ్య కాంక్షతో ప్రజలని మోసం చేసి పబ్బం గడుపుకోవాలనుకుని అన్నయ్య, తమ్ముడు అనే ముద్ర వేసుకుని తిరిగే "తోడు దొంగలకీ" పోలిక ఎలా ఉంటుంది...!



ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు...  అభివృద్ధి సాధన, అవినీతి అంతం అనే లక్ష్యాలని చేరుకోవటానికి సమాజంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయనే విషయాన్ని గమనించలేకపోయానంటూ ఒక నెపం సమాజం మీదికే..! అంత పెద్ద లక్ష్యం కోసం ఒక పని చేసే ముందు ఎటువంటి ఇబ్బందులు వస్తాయో కూడా ముందుగా ఊహించగలిగే శక్తి లేదా..? మరి అలాంటప్పుడు జనాన్ని మభ్యపెట్టేట్టుగా "అన్నయ్య" చెలామణీ ఎందుకో..! రాజకీయం అంటే "మంచు పల్లకీ" అనుకున్నాడేమో..!



"రొట్టె ముక్కా, అరటి తొక్కా, బల్ల చెక్కా... నీ వేపే చూస్తూ ఉంటాయ్, తమ లోతు కనుక్కోమంటాయ్" అంటూ తన కవితావేశం లో శ్రీ శ్రీ గారన్నట్టు...  "చిత్రసీమ, రక్త పానం, రాజకీయం... నీ వేపే చూస్తూ ఉంటాయి తమని అందుకోమంటాయ్" అని ఇప్పుడు ఈ ఘనులని చూసి మనం అనుకోవాలేమో...! శ్రీ శ్రీ గారి కవితల్లో "కాదేదీ కవితకనర్హం.." అని చెప్పినట్టుగానే...ఇప్పుడు మనం కూడా వీళ్ళని చూసి అర్ధం చేసుకోవాలేమో... "కాదేదీ ధనార్జనకనర్హం..." అనే విషయాన్ని..!


ఇలాంటి వాళ్ళ ఆట కట్టించాలంటే ప్రతి వ్యక్తీ.."నేనంటే... విశాల జగత్తు, విరిసిన మహత్తు! నేనంటే...ముసుగేసిన అక్షరవనం, ముసురేసిన నీలిమేఘం" అనే శ్రీ శ్రీ గారి మాటల్లోని వాడిని వంటబట్టించుకుని ముందుకు పోవాలి..! లేదంటే...దొంగల ముఠా చేతుల్లో హతమవాల్సిందే..!