8, జనవరి 2012, ఆదివారం

ఒక రోజు


గత కొన్ని రోజులుగా అడగాలనుకుంటూ, ధైర్యం చాలక.. ఇక లాభం లేదని "ఒక రోజు" నేనే అడిగేశాను.. నువ్వు నాకేం ఇచ్చావు అని. ఏం మాట్లాడలేదు. మళ్ళీ రెట్టించి అడిగాను."ఇన్నాళ్ళుగా నాతో ఉన్నావు.. నేనే ఆత్మీయుణ్ణి అన్నావు.. నన్ను ప్రేమిస్తున్నానన్నావ్. నేను లేకపోతే నువ్వు లేనట్టే అని కూడా అన్నావు.. మరి నువ్వు నాకేం ఇచ్చావు" అని. అప్పుడు ఆ రోజు నా వైపు చిరుమందహాసంతో చూసింది. నేను నీకేం ఇచ్చానో, నీకోసం ఏం చేశానో చెప్తాను కానీ... నిన్ను ఇంతగా ప్రేమిస్తున్న నాకు, నిన్నే వెన్నంటి ఉంటున్న నాకు నువ్వేం చేశావో చెప్పు మరి అని అడిగింది.

అంటే నేను ఏదో ఒకటి ఇస్తేనే నువ్వు ఇస్తావా. ఇంతేనా ప్రేమంటే.. ఇదేనా అభిమానం అంటే. ఏదో ఒకటి ఇచ్చిపుచ్చుకుంటేనే కానీ నా దానివి కావా నువ్వు అని అడిగాను. అట్లాగని నేను అనలేదు కదా. నా వాడివైనప్పుడు నువ్వు నాకు ఏదో ఒకటి ఇస్తావనే ఆశ ఉంటుందిగా. ఆ ఆశతో, చనువుతో అడిగాను అంతే అని చెప్పింది. 'నీకు నచ్చుతుందని ప్రతిరోజు పొద్దున్నే లేచాక మనస్ఫూర్తిగా సంధ్యావందనం చేస్తున్నాను కదా' అని చెప్పాను. 'అది నువ్వు నీ  క్రమశిక్షణ కోసం చేసుకున్నది, అంతే కాని నా కోసం కాదుగా' అన్నది. 

'కార్యాలయానికి వెళ్ళి నేను నిర్వర్తించాల్సిన బాధ్యతని చిత్తశుద్ధితో నిర్వర్తించానుగా' అని చెప్పాను. 'అది నీ జీవితం కోసం చేసుకున్నది, నువ్వు అది చెయ్యకపోయినా నాకొచ్చే నష్టం ఏంటి' అని అదిగింది. 'నా జీవితం అంటే అందులో నువ్వు లేవా' అని అడిగాను. 'ఉన్నానేమో.. కానీ నన్ను పొషించటానికి నువ్వు ఏదో ఒకటి చెయ్యాల్సిందే.. తప్పదు కాబట్టి చేస్తావు. కానీ నాకోసం మాత్రమే అన్నట్టుగా ఏం చేశావు' అని మళ్ళీ అడిగింది.

'నలుగురికీ సహాయపడాలని చెప్తూ ఉంటావుగా.. అందుకే నాకు చేతనైనంతలో ఈ రోజు కొంతమందికి సహాయపడ్డాను' అని చెప్పాను. 'అది నీ మానసిక తృప్తి కోసం చేసుకున్నావు. నాకోసం కాదుగా' అని అనేసింది. 'అదెలా.. నువ్వే కనుక రాకపోతే ఈ రోజు నేను వాళ్లకి సహాయం చెయ్యగలిగే వాణ్ణే కాదు. నువ్వు నా దగ్గరికి వచ్చినందుకు గాను సంతోషంతో నేనీ పని చేశాను. అలా చెయ్యటం వల్ల.. సంతోషించి నువ్వు ఎప్పటికీ నా దగ్గరికి వస్తూనే ఉంటావని, నా దగ్గరే ఉండిపోతావని నా ఆశ' అని చెప్పాను. ఈ సమాధానంతో తృప్తి చెంది ఆ రోజు చిరునవ్వుతో చూసింది నా వైపు.
అయినా మళ్ళీ అడిగింది.. 'నేను వచ్చినందుకే నువ్వు వాళ్లకి సహాయం చేసినా కూడా అది నీకు ఆనందం కలిగించేదే కానీ నాకోసం  కాదుగా' అనే సరికి ఒకింత కలుక్కుమన్నది మనసులో. 'అదెలాగబ్బా.. నీకు నేను ప్రత్యక్షంగా ఏం చెయ్యలేదేమో. కానీ నువ్వే కనుక రాకపోతే నేనీ పని చెయ్యగలిగి ఉండేవాణ్ని కాదుగా. అందుకే నీ రాక వల్ల సంతోషంతో నేనీ పని చేశాను' అని చెప్పాను. వీడికి చేతనైనంతలో ఏదో ఒకటి చేశాడులే అనుకుందేమో, ఆ రోజు ఆ విషయంలో మాత్రం నన్ను వదిలేసింది.

