12, జనవరి 2014, ఆదివారం

పెళ్ళాం ఊరెళ్తే...


రఘువాళ్ళ ఇంట్లోవాళ్ళంతా ఊరెళ్ళారు. దాంతో మనోడికి రెక్కలొచ్చేశాయి. ధూం ధాం మొదలు. ఫ్రెండ్స్ తో కలిసి  మాంచి పార్టీ చేసుకోవాలనిపించింది. పిలవాలనుకున్న వాళ్ళందర్నీ పిలిచాడు. వస్తూ వస్తూ బయట CD షాప్ నుండి ఫలానా సినిమా CD తీసుకొచ్చేయ్, సరదాగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దాం అంటూ.. శశిగాణ్ణి పురమాయించాడు. ఒరేయ్ ఇలాంటి సందర్భంలో "ఆ సినిమా" అవసరమా అని వాడు అంటుంటే, నీకు తెలీదురా.. ఇలాంటప్పుడే "అవి" కావాలి, ఇంట్లో ఎవరూ లేరు, మనదే రాజ్యం, నువ్వేం భయపడకు అని గట్టి అభయం ఇచ్చాడు. కానీ మనవాడికి షాప్ కి వెళ్లి అసలీ విషయాన్ని ఎలా అడగాలో తెలీక తెగ ఇదైపోతున్నాడు. ఎందుకంటే.. ఇంతకు ముందు ఏనాడూ ఇలాంటి పాడు పని చేసిన అనుభవం లేదు మా గ్రూప్ లో వాళ్లకి. ఇదే మొదటిసారి. కానీ ఎలా..? తీసుకురమ్మని వాడి గోల. అడిగితే షాప్ లో వాళ్ళు ఏమనుకుంటారో అని వీడి టెన్షన్. ఏం చెయ్యాలో తెలీట్లేదు శశిగాడికి. నువ్వు కూడా రారా అని నన్ను అడిగాడు. సరేలే, చావో రేవో ఇద్దరం కలిసే అనుకుంటూ సాహసం చేశాం.

ఎలాగో నన్నూ, ధైర్యాన్నీ కూడగట్టుకుని తీసుకెళ్ళాడు. "నేనైతే షాప్ లోకి రాను.. ప్రతిరోజూ ఒకే కాలనీలో ఉంటున్నవాళ్ళం, ఇలాంటి పని నేను చెయ్యలేను, అసలే చిన్నప్పటినుండీ ఆ షాప్ అంకుల్ కి మనమేంటో తెలుసు. కాబట్టి నీ పాట్లేవో నువ్వే పడు. నేను షాప్ బయట బైక్ మీద రెడీగా ఉంటాను.. నువ్వు పని కానిచ్చుకుని వచ్చేయ్" అని ముందే చెప్పేశాను.

ఈ సారి నన్ను తీసివేసి, ధైర్యాన్ని మాత్రమే కూడి, సాహసాన్ని గుణించి, షాప్ లోపలికి భాగహారం కోసం వెళ్లి మొత్తం పరికించి చూస్తున్నాడు. ఎక్కడా కనిపించట్లేదు. షాప్ లో ఇంకా కొంతమంది కష్టమర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వీడు 'ఇది' అడిగితే వాళ్లకి వినపడుతుంది. ఎక్కువసేపు అక్కడే ఉంటుంటే.. "ఏం కావాలి సార్..నాకు చెప్పండి మీకేం సినిమా కావాలో. మా దగ్గర అన్నిరకాల సినిమాలూ దొరుకుతాయి" అని షాప్ వాడి సణుగుడు. వీడి వాలకం చూసి షాప్ వాడికి ఏం అర్ధమయ్యి ఆ మాటన్నాడో కానీ.. వీడికి ఉన్నట్టుండి వొళ్ళంతా ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. సరే.. వీడి మనోభావాలని అర్ధం చేసుకున్న సదరు కరుణామయుడు... పర్లేదు చెప్పండి సర్.. మీకేం సినిమా కావాలి.. ఇది కావాలా అంటూ... ఒక సినిమ సీడీ చూపించాడు. ఉహు.. అది కాదు అన్నాడు శశిగాడు. ఇలా ఓ నాలుగైదారేడు సీడీలు అయ్యాక.. వీడి దగ్గరికొచ్చి షకీలా సినిమా ఉంది ఇమ్మంటారా అంటూ రహస్యంగా చెప్పాడు. "అబ్బ్...బ్...బ్..బ్బా.. అది కాదయ్యా నాక్కావలసిందీ" అని వీడు ఏడుపుమొహం పెట్టేశాడు సూటిగా అడగలేక. పోనీ.. పెద్దలు మాత్రమే చూసే సినిమాలు.. ఇంగ్లీష్...   ఉన్నాయ్..ఇమ్మంటారా.. మొహమాట పడకండి.." అని నవ్వుతూ అనేసరికి.. వీడికి చిర్రెత్తుకొచ్చి... ఏం వెటకారంగా ఉందా అంటూ ఒక్క అరుపు అరిచాడు. మరింకేం కావాలి సార్ అని వాడు భయపడుతూ అడిగాడు. అప్పుడు వీడు షాప్ వాడి దగ్గరికెళ్ళి.. వీడిక్కావలసిన సినిమా పేరు అతి రహస్యంగా చెవిలో చెప్పాడు. అది పొరపాటున అక్కడున్న కష్టమర్లలో ఒకళ్ళకి వినిపించింది. దాంతో సదరు కష్టమర్, "ఛీ ఛీ.. ఏం మనుషులో ఏంటో.. సభ్య సమాజంలో ఉంటూ.. ఫామిలీస్ ఉండే కాలనీలో.. ఇలాంటి వాళ్ళు.. ఛ ఛ" అని గొణుక్కుని అక్కడినుండి బయటికెళ్ళిపోయాడు. ఆ షాప్ వాడు... తోక తొక్కిన తాచు లాగా లేచి... "రేయ్ వొళ్ళు తిమ్మిరిగా ఉందా... నడూ బయటికి" అని ఒక్క అరుపు అరిచాడు. లోపలి పరిస్థితి అర్ధమైపోయింది నాకు. వ్యాపారం చేసుకుని బతుకుతున్న వాళ్ళం.. మా దగ్గరికొచ్చి ఇలాంటి సినిమాల గురించి అడుగుతావా... బతకాలనుందా లేదా.. అంటూ బయటికి తోసేస్తే.. సరిగ్గా బైక్ వెనక సీట్ మీదికొచ్చి పడ్డాడు. 

మరుక్షణం పక్క వీధిలోకి ప్రత్యక్షమయ్యి...అప్పుడు నెమ్మదిగా బైక్ కిక్ కొట్టి మరో షాప్ కోసం వెతుకుతుంటే,. అక్కడొక షాప్ కనిపించింది. ఆ షాప్ వాడికి.. శశిగాడి మొహం చూడగానే పరిస్థితి అర్ధమైనట్టుంది.. "రండి సార్.. "మీక్కావలసింది... మా దగ్గర ఉంది... అందుకో.."  అంటూ వీణ్ణి చూసి... పాడేసి... కౌగిలించేసుకుని, హి హి హి అంటూ పళ్ళికిలించుకుంటూ పిలిచాడు. అంటే ఇందాకటి షాప్ నుండి తోసేయ్యబడ్డ వాళ్ళని ఈ షాప్ వాడు ఇట్టే కనిపెట్టేస్తాడన్నమాట. సరే.. ఇంకోసారి తిట్టించుకుందాం అనుకుంటూ వెళ్ళి అదే విషయం అడిగాడు. అది విని.. ముందు కొంత ఆశ్చర్యపోయి.. పైనుండి కిందికి ఓ ఐదారుసార్లు చూసి.. "వేషం చూస్తే ఇలా...  అసలు స్వరూపం ఇదన్నమాట.." అనే అర్ధంతో ఏడో చూపు కూడా చూసేసి.. ఆ సీడీ వీడి చేతిలో పెట్టాడు. దాన్ని తీసుకుని ఎలాగో రఘు వాళ్ళింట్లో గుమిగూడాం. ఇహ అనుకున్న ప్రకారం మనోడు మందూ ముక్కా సిద్ధం చేసి మా ముందు పెట్టాడు. అబ్బో...నాకు, అక్కడున్న వీరులందరికీ మందు "పేరు" చెప్తే చాలు... మత్తెక్కేస్తుంది... అదే పేరుని ఇంకో నాలుగుసార్లు చెప్తే హాంగోవర్ కూడా...!! అందుకే దాన్ని అలా స్మరిస్తూ... వేడివేడి పకోడీలు, చల్లచల్లటి మాజా స్ప్రైట్ లూ లాగిస్తూ కత్తిలాంటి సినిమా చూసేశాం..! అలా ఆ పూటకి అందరం ఎంజాయ్ చేసేశాం కానీ... ఇప్పుడీ విషయం ఎవరికైనా తెలిస్తే పరువుపోతుంది... వీళ్ళుకూడా ఇలాంటి వాళ్ళేనా అని చులకనగా చూస్తారేమో అని మనసులో ఏదో మూల శంక. ఆ రోజు సాయంత్రం చీకటిపడ్డాక ఆ సీడీని షాప్ లో ఇచ్చేసాం.