'ఇవాళ పొద్దుణ్ణుండి నా చుట్టూ ఉన్నవాళ్ళకి సంతోషం కలిగించేలా ప్రవర్తించాను' అని చెప్పాను. 'అది నువ్వు నీ తోటి వాళ్ళతో సత్సంబంధాలు ఉండటానికి చేసిన పని. అది చెయ్యకపోతే నీకే నష్టం... నాకేం' అని వెక్కిరించింది. అలా అనేసరికి నేనేమీ మాట్లాడలేకపోయాను.

'నువ్వు లేనిదే భోజనం కూడా నాకు చెయ్యాలనిపించేది కాదు... అందుకే భోంచేసేప్పుడు కూడా నిన్నే తలచుకున్నాను' అని చెప్పాను. 'నన్ను తలచుకున్నందుకు నాకు సంతోషమే. కానీ అసలంటూ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం కూడా. అందుకే భోజన సమయంలో నన్ను తలచుకోకపోయినా నేను వస్తూనే ఉంటాను కదా. మరి అలాంటప్పుడు నువ్వు నాకు చేసిందేముంది ఇందులో' అని అడిగింది. నాకు ఒకింత చిన్నతనం అనిపించింది. కొంత కోపం కూడా వచ్చింది.

'నా కుటుంబ సభ్యులకి ఈ రోజు ఏం కావాలో అన్నీ అందేలా ఏర్పాట్లు చేశాను. దాంతో వాళ్ళంతా సంతోషంగా తృప్తిగా ఉన్నారు' అని చెప్పాను (ఇది కొంతవరకు అబద్ధమేమో కూడా). 'అది నీ కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ ఆనందం కోసం, సౌఖ్యం కోసం నువ్వు చేసుకున్న ఏర్పాట్లు. తద్వారా నువ్వు సంతోషంగా ఉంటావు. అలాంటప్పుడు అందులో నాకు చేసిన ఉపకారం ఏముందని' అంటూ వెటకారంగా చూసింది నన్ను. దాంతో చిర్రెత్తుకొచ్చింది నాకు. 'అంటే నా వాళ్ళు నీ వాళ్ళు కానట్టేనా' అని అడిగాను. 'నీ వాళ్ళు నా వాళ్ళు అయితేనే కదా నేనీ రోజున నీతో ఉంటున్నది.. మరి అలాంటప్పుడు వాళ్ళు నా వాళ్ళు కాకుండా ఎలా ఉంటారు. వాళ్ళు నా వాళ్ళు అయినప్పటికీ, నీ నుండి నాకంటూ ప్రత్యేకంగా ఏదో ఒకటి నేను ఆశించటం తప్పా' అని అడిగింది.

'నువ్వెప్పుడూ నాకు చెప్పే ఆ 'సమాజ శ్రేయస్సు' కోసం ఏం చేస్తే బావుంటుందో నలుగురితోనూ వివరంగా చర్చించాను. సలహాలివ్వటమే కాదు.. నాకు చేతనైనంతలో ఆచరించి కూడా చూపించాను. అది చాలదా' అని కొంచెం గట్టిగానే అడిగాను. 'ఇదిగో.. ఇలా కోప్పడితే నేను మళ్ళీ రాను.. వచ్చినా నీతో మాట్లాడను' అంటూ లేచి నిలబడేసరికి ఒక్కసారిగా భయం వేసింది. ఎందుకంటే .. తనను విడిచిపెట్టి నేను ఉండలేను. తను నా ప్రాణం. వెంటనే నన్ను నేను తమాయించుకుంటూ "కోపం ఏం లేదులే, మాములుగానే అడిగాను. ఇది చాలదా చెప్పు.. ఇంకా నేనేం చేస్తే నీకు నచ్చుతుంది అని అడిగాను. "ఏం చేస్తే నచ్చుతుంది అంటే... అది నీకే తెలియాలి. అన్నీ నేను అడిగాక ఇస్తే నీ గొప్పతనం ఏముంది. నానుండి నీకేం కావాలని అనుకుంటున్నావు, నీకు ఏది దక్కితే ఆనందంగా ఉంటావు.. దేనివల్ల జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండగలనని నువ్వనుకుంటున్నావు. అది నిర్ణయించుకో ముందు. అప్పుడు నాక్కావలసింది ఏంటో కూడా నీకే తెలిసిపోతుంది అని చెప్పింది. 

నేను కొంచెంసేపు ఆలోచించాను. సమాధానం తెలీక కాదు.. ఎలా చెప్పాలో తెలీక ఆలోచించాల్సొచ్చింది. చివరికి నాకు తోచిన పధ్ధతిలో చెప్పేశాను.  
'..నా జీవితంలో కేవలం సుఖాలే కావాలని నేను కోరుకోవట్లేదు. అలాగని పని కట్టుకుని కష్టాలని ఆహ్వానించాలన్న ఉద్దేశ్యమూ లేదు. ఏది వస్తే దాన్నిస్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను. ఒకరకంగా చెప్పాలంటే.. జీవితం అన్ని రుచులతో పాటు... శృతి బద్ధంగా.. రాగయుక్తంగా ఉండాలని... తద్వారా ఇక్కడ నీతో ఉన్నన్నాళ్ళూ.. నా మనసుకి నచ్చిన వాళ్ళతో కూడా ఉంటూ, వాళ్ళు కూడా నా వల్ల సంతోషంగా  ఉంటూ.. హాయిగా మనశ్శాంతితో గడిపెయ్యాలనుంది. పైన చెప్పినవి ఏం చేసినా, ఇది మాత్రం దక్కేలా కనిపించట్లేదు' అని చెప్పాను. 'అలాంటప్పుడు నువ్వు చెయ్యాల్సింది చిత్తసుద్ధితో చేస్తూ.. కావాలనుకున్న దాన్ని పొందటం కోసం కార్యదక్షుడవై ముందుకి వెళ్తూ.. అదే సమయంలో అందరితోను సఖ్యతతో వ్యవహరిస్తే.. నీకు కావలసింది తప్పకుండా దొరుకుతుంది కదా' అనేసింది. 'అది నాక్కూడా తెలుసు.. ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు'  అని కొంచెం బుంగమూతి  పెట్టుకుని, వెటకారంగానే అడిగాను. 'అంటే నీకు విషయం తెలుసు కానీ, చెయ్యాల్సింది చెయ్యవన్నమాట నువ్వు' అనేసింది. ఓహో.. అంటే నాకు విషయం తెలుసు.. కానీ చెయ్యట్లేదు. తెలిసిన విషయాన్ని ఆచరణలో పెడితే సరిపోతుంది కదా అనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి, ఎప్పటికంటే కూడా ఆ రోజు నా వైపు అత్యంత అందంగా...అనురాగంతో... వర్ణించటానికి కూడా కష్టం అనిపించేట్టుగా అవ్యక్తానుభూతి కలిగేట్టుగా.. స్వచ్చమైన, నిర్మలమైన నవ్వుతో నా వైపు చల్లని చూపులని ప్రసరిస్తూ నా తల నిమురుతూ అలా ఉండిపోయింది. ఆ చల్లదనంలో ఏదో ప్రపంచంలోకి వెళ్లిపోయానేమో.. ఉన్నట్టుండి ఏదో శబ్దానికి ఉలిక్కిపడ్డాను.