మా వాళ్ళలో ఒకడు... వాళ్ళావిడ ఊరి నుండి రాగానే పొరపాటున నోరుజారి ఈ విషయం చెప్పేసాడు.. "ఇంకోసారి ఇలాంటి పని చేస్తే... విడాకులిచ్చేస్తా" అని బెదిరించిందట. రవి పరిస్థితి మరీ దారుణం. కాబోయే పెళ్ళాం ఇది విని.. "ఛీ.. నువ్విలాంటి వాడివనుకోలేదు. నీ రంగు బయటపడింది. ఈ సంబంధం నాకొద్దు అనేసింది. "సంబంధం వద్దనుకునేలా ఏం పాడుపని చేశావురా..అని వాళ్ళన్నయ్య ఒక లెవెల్లో చీవాట్లు పెట్టాడు. చేసేదేం లేక మళ్ళీ సంబంధాల వేటలో పడ్డారు వాళ్ళు. రఘువాళ్ళ ఆఫీసులో ఈ విషయం ఇంటిగ్రిటి ఇష్యుగా పరిగణించారట. టైం బావుంది కాబట్టి బయటపడగలిగాడు. శశిగాడి ఆఫీసులో ఈ విషయం తెలిసి వాడితో రెండురోజులపాటు మాట్లాడ- కుండా వెలివేశారట.

ఇవన్నీ తెలుసుకుని నేనసలు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా "తొక్కించేశాను". 

అవును మరి.. రోడ్ మీద జీప్ లో వెళ్తూ.. ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టర్ని తొక్కించెయ్ అని గావుకేకలు పెట్టే సీన్ లు చూస్తే ఎవరైనా ఇలాగే అంటారు.  బాలకృష్ణ... "చెన్నకేశవ రెడ్డి" సినిమా సీడీ అడిగితే ఎవరైనా ఇలాగే చూస్తారు మరి. అసలే ఒక్క బాల్ కి రెండు సిక్సర్ లు కొట్టే టాలెంట్ మనోడిది.

కొసమెరుపు... 

శ్రీ సురేష్. శ్రీ అనేది వాడి పేరులో భాగం. అంతేకానీ వాడికి నేనిస్తున్న గౌరవం కాదు. విషయానికొస్తే... వీడు నా ఫ్రెండ్ కం కొలీగ్...!! ఈమధ్యే తండ్రయ్యాడు (చట్ట ప్రకారమే...!!) కొడుకు పుట్టినందుకు సంతోషించాలో బాధపడాలో తెలియని పరిస్థితి వీడిది. పుట్టినవాడి జన్మనక్షత్రాన్ని బట్టి "బ" అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టాలని బ్రహ్మగారి ఉవాచ. చక్కగా కృష్ణుడి పేరు పెట్టుకున్నట్టు ఉంటుందిలే అని "బాలకృష్ణ" అని పెట్టాలనుకున్నాడట. అది విని... "ఆ పేరే పెట్టటం కనుక జరిగితే వీణ్ణి నేను పెంచుకోను, ఇంకెవరికైనా ఇచ్చేస్తాను" అని వీడి పెళ్ళాం బెదిరించిందట. దాంతో మనోడు భార్గవ" అనే పేరుతో శాంతపరచాడు వాళ్ళావిడని. (ఈ సంఘటన నిజంగా నిజం. ఇందులోని పాత్రలు పాత్రధారులూ అన్నీ నిజాలే...! ఏవీ కల్పితాలు కావు)

పురాణాల్లో రాక్షసుల పేర్లూ, చరిత్రలో దేశద్రోహుల పేర్లూ ఎవరూ పెట్టుకోరు. కానీ భగవంతుడి పేర్లలో భయపెడుతున్నది ఇదొక్కటేనేమో...!!!

జై బాలయ్య.

12, జులై 2012, గురువారం

నాకో కల వచ్చింది

ఆ మధ్య ఒకానొక రాత్రి.. విచిత్రమైన కల ఒకటొచ్చింది. 'ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి' అంటూ సినిమా డైలాగులు కొట్టటం ఆపేసి ముందు నే చెప్పేది వినండెహే. రాత్రి అంటే రాత్రి కూడా కాదు. నేను పడుకునేదే రాత్రి రెండింటికి కదా. కాబట్టి నాకొచ్చిన ఆ కల పొద్దున దాదాపు ఏడింటప్పుడు వచ్చిందేమో. చాలా బావుంది ఆ కల.

ఏదో ఊళ్ళో ఉన్నాను. ఆ ఊరు ఎలా ఉందంటే.. గుంటూరు జిల్లాలోని కారంపూడి, మాచెర్ల, పిడుగురాళ్ళ లాంటి ఊళ్లలోని వాతావరణం కనిపించింది. ఇప్పుడంటే ఆ ఊళ్లలో రోడ్లు వేశారు కానీ, నా చిన్నప్పుడు గుంటూరు జిల్లాలోని ఊళ్ల సందుల్లో బండలు పరచబడి ఉండేవి. వాటి మీది నుండే గుర్రబ్బళ్ళు వెళ్ళేవి. సరిగ్గా అలాంటి సందులోనుండే ఇప్పుడీ కలలో కూడా నేను నడుచుకుంటూ వెళ్తున్నానన్న మాట. కాబట్టి ఇప్పుడు నాతో పాటు నడుస్తున్నప్పుడు ఆ బండల మధ్య ఉన్న చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటాయేమో.. మీరు జాగ్రత్త. అలా
నడుస్తూ అక్కడున్న కొన్ని ఇరుకైన సందుల్లో నుండి నేను వెళ్తున్నానట. ఇళ్ళముందు చక్కటి ముగ్గులు; సమయం సాయంత్రం దాదాపు అయిదున్నర - ఆరు గంటల ప్రాంతం. కొంతమంది ముసలివాళ్ళు ఆరుబయట అరుగుల మీద కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. ఇంకో చోట ఒక పే....ద్ద వేప చెట్టు కింద అరుగు మీద కొంతమంది, అంటే దాదాపు పదిహేనిరవై మంది మగ  తాతయ్యలు  వింటూ ఉంటే.. పళ్ళూడిపోయిన ఒక సీనియర్ తాతయ్య పురాణ పఠనం చేస్తున్నాడు. ఆడ నాయనమ్మలు కూడా కొంతమంది ఉన్నారులే బోసి నవ్వులు నవ్వుతూ.  పొద్దున్నే పని మీద వెళ్ళిన వాళ్ళంతా గూటికి చేరే క్రమంలో చక్కటి జనపదాలు పాడుకుంటూ, మధ్య మధ్యలో ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు రువ్వుకుంటూ, రోజు మొత్తమ్మీద జరిగిన కొన్ని హాస్య సన్నివేశాలని తలచుకుని నవ్వుకుంటూ... కులాసాగా వచ్చేస్తున్నారు. ఇక పిల్లల హడావిడి చెప్పనే అక్కర్లేదు...కోతులే భయపడేట్టుగా అల్లరి చేసే మగ పోరగాళ్ళు, వాళ్ళతో సమానంగా గోల చేస్తున్న ఆడపిల్లలు. యువకులంటారా... కాలేజీ నుండి రెండు నిమిషాల్లో ఇంటికి చేరే దారిని వదిలి... కనీసం అర్ధగంటపాటు నడిస్తేనే కానీ ఇల్లు చేరని దారి వెంబడి వెళ్ళటం. మరి ఆ దారిలోనే కదా ఆ అమ్మాయి ఉండేది. నిజానికి ఆ అమ్మాయికి కావలసింది కూడా అదేలే. మధ్యలో ఒక కొంటెగాడు.. అక్కడ పురాణం వింటున్నవాళ్ళలో ఒక బామ్మ మీదికి వేప పళ్ళు విసిరి పరిగెత్తటం.

ఆ వేప చెట్టుకి ఎదురుగా ఒక పాత శివాలయం. లోపలినుండి ఏవో మంత్రాలు కూడా వినిపిస్తున్నాయిలే. ఆ గుడి ప్రాంగణంలో ఒక పెద్ద రావి చెట్టు.. దానిమీద పక్షులతో  పిచ్చాపాటీ  మాట్లాడుతూ లెక్కపెట్టలేనన్ని కోతులు. ఆ గుడి పక్కనే, శివ సాన్నిధ్యంలో దాక్కున్నట్టుగా ఒక సన్నటి సందు. అసలక్కడ ఒక సందు ఉందనే విషయం అక్కడిదాకా వెళ్లి చూస్తేనే కానీ కనిపెట్టలేం. సందు చూసుకుని ఆ దారిలోకి ప్రవేశించగానే ఎక్కడినుండి వస్తోందో తెలీని ఒక మంచి సువాసన... మల్లె, తులసి, మరువం కలిసిన పరిమళం అది. కొంచెం తరచి చూస్తే తెలిసింది... అక్కడ మరువం, మల్లె మొక్కల వరుస దారికి రెండువైపులా స్వాగతం పలుకుతున్నట్టుగా  కూర్చబడిందని. స్వాగతం మనకి కాదండోయ్.. ఆ సందులో ఉన్న ఒకానొక గుళ్ళో ఉండే పెద్ద దేవుడికి. ఆ పెద్ద దేవుడు వాహ్యాళికి వచ్చినప్పుడు ఈ మొక్కలు వాటి సువాసనతో ఆయన పల్లకీని మోస్తాయట. అసలు వాటికోసమే ఆయన వారానికొక రోజున అలా వాహ్యాళికి వస్తాడట. దాన్నే ఆ ఊరివాళ్ళు ఊరేగింపు అంటూ ఉంటారు.  విషయం ఏంటంటే.. ఆ దారిలో వెళ్తుంటే ఒక గుడి కనిపిస్తుంది. అది మనకి ఎడమవైపున కనిపించే చాలా చాలా పాత గుడి. దాన్ని దాటి ఓ పదిహేనిరవైయ్యడుగులు ముందుకెళ్తే అక్కడ కుడివైపున కొత్తగా కట్టిన ఒక గుడి ఉంటుంది. ఈ కొత్త గుళ్ళోకి, ఆ పాత గుడి నుండి విగ్రహాలని తరలించి ప్రతిష్ఠించారట. ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది అని నేను ఎవరినో అడిగితే.. 'మొన్న ఇరవయ్యవ తారీఖున అయింది' అని వాళ్ళు అంటారట. అది మరి ఏ ఇరవయ్యో తారీఖో నాకైతే తెలీదు కానీ... 'అరే, కొంచెంలో మంచి అవకాశం పోయిందే.. తెలిస్తే అప్పుడే వచ్చేవాణ్ని' అని అనుకుంటానట.

అయితే...అక్కడొక ప్రత్యేకత ఉంటుంది. అది నాకు ముందే తెలుసు; కానీ ఆ సమయంలో.. అంటే గుళ్ళో ఉన్న సమయంలో ఆ విషయాన్ని నేను ఎప్పటిలాగానే అతి సహజంగా మర్చిపోతానన్నమాట. కానీ.. ఆ విషయం ఓసారెప్పుడో నాకు మాటల మధ్యలో రసజ్ఞ గారు చెప్పినట్టుగా సరిగ్గా ఆ సమయానికి గుర్తొస్తుందన్నమాట.(నిజానికి నేను, రసజ్ఞ గారు మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడూ ఈ విషయం మా మధ్య రాలేదు. కానీ అదేంటో, ఆమెనే ఈ విషయం నాకు చెప్పినట్టుగా ఆ కలలో అనిపిస్తూ ఉంటుంది). ఆ విషయం ఏంటంటే.. "అక్కడ స్వామి వారి పాదాలు చూశారా మీరు" అని నన్ను ఆ సమయంలో అడిగినట్టుగా అనిపించింది. 'అరే అవును కదా.. ఈ గుళ్ళోనే కదా ఆయన పాదాల గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు' అని నాకు అప్పుడు అనిపించింది. దాంతో వెంటనే గర్భగుడి దగ్గరికెళ్ళిపోయి, అలా ఆయన పాదాల్ని తీక్షణంగా గమనించేసరికి, "ఎంత విచిత్రం" అనిపించింది నాకు. ఎందుకంటే, ఆయన కుడికాలు.. మునివేళ్ళ మీద నిలబడ్డట్టుగా ఉంటుంది; ఎడమకాలు పాదం మాత్రం...ముందుకు అడుగు వేస్తున్నట్టుగా ఒక నాలుగైదు అంగుళాలు ముందుకి జరిపి.. పాదాన్ని ఎడమ వైపుకి వంచినట్టుగా... అంటే పాదం కుడివైపు నుండి ఎడమవైపుకి వంచి.. నేలకి ఆనించినట్టుగా ఉంటుంది. లోక కళ్యాణానికి పూనుకున్నవాడై, దుష్ట సంహారం చేయగోరి ఉద్యుక్తుడవుతూ ముందడుగు వేస్తున్నారేమో స్వామి వారు అన్నట్టుగా ఉంది అక్కడి దృశ్యం. చూడగానే చాలా స్పష్టంగా కనిపించింది స్వామి వారి విగ్రహం. ఇప్పటికీ నాకు కళ్ళలో కదులుతోంది ఆ కలలోని దృశ్యం. అంత స్పష్టంగా కనిపించింది.

అయితే... ఈ కొత్తగా కట్టిన గుళ్ళో చాలామటుకు స్థంభాలని పాత గుడిలో ఉన్నట్టుగానే నిర్మించారు. గుళ్ళోకి ప్రవేశించగానే కుడి వైపున రెండు పెద్ద పెద్ద గదులుంటాయట. ఒక్కోదాంట్లో ఒక్కొక్కళ్ళు చొప్పున పెద్ద దేవుడి కుమారులు ఉంటారట. ఎడమవైపున కూడా అలానే మళ్ళీ రెండు గదులుంటాయట. అందులో కూడా ఒక్కొక్కళ్ళు చొప్పున ఎవరో దేవుళ్ళు. ఆడ దేవుళ్ళో.. మగ దేవుళ్ళో గుర్తు లేదు కానీ... దేవుళ్ళైతే ఉన్నారు (బహుశా ఆడదేవుళ్ళే అయ్యుంటారు... మన దేవుళ్లలో చాలా మందికి ఇద్దరేసి చొప్పున పెళ్లాలుండటం సహజమేగా..అందుకనే ఇద్దరమ్మవార్లేమో అని నా అనుమానం). అయితే... మామూలుగా మనం చూస్తాం కదా గుడిలో పక్కన ఉండే గదులు అతి చిన్నగా ఉండి... వాటిలో విగ్రహాలు కూడా చిన్నగా ఉంటాయని. కానీ ఇక్కడ మాత్రం ఒక్కొక్క గదిలో కనీసం ముప్ఫైమంది కూర్చునేంత స్థలం ఉంటుందట. అంత పెద్ద పెద్ద గదులతో విశాలమైన గుడి. అందులో ఒక్కొక్కటీ ఏడు నుండి ఫది అడుగుల విగ్రహాలు. పెద్ద దేవుడికి మాత్రం చాలా అందంగా అలంకరణ చేసి ఉంటుందట. తులసి మాలలు, మరువం సువాసనలు, మల్లె గుభాళింపులు. మందార పూలు స్వామివారికి పాదసేవ చేసుకుంటూ ఉన్నాయి. అవకాశం దొరికింది కదా అని సంపెంగ పూలు ఆయన నెత్తినెక్కి కూర్చున్నాయి. 'మీరెంత ఆరాటపడ్డా, ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోతారు. కానీ మేము మాత్రమే ఎప్పటికీ ఇక్కడే స్వామి వారి చెంతనే ఉండిపోతాం' అనుకుంటూ ఒకలాంటి ధీమాతో ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్ళిపోయాయి అక్కడి దీపారాధనలు.

గుడి ఖాళీగానే ఉంటుంది. కానీ ఇంకా ఏవో శిల్పాల చెక్కుళ్ళు అవుతూ ఉంటాయి దాని నిర్మాణానికి సంబంధించి. స్వామివారి సేవ నిమిత్తం దేవలోకపు శిల్పులు మనుష్యుల అవతారం ఎత్తి.. అదిగో..అక్కడ అంత ఎత్తున వేళ్ళాడుతూ అహో రాత్రులు కష్టపడి, వాళ్ళలోని జీవాన్ని రాళ్ళలోకి పోస్తూ అత్యద్భుత శిల్పాలుగా మలిచే కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. అలా ఒక్కొక్క శిల్పం జీవకళతో ఉట్టిపడుతూ.. ఒక దశలో.. వాటిని తీర్చిదిద్దుతున్న శిల్పులు కూడా వాటి మధ్యలో 'కదిలే శిల్పాలేనేమో' అనిపించింది. అంతలా మనుష్యులకీ శిల్పాలకీ బేధం లేకుండా చేసేస్తున్నారీ కళాకారులు.