ఆ ఉలికిపాటుకి కళ్ళు తెరిచి చూసేసరికి... ఎదురుగా కిటికీలో నుండి కనిపిస్తున్న వేపచెట్టు కొమ్మల్లోంచి ఎంతో అందమైన నిర్మలమైన స్వచ్చమైన అనురాగంతో కూడిన నవ్వుతో.. నన్ను రమ్మని పిలుస్తూ.. 'మరో రోజు' నాకోసం ఎదురు చూపులు.

నా వెన్నంటే ఉంటూ, నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించే "ఒక రోజు" నా కోసం చీకట్లోనే వచ్చేసి వెలుగులు విరజిమ్ముతూ ఎదురు చూస్తుంటే..  నేనేమో ఇంకా ఇలాగే ఉన్నానే మందబుద్ధిని అనుకుని గబగబా తయారైపోయాను.. కార్యదక్షతతో ముందడుగేస్తూ.

1, జనవరి 2012, ఆదివారం

అమ్మమ్మ తీర్మానం

అమ్మమ్మ...
తెలుగు, సంస్కృతం.. ఉభయభాషా ప్రవీణురాలు. సంగీతం ఇరగదీస్తుంది.. వాయులీనం వాయించేస్తుంది..!
ఇంగ్లీష్ అంతగా రాకపోయినా రోజుకి ఒకసారైనా చాలానే పదాలు ఉపయోగిస్తూ మాకు డెత్ వారెంట్స్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. అమ్మమ్మ జపాలు, పూజల గురించి చెప్పుకోవాలంటే ఆవిడ చదివిన అష్టాదశ పురాణాల తరవాత మనం ఒక నవదశ పురాణం చెప్పుకోవాలి. ఇదిగో ఈ చిన్న ఉదాహరణ.
 
ఆమె కడిగీ కడిగీ పాదాలు పాసిపోయాయి అంటే నమ్ముతారా? దాంతో డాక్టర్ గారు చాలా సీరియస్ గా 'నేనిచ్చిన మందులు కొంతవరకే పనిచేస్తాయి. సమస్య పూర్తిగా నయమవ్వాలంటే మీరలా నీళ్ళలో నానటం తిరగటం లాంటివి అజ్జెంటుగా మానెయ్యాలి. లేదంటే మీ ఇష్టం' అని చీవాట్లు పెట్టారు. అయినా మా అమ్మమ్మ వింటేగా..! ఆమె వదలందే ఈయన మాత్రం ఏం చేస్తాడు. రోజుకి కనీసం పదిహేను బకెట్ల నీటితో కడిగేస్తోంది కాబట్టే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. తప్పించుకోలేక డాక్టర్ వంక దీనంగా చూస్తూ శ్రీ రామచంద్రులవారు డాక్టర్ గారితో "నన్నేం చెయ్యమంటారు డాక్టర్ గారు. ఇలా నీళ్ళలో తిరగటం నాకు మాత్రం సరదానా ఏంటీ. అదిగో.. హైదరాబాద్ లో ఉన్న ఆ మహాతల్లి వల్ల నాకీ కష్టాలు. వాళ్ళు బావుండాలీ, వీళ్ళు బావుండాలీ అంటూ.. వాళ్ళ అందరి సంగతినీ నేనే చూసుకోవాలంటూ, చెప్పిన పేర్లే చెప్పి, వివరించిన విషయాలే మళ్ళీమళ్ళీ వివరించి.. ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి ఒక్కో బకేటెడు నీళ్ళతో నా కాళ్ళు కడిగి పారేస్తోంది. అందరూ కొలుస్తున్న నా కాళ్ళలో ఏం లేదు సార్. అంతా ఆవిడ చేతుల్లోనే ఉంది!" అన్నాడు. 
అవును మరి... డాక్టర్ గారు చీవాట్లు పెట్టింది అమ్మమ్మకి కాదు.. రాముడికే.
 