ఇంకోటి ఏంటంటే ఆ గుళ్ళో అలా ఆ దేవుణ్ణి చూస్తుంటే కొంచెం సేపయ్యాక నాకొక ఫోన్ కాల్ వస్తుందట. ఎవరా అని ఆ కాల్ తీసుకుంటే, అందులో ప్రతిరోజు పొద్దున్నే.. ఆకాశవాణిలో "ఇతీ వార్తః షూయంతాం.. ప్రవాచికః పతంజలి కుమారో భాటియా.." అంటూ 'ఆంగ్ల వార్తలు' వస్తూ ఉంటాయట. అదేంటబ్బా... నాకు ఫోన్ చేసి మరీ వార్తలు వినిపిస్తున్నారు ఎవరో అని అనుకుంటూ ఉంటాను; సరిగ్గా ఆ సమయంలో వెనకనుండి ఎవరో అన్నారు అది 'విరూపాక్ష దేవాలయం' అని. కాదని నేనంటాను. 'సరిగ్గా చూడు నీకే తెలుస్తుంది' అని వాళ్ళు అనగానే, 'మళ్ళీ వెనక్కి వెళ్లి చూద్దాం ఓసారి ఆయన పాదాలు' అనుకుంటూ వెనక్కి తిరిగానో లేదో... మెడకాయ పట్టేసింది...!!! ఇంతకీ ఆ దేవుడు ఎవరో అర్ధం కాలేదు.

ఆ తరవాత మళ్ళీ నిద్ర పట్టలేదు.

ఇంతకీ ఇప్పుడు నేను చూపించిన ఈ దేవాలయం ఎక్కడుందో.. అక్కడి దేవుడెవరో... అది ఏ ఊరో... ఎవరైనా చెప్తారేమో అని చూస్తున్నాను... ఇంతవరకూ ఎవరూ తారసపడలేదు.

26, మే 2012, శనివారం

శోగ్గాడి పెళ్లి

వీడికి పాపం లేక లేక పెళ్లి కుదిరింది. కుదిరింది కదా.. తిక్క కూడా కుదురుతుందిలే అని అనుకున్నారంతా. కానీ సహజంగానే అది ఎక్కువై కూర్చుంది.. కాదు కాదు.. నిలబడి నాట్యాలు కూడా చేసింది, వీడి చేత చేయించింది. రకరకాల భంగిమల్లో వచ్చేవాడు పాపం ఆఫీసుకి. అలా వస్తున్న రోజుల్లో ధగధగ మెరుస్తున్న కరెంటు స్థంభం లాగా ఉండేవాడు. పెళ్లి కుదిరిందో లేదో - పల్లెటూళ్ళో మారుమూల వెలగాలా వద్దా అనే సందేహం నుండి బయటపడలేక  కొట్టుకుంటూ బితుకు బితుకుమంటున్న బల్బ్ లాగా తయారైంది పాపం వీడి పరిస్థితి. అవును మరి.. దానిక్కారణాలున్నాయిలే. అతి సహజంగానే... వీడి ఈ పరిస్థితికి కారణం ఆ అమ్మాయే అని అనిపించే అవకాశం ఉంది. కానీ అది తప్పు. పాపం ఆ అమ్మాయిదేం తప్పు లేదు. అంతా వీడి స్వయంకృతాపరాధం. వెధవ.. కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉన్న ప్రాణానికి కొని తెచ్చుకున్నాడు వేరే టీంలో చేరిపోయి. ఇక్కడున్నప్పుడు అసలు పని చెయ్యాలో వద్దో ఓ నాలుగు రోజుల పాటు ఆలోచించుకుని ప్రశాంతంగా..నెమ్మదిగా..నింపాదిగా మొదలుపెట్టి పని పూర్తిచేసే పరిస్థితి వాడిది. ఇప్పుడు కూడా వాడు అదే ఆలోచిస్తున్నాడు. కాకపోతే పని చెయ్యాలో వద్దో అని కాదు. అసలు పని చెయ్యటం ఎప్పుడు ఆగితే అప్పుడు వెళ్ళి ఓ నాలుగు రోజులకి సరిపడా ఊపిరి పీల్చుకుందాం అనే విషయం గురించి. నిజం చెప్పాలంటే కనీసం ఇది ఆలోచించటానిక్కూడా వాడికి సమయం లేదు. ఆ లెవెల్లో చావగొట్టి చెవులు మూస్తున్నారు వీణ్ణి కొత్త టీంలో. సరిగ్గా అక్కడికెళ్ళిన అతి కొద్దిరోజుల్లోనే  వీడికి తిక్క కుదిరింది...సారీ.. పెళ్ళి మాత్రమే.
ఇప్పుడు పెళ్ళి కుదిరిందని ఆనందించాలో.. లేక పెళ్ళి ఇప్పుడు కుదిరిందని బాధపడాలో తెలీక అలా రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు పాపం.

పెళ్లి కుదరకముందు రకరకాల అవతారాల్లో వచ్చేవాడు. అన్నయ్యల చొక్కాలు తమ్ముళ్ళకీ, అక్కల డ్రెస్ లు చెల్లెళ్ళకీ వచ్చినట్టు.. చిన్నప్పుడు వీడి చెల్లెలు స్కూల్ కి వెళ్తూ పెట్టుకున్న హెయిర్ బాండ్స్, పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళేప్పుడు వీడి మొహాన కొట్టేసి వెళ్లినట్టుంది.. ఆ విధంగా సంక్రమించిన ఆస్థిని ఇప్పుడు వీడు వాడుకుంటున్నాడు. అలా వాటిని పెట్టుకుని వాడు ఆఫీసులోకి వస్తుంటే, వాడి అందం చూసి అమ్మాయిలంతా వాడి వెంటపడేవాళ్ళు (తిట్టటానికి). అలాంటిది ఇప్పుడు.. ఎందుకీ జీవితం అనిపించేస్తోందట వాడికి. కాబోయే పెళ్ళాంతో పట్టుమని పది నిమిషాలు ఫోన్ లో మాట్లాడుకోనివ్వకుండా, రుబ్బురోలుకీ వీడి బతుక్కీ తేడా లేదు అన్నట్టుగా తయారుచేశారు వీణ్ణి. అదేదో సినిమాలో లాగా.. వీడి బతుకు జయమాలిని తాగిన మజ్జిగ్లాసు లాగా తయారైంది. దాని ప్రభావమో ఏంటో.. అంతటి శోగ్గాడు కూడా ఈ మధ్య అ-శోగ్గాడైపోయి వస్తున్నాడు ఆఫీసుకి.

ఆడపిల్లలకి ఉంటే బావుంటుంది అనుకునే పెద్దపెద్ద కళ్ళు వీడికున్నాయి. చుట్టుపక్కల పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళ తల్లులు వాళ్ళని బూచాడికి పట్టిస్తానని చెప్తూ వీణ్ణి చూపిస్తుంటే కిక్కురుమనకుండా
పెట్టింది తిని స్కూల్ కి వెళ్ళొస్తున్నారట ఈ మధ్య. దాంతో ఆ పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతున్నారట. ఆ రకంగా వీడు సమాజానికి గొప్ప సేవ చేస్తూ వీడికి తెలీకుండానే ససేకుడు (సమాజ సేవకుడు) అయిపోయాడు.
సరే... పెళ్లి దగ్గరికొస్తోంది కదా... ఓ పదిహేనిరవై రోజులపాటు సెలవు అడుగుదామని మేనేజర్ దగ్గరికెళ్ళాడు. వాడి గోడు విని మేనేజర్ ఒక్క చూపు చూశాడు. ఆ చూపులో "ఒక పక్కన క్వార్టర్ ఎండింగ్ హడావిడి అవుతుంటే నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా.. ఆయ్.. హన్నా.." అనే అర్ధం..! సీన్ కట్ చేస్తే.. మనవాడు డెస్క్ దగ్గర ఆడిటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. రెండు రోజుల తరవాత మళ్ళీ ఓ సారి బేరం చేద్దాం అని మేనేజర్ దగ్గరికెళ్ళి... సాఆఆర్ అని సాగేసరికి.. 'ఆదివారం కదయ్యా పెళ్లి.. అయితే శనివారం ఒక్కరోజు సెలవు తీసుకో చాలు' అన్నాడట. అది విని 'శనివారం సెలవే కదా సార్' అనేసరికి, 'అవును కదా.. ఈ లెక్కన నీకు అసలు సెలవుతో పనే లేదు. ఇంకేం.. పెళ్ళయ్యాక మామూలుగా సోమవారం ఆఫీసుకి వచ్చేయి' అని చెప్పగానే వీడికి గొంతులో పచ్చి కొబ్బరిబొండాం పడినట్టైంది. సరే, చివరికి ఎలాగో వీడి అదృష్టం పుచ్చి, లాంగ్ లీవ్ మంజూరు అయింది.. పెళ్లి ముందు శుక్రవారం, పెళ్లి తరవాత సోమవారం. దాంతో మనోడు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంతో గంతులేసుకుంటూ వెళ్లి.. మళ్ళీ ఆడిట్ లో తల-మునకలేశాడు.

వేదిక.. పెళ్లి మండటం!!!
తారాగణం... సదరు సోగ్గాడు, పెళ్లి కూతురు, చుట్టుపక్కల జనాలు... వాళ్ళ మధ్యలో ధగధగా మెరుస్తూ వాడి మేనేజర్.
సమయం.. ముహూర్త సమయమే.
సందేహం... పెళ్లికొడుకు మనసులో.
విషయం ఏంటంటే... వీడు చేసేది ఆడిట్ కదా, అది నరనరానా జీర్ణించుకుపోయిందేమో... అసంకల్పితంగానే "ఎవరయ్యా ఈ పని చేసిందీ..." అంటూ ఒక్క అరుపు అరిచేశాడు.
"ఏవైంది అల్లుడు గారూ..." - వాళ్ళ మావగారు..!
"ఏవైందిరా..." - వాళ్ళ నాన్న గారు..!
"ఏవయిందండీ .." - పెళ్లి కూతురు..!
"ఏవైంది బా...బూ.." - వాళ్ళ అత్తగారు..!
(నింపాదిగా - మనసులో) "ఏమయిందబ్బా.." - వాడి మేనేజర్.

ఇంతమంది అరిచింది వాడికి వినిపించలేదు కానీ.. మనసులో ఆరా తీస్తున్న మేనేజర్ గారి మాట మాత్రం మైక్ లో చెప్పినంత స్పష్టంగా వినిపించింది వాడికి. దాంతో వెంటనే ఆయన వైపు చూస్తూ ఖోపంగా... 'చూడండి సార్, ఎవరో ఈ కాంట్రాక్టుని ఆడిట్ చెయ్యకుండానే సబ్మిట్ చేసారు. అసలు దీన్ని ప్రాసెస్ చేసింది ఎవరు, వాళ్ళ పేరు కూడా రాయలేదిక్కడ. మొన్నటికి మొన్న.. మన టీంలో గణేష్ వచ్చి ఆడిట్ చెయ్యమంటూ పేపర్స్ సబ్మిట్ చేస్తే, అందులో బండబూతులున్నాయి. అలాంటిది... జీవితాంతం ప్రభావితం చేసే విషయం.. దీన్ని ఆడిట్ చెయ్యకుండా ఎలా ముందుకెళ్ళేది. ఇలాగైతే ఎలా? నేనొప్పుకోనంతే" అంటూ బెట్టు చేసేసరికి వాళ్ళ మావగారి మొహం ఒక్కసారిగా ఆడిట్ చెయ్యని కాంట్రాక్టు కాపీ లాగా తయారైంది. 'ఇప్పుడా ఆడిట్ గోల అవసరమా.. ప్రశాంతంగా తాళి కట్టరా' అని వాళ్ళ నాన్నగారు చెప్పినా వినట్లేదు. పరిస్థితి వేడెక్కుతోంది. వాళ్ళ మావగారికి ముచ్చెమటలు. ఫైనాన్సు అల్లుడు అంటే ఇంత ఖచ్చితంగా ఉంటాడా అని ఆయనకి తెలిసొచ్చింది ఆ రోజు. పెళ్లికూతురు తరపు వాళ్లకి ఏం చెయ్యాలో తెలీక.. కాళ్ళలో షాక్ లు మొదలయ్యాయి (వీడికి కాబోయేది కరెంట్ పెళ్ళాంలే. ఆ అమ్మాయి ఎలక్ట్రిసిటి డిపార్టుమెంటులో ఇంజనీర్..) ఈలోగా పెళ్లికొడుకు తల్లి.. చిన్నప్పుడు హోంవర్క్ చెయ్యనప్పుడు వాణ్నిచూసిన ఒక హింసాత్మకమైన చూపు చూశారు. అయినా వీడు లొంగలేదు. దాంతో వీడు పెద్దోడైపోయాడని అందరికీ అర్ధమైంది. ఈలోగా నేను కలగజేసుకుని 'ఒరేయ్.. ఆ ఆడిట్ ఏదో నేను చేస్తాలే కానీ, నువ్వు కానీరా' అని చెప్పా. లాభం లేకపోయింది. వీడు ఎర్రబడ్డ ఇన్వాయిస్ మొహంతో ఊగిపోతున్నాడు (కళ్ళు పెద్దవి చేసుకుని..).

ఇంతలో ఆపద్బాంధవుడు.. అదే.. మా మేనేజర్ గొంతెత్తారు. ఆయనకి తెలుసు.. వీడిని ఎలా చల్లబరచాలో. "ప్రస్తుతానికి నేను interim approval ఇస్తున్నాను.. U can proceed" అని SMS పంపించారు. మెయిల్ లో అప్రూవల్ పంపించాను అని చెప్తే వీడు ఉన్నఫళాన పరిగెత్తుకుంటూ వెళ్లి మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటాడేమో అని కూడా అనిపించింది వీడి వాలకం చూస్తుంటే. ఆ SMS చూసుకుని.. అప్పుడు వాడు చల్లబడి.. "తాళి ఎక్కడా.." అని అరిచేసరికి "మింగేస్తా" అన్నట్టుగా బ్రహ్మగారికి వినిపించేసరికి వాడి చేతికి తాళి అందించారు ఆయన. ఈ అదరగండంగాడి వాలకం చూసి సదరు బ్రహ్మగారు బహుశా పెళ్ళిళ్ళు చేయించటం మానేసి ఉంటారని నా అనుమానం. ఒకవేళ చేయిస్తున్నా, ఫైనాన్సు డిపార్టుమెంటులో చేసే పెళ్లి కొడుకుల గురించి బాగా ఆరా తీసి, అందులోనూ అశోక్ అనే పేరుగల వాళ్ళెవరూ లేరని నిర్ధారించుకుని కానీ వెళ్లరేమో పెళ్లి సంభావన తీసుకోటానికి.
పెళ్ళయ్యాక.. వాడి కొలీగ్స్ ని.. అంటే మమ్మల్ని కలవటానికొచ్చి మాట్లాడుతూ, అప్పుడే అటుగా వెళ్తున్న వాడి మరదల్ని పిలిచి ఉన్నట్టుండి నా వైపు తిరిగి.. "అదిరా విషయం" అన్నాడు. పెళ్లి చేసుకున్నందుకు ఒక మరదలు దొరికిందని సంతోషంగా చెప్తున్నాడో.. లేక అందరి ముందూ, ఒకమ్మాయితో మాట్లాడే ధైర్యం వచ్చిందని ఈ తింగరోడు నిరూపించుకుంటున్నాడో మాకు అర్ధం కాలేదు.
భోజనాల దగ్గర మరో తంతు. వంకాయ కూరలో ఉప్పెక్కువైంది.. అసలు ఏ రూల్ ప్రకారం వేశారు ఇంత ఉప్పు? ఎవరయ్యా వీళ్ళకి అనుమతి ఇచ్చింది? టాక్స్ లో తేడా వచ్చేస్తుంది ఇలా అయితే.. పిలవండి వాళ్ళ మేనేజర్ ని.. అప్ప్రూవల్ మెయిల్ ఉందా ఇంత ఉప్పు వెయ్యటానికి... ఠా..ఠూ...ఠ్... అంటూ చిందులేస్తున్నాడు. ఈలోగా వెనక నుండి వీడి మేనేజర్ గారొచ్చి, మొహం మీద చిరుమందహాసంతో వాడి భుజం మీద చేతులేసేసరికి.. వీడు కంట్రోల్ అయ్యాడు. లేదంటే మాడిపోయిన వంకాయ కూర అయిపోయేది పరిస్థితి వీడి ధాటికి.

కాంట్రాక్టు ఆడిట్ అయ్యి ఉండకపోతే.. మేనేజర్ అప్ప్రూవల్ లేనిదే ముందుకు కదలకూడదనే కఠిన నిబంధన వీడిచేత ఎంత పని చేయించిందో ఆ రోజు చూశాం. ఆ మరుసటి రోజు, మేనేజర్... "పెళ్లి కాబోతున్నవాళ్ళెవరైనా సరే... పెళ్ళికి ముందు పదిహేను రోజులపాటు ఆడిట్ లో ఉండకూడదు" అని చెప్తూ, నిబంధనలని సడలించారు.