"ఆ రోజుల్లో శబరి ఎంగిలి పండు ఇస్తున్నా సంతోషంగానే తిన్నాను. అలాగని ప్రతిరోజు నాకు ఎంగిలిదే పెడతానంటే ఎలా సార్. ఆ మధ్య ఎప్పుడో ఓ సారి ఈవిడ చేత కాళ్ళు కడిగించుకున్నాను. అంతే.. ప్రతి రోజు ఇన్నేసి నీళ్ళతో.. హుమ్మ్..! చూడండి సార్, చివరికి ఆవిడ నా కాళ్ళు కడిగిన నీళ్లన్నీ ఇలా నా కళ్ళలో నుండి వచ్చేస్తున్నాయి పెల్లుబికి! మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి" అని వేడుకోలుగా అడిగాడు పాపం. 
 
డాక్టర్ గారన్నారు.. 'పోనీ మీ బాస్ ని అడిగి వేరే ఊరికి బదిలీ చేయించుకోండి అని. నా మొహంలే. నాకు ఆ అదృష్టం కూడానా మహాప్రభో.. కనీసం ఆ ఆప్షన్ కూడా లేదు నా బతుక్కి. బాస్ అంటే నేనే.. నేనంటేనే నా బాస్. ఆ మధ్య ఓ సారి కొన్ని సెటిల్మెంట్స్ చెయ్యాల్సొచ్చి నేనే మారు వేషంలో ఇలా కొంత కాలం పాటు ఈ భూమ్మీద ఉన్నాను. అంతే.. ఫినిష్.. దాని పర్యవసానం... ఇప్పుడీ పెద్దావిడ చేతుల్లో నా బతుకు పాసిపోవటం. విచిత్రం చూడండి.. వీళ్ళాయన కూడా నా భక్తుడే.. కానీ ఆయన మరీ ఇంత వైల్డ్ కాదు. అలా ఓ దణ్ణం పెట్టుకుని వదిలేస్తాడు. ఈవిడే ఇలా. పోనీ తినటానికి ఏదైనా పెడుతుందేమో అనుకుంటే, రోజు ఓ చెంచాడు పంచదారో, ఇంకొంచెం భక్తి ఎక్కువైతే ఓ చిన్న గిన్నెడు పొంగలీ, లేదంటే పులిహోర. ఇవేగా నాకు. పోనీ అవైనా నాకు పూర్తిగా పెడుతుందా అంటే.. నాకు అలా వాసన చూపించటానికి దగ్గరికి తీసుకొస్తుంది. ఈలోగా.. అదిగో ఉన్నాడుగా వాళ్ళ మనవడు...ఆ దరిద్రుడు కాంబోడియా వరద బాధితుడిలాగా చూస్తూ నిలబడగానే వాడి చేతుల్లో నాకోసం చేసిన నైవేద్యాన్ని పెట్టి పంపించేస్తుంది. పోనీ ఆ కోతిగాడు.. అదే.. వాళ్ళ మనవడు.. నా పాదపూజ అవుతున్న సమయంలో వస్తాడా అంటే.. అహా.. రాడు.. సరిగ్గా నైవేద్యం సమయానికి తయారవుతాడు. అక్కడ ఇంటిముందు గేటు దగ్గర కూర్చుని అడుక్కుతినేవాళ్ళు తింటున్నట్టుగా పులిహోర పొంగళ్ళని తినేస్తూ ఉంటాడు కక్కుర్తి మొహంగాడు' అని వాపోయాడు పాపం రామయ్య.
 
ఎక్కడో సముద్రం కింద ఉన్న పెద్దాయన కూడా ఈవిడ పూజల ధాటికి ఇల్లు ఖాళీ చేసి అండమాన్ నికోబార్ అడవుల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి. అదీ మా అమ్మమ్మ పవర్.
 