సోగ్గాడు అ-శోగ్గాడు అవ్వటం...వాడి పెళ్లి ఆఫీసులో నిబంధనలనే ప్రభావితం చెయ్యటం చూశాక...పాపం ఆ కరెంట్ పెళ్ళాం ఈ ఫైనాన్సు మొగుణ్ణి ఎలా భరిస్తోందో అనిపిస్తోంది. వీడెళ్లి ట్రాన్స్ఫార్మర్లకి ఆడిట్ చేస్తున్నాడో.. లేక ఆ అమ్మాయి వచ్చి వీడి కాంట్రాక్టు కాపీలకి ఫ్యూస్ లు అంటిస్తోందో... ఏంటో.. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారో.. అంత అయోమయంగా ఉందిలే.

పెళ్ళైన సంతోషంలో వీడి బుర్ర పని చెయ్యటం మానేసిందని అందరూ అనుకున్నారు.
పెళ్ళైన వత్తిడిలో వీడికి లేని బుర్ర పూర్తిగా పాడైపోయింది అని నేననుకున్నాను.

8, జనవరి 2012, ఆదివారం

ఒక రోజు


గత కొన్ని రోజులుగా అడగాలనుకుంటూ, ధైర్యం చాలక.. ఇక లాభం లేదని "ఒక రోజు" నేనే అడిగేశాను.. నువ్వు నాకేం ఇచ్చావు అని. ఏం మాట్లాడలేదు. మళ్ళీ రెట్టించి అడిగాను."ఇన్నాళ్ళుగా నాతో ఉన్నావు.. నేనే ఆత్మీయుణ్ణి అన్నావు.. నన్ను ప్రేమిస్తున్నానన్నావ్. నేను లేకపోతే నువ్వు లేనట్టే అని కూడా అన్నావు.. మరి నువ్వు నాకేం ఇచ్చావు" అని. అప్పుడు ఆ రోజు నా వైపు చిరుమందహాసంతో చూసింది. నేను నీకేం ఇచ్చానో, నీకోసం ఏం చేశానో చెప్తాను కానీ... నిన్ను ఇంతగా ప్రేమిస్తున్న నాకు, నిన్నే వెన్నంటి ఉంటున్న నాకు నువ్వేం చేశావో చెప్పు మరి అని అడిగింది.

అంటే నేను ఏదో ఒకటి ఇస్తేనే నువ్వు ఇస్తావా. ఇంతేనా ప్రేమంటే.. ఇదేనా అభిమానం అంటే. ఏదో ఒకటి ఇచ్చిపుచ్చుకుంటేనే కానీ నా దానివి కావా నువ్వు అని అడిగాను. అట్లాగని నేను అనలేదు కదా. నా వాడివైనప్పుడు నువ్వు నాకు ఏదో ఒకటి ఇస్తావనే ఆశ ఉంటుందిగా. ఆ ఆశతో, చనువుతో అడిగాను అంతే అని చెప్పింది. 'నీకు నచ్చుతుందని ప్రతిరోజు పొద్దున్నే లేచాక మనస్ఫూర్తిగా సంధ్యావందనం చేస్తున్నాను కదా' అని చెప్పాను. 'అది నువ్వు నీ  క్రమశిక్షణ కోసం చేసుకున్నది, అంతే కాని నా కోసం కాదుగా' అన్నది. 

'కార్యాలయానికి వెళ్ళి నేను నిర్వర్తించాల్సిన బాధ్యతని చిత్తశుద్ధితో నిర్వర్తించానుగా' అని చెప్పాను. 'అది నీ జీవితం కోసం చేసుకున్నది, నువ్వు అది చెయ్యకపోయినా నాకొచ్చే నష్టం ఏంటి' అని అదిగింది. 'నా జీవితం అంటే అందులో నువ్వు లేవా' అని అడిగాను. 'ఉన్నానేమో.. కానీ నన్ను పొషించటానికి నువ్వు ఏదో ఒకటి చెయ్యాల్సిందే.. తప్పదు కాబట్టి చేస్తావు. కానీ నాకోసం మాత్రమే అన్నట్టుగా ఏం చేశావు' అని మళ్ళీ అడిగింది.

'నలుగురికీ సహాయపడాలని చెప్తూ ఉంటావుగా.. అందుకే నాకు చేతనైనంతలో ఈ రోజు కొంతమందికి సహాయపడ్డాను' అని చెప్పాను. 'అది నీ మానసిక తృప్తి కోసం చేసుకున్నావు. నాకోసం కాదుగా' అని అనేసింది. 'అదెలా.. నువ్వే కనుక రాకపోతే ఈ రోజు నేను వాళ్లకి సహాయం చెయ్యగలిగే వాణ్ణే కాదు. నువ్వు నా దగ్గరికి వచ్చినందుకు గాను సంతోషంతో నేనీ పని చేశాను. అలా చెయ్యటం వల్ల.. సంతోషించి నువ్వు ఎప్పటికీ నా దగ్గరికి వస్తూనే ఉంటావని, నా దగ్గరే ఉండిపోతావని నా ఆశ' అని చెప్పాను. ఈ సమాధానంతో తృప్తి చెంది ఆ రోజు చిరునవ్వుతో చూసింది నా వైపు.
అయినా మళ్ళీ అడిగింది.. 'నేను వచ్చినందుకే నువ్వు వాళ్లకి సహాయం చేసినా కూడా అది నీకు ఆనందం కలిగించేదే కానీ నాకోసం  కాదుగా' అనే సరికి ఒకింత కలుక్కుమన్నది మనసులో. 'అదెలాగబ్బా.. నీకు నేను ప్రత్యక్షంగా ఏం చెయ్యలేదేమో. కానీ నువ్వే కనుక రాకపోతే నేనీ పని చెయ్యగలిగి ఉండేవాణ్ని కాదుగా. అందుకే నీ రాక వల్ల సంతోషంతో నేనీ పని చేశాను' అని చెప్పాను. వీడికి చేతనైనంతలో ఏదో ఒకటి చేశాడులే అనుకుందేమో, ఆ రోజు ఆ విషయంలో మాత్రం నన్ను వదిలేసింది.

'ఇవాళ పొద్దుణ్ణుండి నా చుట్టూ ఉన్నవాళ్ళకి సంతోషం కలిగించేలా ప్రవర్తించాను' అని చెప్పాను. 'అది నువ్వు నీ తోటి వాళ్ళతో సత్సంబంధాలు ఉండటానికి చేసిన పని. అది చెయ్యకపోతే నీకే నష్టం... నాకేం' అని వెక్కిరించింది. అలా అనేసరికి నేనేమీ మాట్లాడలేకపోయాను.

'నువ్వు లేనిదే భోజనం కూడా నాకు చెయ్యాలనిపించేది కాదు... అందుకే భోంచేసేప్పుడు కూడా నిన్నే తలచుకున్నాను' అని చెప్పాను. 'నన్ను తలచుకున్నందుకు నాకు సంతోషమే. కానీ అసలంటూ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం కూడా. అందుకే భోజన సమయంలో నన్ను తలచుకోకపోయినా నేను వస్తూనే ఉంటాను కదా. మరి అలాంటప్పుడు నువ్వు నాకు చేసిందేముంది ఇందులో' అని అడిగింది. నాకు ఒకింత చిన్నతనం అనిపించింది. కొంత కోపం కూడా వచ్చింది.

'నా కుటుంబ సభ్యులకి ఈ రోజు ఏం కావాలో అన్నీ అందేలా ఏర్పాట్లు చేశాను. దాంతో వాళ్ళంతా సంతోషంగా తృప్తిగా ఉన్నారు' అని చెప్పాను (ఇది కొంతవరకు అబద్ధమేమో కూడా). 'అది నీ కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ ఆనందం కోసం, సౌఖ్యం కోసం నువ్వు చేసుకున్న ఏర్పాట్లు. తద్వారా నువ్వు సంతోషంగా ఉంటావు. అలాంటప్పుడు అందులో నాకు చేసిన ఉపకారం ఏముందని' అంటూ వెటకారంగా చూసింది నన్ను. దాంతో చిర్రెత్తుకొచ్చింది నాకు. 'అంటే నా వాళ్ళు నీ వాళ్ళు కానట్టేనా' అని అడిగాను. 'నీ వాళ్ళు నా వాళ్ళు అయితేనే కదా నేనీ రోజున నీతో ఉంటున్నది.. మరి అలాంటప్పుడు వాళ్ళు నా వాళ్ళు కాకుండా ఎలా ఉంటారు. వాళ్ళు నా వాళ్ళు అయినప్పటికీ, నీ నుండి నాకంటూ ప్రత్యేకంగా ఏదో ఒకటి నేను ఆశించటం తప్పా' అని అడిగింది.

'నువ్వెప్పుడూ నాకు చెప్పే ఆ 'సమాజ శ్రేయస్సు' కోసం ఏం చేస్తే బావుంటుందో నలుగురితోనూ వివరంగా చర్చించాను. సలహాలివ్వటమే కాదు.. నాకు చేతనైనంతలో ఆచరించి కూడా చూపించాను. అది చాలదా' అని కొంచెం గట్టిగానే అడిగాను. 'ఇదిగో.. ఇలా కోప్పడితే నేను మళ్ళీ రాను.. వచ్చినా నీతో మాట్లాడను' అంటూ లేచి నిలబడేసరికి ఒక్కసారిగా భయం వేసింది. ఎందుకంటే .. తనను విడిచిపెట్టి నేను ఉండలేను. తను నా ప్రాణం. వెంటనే నన్ను నేను తమాయించుకుంటూ "కోపం ఏం లేదులే, మాములుగానే అడిగాను. ఇది చాలదా చెప్పు.. ఇంకా నేనేం చేస్తే నీకు నచ్చుతుంది అని అడిగాను. "ఏం చేస్తే నచ్చుతుంది అంటే... అది నీకే తెలియాలి. అన్నీ నేను అడిగాక ఇస్తే నీ గొప్పతనం ఏముంది. నానుండి నీకేం కావాలని అనుకుంటున్నావు, నీకు ఏది దక్కితే ఆనందంగా ఉంటావు.. దేనివల్ల జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండగలనని నువ్వనుకుంటున్నావు. అది నిర్ణయించుకో ముందు. అప్పుడు నాక్కావలసింది ఏంటో కూడా నీకే తెలిసిపోతుంది అని చెప్పింది. 

నేను కొంచెంసేపు ఆలోచించాను. సమాధానం తెలీక కాదు.. ఎలా చెప్పాలో తెలీక ఆలోచించాల్సొచ్చింది. చివరికి నాకు తోచిన పధ్ధతిలో చెప్పేశాను.  
'..నా జీవితంలో కేవలం సుఖాలే కావాలని నేను కోరుకోవట్లేదు. అలాగని పని కట్టుకుని కష్టాలని ఆహ్వానించాలన్న ఉద్దేశ్యమూ లేదు. ఏది వస్తే దాన్నిస్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను. ఒకరకంగా చెప్పాలంటే.. జీవితం అన్ని రుచులతో పాటు... శృతి బద్ధంగా.. రాగయుక్తంగా ఉండాలని... తద్వారా ఇక్కడ నీతో ఉన్నన్నాళ్ళూ.. నా మనసుకి నచ్చిన వాళ్ళతో కూడా ఉంటూ, వాళ్ళు కూడా నా వల్ల సంతోషంగా  ఉంటూ.. హాయిగా మనశ్శాంతితో గడిపెయ్యాలనుంది. పైన చెప్పినవి ఏం చేసినా, ఇది మాత్రం దక్కేలా కనిపించట్లేదు' అని చెప్పాను. 'అలాంటప్పుడు నువ్వు చెయ్యాల్సింది చిత్తసుద్ధితో చేస్తూ.. కావాలనుకున్న దాన్ని పొందటం కోసం కార్యదక్షుడవై ముందుకి వెళ్తూ.. అదే సమయంలో అందరితోను సఖ్యతతో వ్యవహరిస్తే.. నీకు కావలసింది తప్పకుండా దొరుకుతుంది కదా' అనేసింది. 'అది నాక్కూడా తెలుసు.. ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు'  అని కొంచెం బుంగమూతి  పెట్టుకుని, వెటకారంగానే అడిగాను. 'అంటే నీకు విషయం తెలుసు కానీ, చెయ్యాల్సింది చెయ్యవన్నమాట నువ్వు' అనేసింది. ఓహో.. అంటే నాకు విషయం తెలుసు.. కానీ చెయ్యట్లేదు. తెలిసిన విషయాన్ని ఆచరణలో పెడితే సరిపోతుంది కదా అనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి, ఎప్పటికంటే కూడా ఆ రోజు నా వైపు అత్యంత అందంగా...అనురాగంతో... వర్ణించటానికి కూడా కష్టం అనిపించేట్టుగా అవ్యక్తానుభూతి కలిగేట్టుగా.. స్వచ్చమైన, నిర్మలమైన నవ్వుతో నా వైపు చల్లని చూపులని ప్రసరిస్తూ నా తల నిమురుతూ అలా ఉండిపోయింది. ఆ చల్లదనంలో ఏదో ప్రపంచంలోకి వెళ్లిపోయానేమో.. ఉన్నట్టుండి ఏదో శబ్దానికి ఉలిక్కిపడ్డాను.

ఆ ఉలికిపాటుకి కళ్ళు తెరిచి చూసేసరికి... ఎదురుగా కిటికీలో నుండి కనిపిస్తున్న వేపచెట్టు కొమ్మల్లోంచి ఎంతో అందమైన నిర్మలమైన స్వచ్చమైన అనురాగంతో కూడిన నవ్వుతో.. నన్ను రమ్మని పిలుస్తూ.. 'మరో రోజు' నాకోసం ఎదురు చూపులు.

నా వెన్నంటే ఉంటూ, నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించే "ఒక రోజు" నా కోసం చీకట్లోనే వచ్చేసి వెలుగులు విరజిమ్ముతూ ఎదురు చూస్తుంటే..  నేనేమో ఇంకా ఇలాగే ఉన్నానే మందబుద్ధిని అనుకుని గబగబా తయారైపోయాను.. కార్యదక్షతతో ముందడుగేస్తూ.

1, జనవరి 2012, ఆదివారం

అమ్మమ్మ తీర్మానం

అమ్మమ్మ...
తెలుగు, సంస్కృతం.. ఉభయభాషా ప్రవీణురాలు. సంగీతం ఇరగదీస్తుంది.. వాయులీనం వాయించేస్తుంది..!
ఇంగ్లీష్ అంతగా రాకపోయినా రోజుకి ఒకసారైనా చాలానే పదాలు ఉపయోగిస్తూ మాకు డెత్ వారెంట్స్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. అమ్మమ్మ జపాలు, పూజల గురించి చెప్పుకోవాలంటే ఆవిడ చదివిన అష్టాదశ పురాణాల తరవాత మనం ఒక నవదశ పురాణం చెప్పుకోవాలి. ఇదిగో ఈ చిన్న ఉదాహరణ.
 
ఆమె కడిగీ కడిగీ పాదాలు పాసిపోయాయి అంటే నమ్ముతారా? దాంతో డాక్టర్ గారు చాలా సీరియస్ గా 'నేనిచ్చిన మందులు కొంతవరకే పనిచేస్తాయి. సమస్య పూర్తిగా నయమవ్వాలంటే మీరలా నీళ్ళలో నానటం తిరగటం లాంటివి అజ్జెంటుగా మానెయ్యాలి. లేదంటే మీ ఇష్టం' అని చీవాట్లు పెట్టారు. అయినా మా అమ్మమ్మ వింటేగా..! ఆమె వదలందే ఈయన మాత్రం ఏం చేస్తాడు. రోజుకి కనీసం పదిహేను బకెట్ల నీటితో కడిగేస్తోంది కాబట్టే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. తప్పించుకోలేక డాక్టర్ వంక దీనంగా చూస్తూ శ్రీ రామచంద్రులవారు డాక్టర్ గారితో "నన్నేం చెయ్యమంటారు డాక్టర్ గారు. ఇలా నీళ్ళలో తిరగటం నాకు మాత్రం సరదానా ఏంటీ. అదిగో.. హైదరాబాద్ లో ఉన్న ఆ మహాతల్లి వల్ల నాకీ కష్టాలు. వాళ్ళు బావుండాలీ, వీళ్ళు బావుండాలీ అంటూ.. వాళ్ళ అందరి సంగతినీ నేనే చూసుకోవాలంటూ, చెప్పిన పేర్లే చెప్పి, వివరించిన విషయాలే మళ్ళీమళ్ళీ వివరించి.. ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి ఒక్కో బకేటెడు నీళ్ళతో నా కాళ్ళు కడిగి పారేస్తోంది. అందరూ కొలుస్తున్న నా కాళ్ళలో ఏం లేదు సార్. అంతా ఆవిడ చేతుల్లోనే ఉంది!" అన్నాడు. 
అవును మరి... డాక్టర్ గారు చీవాట్లు పెట్టింది అమ్మమ్మకి కాదు.. రాముడికే.
 