                                                       ***********************
 
మొన్నొక రోజున.. ఈవిడ జపాలు, పూజలు అన్నీ అయిపోయాక కాలక్షేపానికి చదువుకోటానికి ఆంధ్రజ్యోతి దిన పత్రికలో వచ్చే ఆదివారం పుస్తకం ఇమ్మంది. నాకు తెలుసు, ఈ విషయంలో మొగుడు పెళ్ళాలు తెలంగాణా ఆంధ్రా జిల్లాల నేతల్లాగా... ఆదర్శ దంపతుల్లాగా వాదించుకుంటారని. కాబట్టే ఆనాడు "ఈనాడు" కూడా తెచ్చి ఉంచాను ముందే. ఎందుకంటే... అమ్మమ్మకి తీరిక దొరికి సరిగ్గా ఆ పుస్తకాన్ని పట్టుకునే సమయానికే, తాతయ్య సంధ్యావందనాలు, దేవతార్చనలు భోజనం పూర్తయ్యి ఆ పుస్తకం పట్టుకునే సమయం రానే వస్తుంది. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఆ విధంగా ఆ పూటకి ఆ విషయంలో భారత్ నేపాల్ మధ్య ఉన్నంత సత్సంబంధాల లాంటివి వాళ్ళిద్దరి మధ్యా నెలకొల్పటంలో నా కృషి పరిఢవిల్లిందన్నమాట. నా ఈ తెలివి తేటలకి ఇది ఒక మెచ్చు తునక. మీరందరూ ఇప్పుడు చప్పట్లు కొట్టాలి నా సమయస్ఫూర్తికి (కొంచెం కష్టమైనా సరే..).
 
సరే.. పుస్తక పఠనం ఆరంభం. తాతయ్య భోజనం తరవాత వక్కపొడి నమిలినట్టుగా ఓ పది నిమిషాలు ఈనాడు పుస్తకాన్ని నమిలేసి 'కాసేపు అలా నడుం వాలుస్తా' అనుకుంటూ లోపలికెళ్ళాడు శాలువా కప్పుకుని. ఆయనది ఒక కోడి నిద్ర. గట్టిగా ఫది నిమిషాలు పడుకుంటాడో లేదో.. లేస్తూనే.. 'ఏమ్మా.. కాస్త కాఫీ నీళ్ళు పోస్తావూ అంటూ లేస్తాడు. మధ్యాన్నం పూట నిద్ర లేచాక.. ఆయనకి ఆవలింత కంటే  ముందు 'కాఫీ' అనే పదం వస్తుంది. ఆ తరవాతే.. అది కూడా కాఫీ రావటం లేట్ అయితేనే ఆవలిస్తాడు. లేదంటే అది కూడా బంద్.
 
ఆంద్రజ్యోతి పుస్తకం చదువుతూ అందులోకి లీనమైపోయిన అమ్మమ్మకి అందులో అత్యంత  ఆకర్షణీయమైన ప్రకటన ఒకటి కనిపించింది. KVR ఇంస్టిట్యూట్ వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తారనే ప్రకటన అది. దాని సారాంశం - రోజుకి ఒక్క గంట సేపు... అది కూడా ఇంట్లో కూర్చుని సాధన చేస్తే చాలు ఇంగ్లీష్ లో మాట్లాడటం కేవలం నెల రోజుల్లో వస్తుంది అని. అది చదివిన అమ్మమ్మ... నన్ను పిలిచి అది చూడమంది. సరే అని మొత్తం చదివేశాను. అప్పుడు ఆమె - 'ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏవేవో కాలేజీలకి వెళ్లి సంవత్సరాల తరబడి నేర్చుకుంటే కానీ రాదు అని అనుకున్నానురా ఇన్నాళ్ళు. వీడేంట్రా నెల రోజుల్లో వచ్చేస్తుందని అంటాడు. ఈ విషయం అప్పుడే తెలిస్తే నేను కూడా నేర్చుకునేదాన్ని కదా. ఇంత కాలం అయ్యాక ఇప్పుడు చెప్తున్నాడు ఈ పిచ్చిముండా కొడుకు" అని
నవ్వుతూ ఇంగ్లీష్ లో తిట్టిన తిట్టు నాకు తెలుగులో వినపడింది.
 
ఇలా అనటంలో ఆమె ఉద్దేశ్యం - ఒక భాష నేర్చుకోవటం ఇంత సులభం అంటూ వాడు జనాన్ని మభ్యపెడుతున్నాడని అనుకోవాలో... లేక నిజంగానే ఈవిడకి ఇంగ్లీష్ లో మాట్లాడాలనే కోరిక కలిగిందో.. అర్ధం కాక, నాకొచ్చిన ఆ నాలుగు ఇంగ్లీష్ ముక్కలనీ ఆ అయోమయంలో కొన్ని క్షణాల పాటు మర్చిపోయాను.
ఇది మీరు నమ్మాలి.