"ఆ రోజుల్లో శబరి ఎంగిలి పండు ఇస్తున్నా సంతోషంగానే తిన్నాను. అలాగని ప్రతిరోజు నాకు ఎంగిలిదే పెడతానంటే ఎలా సార్. ఆ మధ్య ఎప్పుడో ఓ సారి ఈవిడ చేత కాళ్ళు కడిగించుకున్నాను. అంతే.. ప్రతి రోజు ఇన్నేసి నీళ్ళతో.. హుమ్మ్..! చూడండి సార్, చివరికి ఆవిడ నా కాళ్ళు కడిగిన నీళ్లన్నీ ఇలా నా కళ్ళలో నుండి వచ్చేస్తున్నాయి పెల్లుబికి! మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి" అని వేడుకోలుగా అడిగాడు పాపం. 
 
డాక్టర్ గారన్నారు.. 'పోనీ మీ బాస్ ని అడిగి వేరే ఊరికి బదిలీ చేయించుకోండి అని. నా మొహంలే. నాకు ఆ అదృష్టం కూడానా మహాప్రభో.. కనీసం ఆ ఆప్షన్ కూడా లేదు నా బతుక్కి. బాస్ అంటే నేనే.. నేనంటేనే నా బాస్. ఆ మధ్య ఓ సారి కొన్ని సెటిల్మెంట్స్ చెయ్యాల్సొచ్చి నేనే మారు వేషంలో ఇలా కొంత కాలం పాటు ఈ భూమ్మీద ఉన్నాను. అంతే.. ఫినిష్.. దాని పర్యవసానం... ఇప్పుడీ పెద్దావిడ చేతుల్లో నా బతుకు పాసిపోవటం. విచిత్రం చూడండి.. వీళ్ళాయన కూడా నా భక్తుడే.. కానీ ఆయన మరీ ఇంత వైల్డ్ కాదు. అలా ఓ దణ్ణం పెట్టుకుని వదిలేస్తాడు. ఈవిడే ఇలా. పోనీ తినటానికి ఏదైనా పెడుతుందేమో అనుకుంటే, రోజు ఓ చెంచాడు పంచదారో, ఇంకొంచెం భక్తి ఎక్కువైతే ఓ చిన్న గిన్నెడు పొంగలీ, లేదంటే పులిహోర. ఇవేగా నాకు. పోనీ అవైనా నాకు పూర్తిగా పెడుతుందా అంటే.. నాకు అలా వాసన చూపించటానికి దగ్గరికి తీసుకొస్తుంది. ఈలోగా.. అదిగో ఉన్నాడుగా వాళ్ళ మనవడు...ఆ దరిద్రుడు కాంబోడియా వరద బాధితుడిలాగా చూస్తూ నిలబడగానే వాడి చేతుల్లో నాకోసం చేసిన నైవేద్యాన్ని పెట్టి పంపించేస్తుంది. పోనీ ఆ కోతిగాడు.. అదే.. వాళ్ళ మనవడు.. నా పాదపూజ అవుతున్న సమయంలో వస్తాడా అంటే.. అహా.. రాడు.. సరిగ్గా నైవేద్యం సమయానికి తయారవుతాడు. అక్కడ ఇంటిముందు గేటు దగ్గర కూర్చుని అడుక్కుతినేవాళ్ళు తింటున్నట్టుగా పులిహోర పొంగళ్ళని తినేస్తూ ఉంటాడు కక్కుర్తి మొహంగాడు' అని వాపోయాడు పాపం రామయ్య.
 
ఎక్కడో సముద్రం కింద ఉన్న పెద్దాయన కూడా ఈవిడ పూజల ధాటికి ఇల్లు ఖాళీ చేసి అండమాన్ నికోబార్ అడవుల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి. అదీ మా అమ్మమ్మ పవర్.
 
                                                       ***********************
 
మొన్నొక రోజున.. ఈవిడ జపాలు, పూజలు అన్నీ అయిపోయాక కాలక్షేపానికి చదువుకోటానికి ఆంధ్రజ్యోతి దిన పత్రికలో వచ్చే ఆదివారం పుస్తకం ఇమ్మంది. నాకు తెలుసు, ఈ విషయంలో మొగుడు పెళ్ళాలు తెలంగాణా ఆంధ్రా జిల్లాల నేతల్లాగా... ఆదర్శ దంపతుల్లాగా వాదించుకుంటారని. కాబట్టే ఆనాడు "ఈనాడు" కూడా తెచ్చి ఉంచాను ముందే. ఎందుకంటే... అమ్మమ్మకి తీరిక దొరికి సరిగ్గా ఆ పుస్తకాన్ని పట్టుకునే సమయానికే, తాతయ్య సంధ్యావందనాలు, దేవతార్చనలు భోజనం పూర్తయ్యి ఆ పుస్తకం పట్టుకునే సమయం రానే వస్తుంది. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఆ విధంగా ఆ పూటకి ఆ విషయంలో భారత్ నేపాల్ మధ్య ఉన్నంత సత్సంబంధాల లాంటివి వాళ్ళిద్దరి మధ్యా నెలకొల్పటంలో నా కృషి పరిఢవిల్లిందన్నమాట. నా ఈ తెలివి తేటలకి ఇది ఒక మెచ్చు తునక. మీరందరూ ఇప్పుడు చప్పట్లు కొట్టాలి నా సమయస్ఫూర్తికి (కొంచెం కష్టమైనా సరే..).
 
సరే.. పుస్తక పఠనం ఆరంభం. తాతయ్య భోజనం తరవాత వక్కపొడి నమిలినట్టుగా ఓ పది నిమిషాలు ఈనాడు పుస్తకాన్ని నమిలేసి 'కాసేపు అలా నడుం వాలుస్తా' అనుకుంటూ లోపలికెళ్ళాడు శాలువా కప్పుకుని. ఆయనది ఒక కోడి నిద్ర. గట్టిగా ఫది నిమిషాలు పడుకుంటాడో లేదో.. లేస్తూనే.. 'ఏమ్మా.. కాస్త కాఫీ నీళ్ళు పోస్తావూ అంటూ లేస్తాడు. మధ్యాన్నం పూట నిద్ర లేచాక.. ఆయనకి ఆవలింత కంటే  ముందు 'కాఫీ' అనే పదం వస్తుంది. ఆ తరవాతే.. అది కూడా కాఫీ రావటం లేట్ అయితేనే ఆవలిస్తాడు. లేదంటే అది కూడా బంద్.
 
ఆంద్రజ్యోతి పుస్తకం చదువుతూ అందులోకి లీనమైపోయిన అమ్మమ్మకి అందులో అత్యంత  ఆకర్షణీయమైన ప్రకటన ఒకటి కనిపించింది. KVR ఇంస్టిట్యూట్ వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తారనే ప్రకటన అది. దాని సారాంశం - రోజుకి ఒక్క గంట సేపు... అది కూడా ఇంట్లో కూర్చుని సాధన చేస్తే చాలు ఇంగ్లీష్ లో మాట్లాడటం కేవలం నెల రోజుల్లో వస్తుంది అని. అది చదివిన అమ్మమ్మ... నన్ను పిలిచి అది చూడమంది. సరే అని మొత్తం చదివేశాను. అప్పుడు ఆమె - 'ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏవేవో కాలేజీలకి వెళ్లి సంవత్సరాల తరబడి నేర్చుకుంటే కానీ రాదు అని అనుకున్నానురా ఇన్నాళ్ళు. వీడేంట్రా నెల రోజుల్లో వచ్చేస్తుందని అంటాడు. ఈ విషయం అప్పుడే తెలిస్తే నేను కూడా నేర్చుకునేదాన్ని కదా. ఇంత కాలం అయ్యాక ఇప్పుడు చెప్తున్నాడు ఈ పిచ్చిముండా కొడుకు" అని
నవ్వుతూ ఇంగ్లీష్ లో తిట్టిన తిట్టు నాకు తెలుగులో వినపడింది.
 
ఇలా అనటంలో ఆమె ఉద్దేశ్యం - ఒక భాష నేర్చుకోవటం ఇంత సులభం అంటూ వాడు జనాన్ని మభ్యపెడుతున్నాడని అనుకోవాలో... లేక నిజంగానే ఈవిడకి ఇంగ్లీష్ లో మాట్లాడాలనే కోరిక కలిగిందో.. అర్ధం కాక, నాకొచ్చిన ఆ నాలుగు ఇంగ్లీష్ ముక్కలనీ ఆ అయోమయంలో కొన్ని క్షణాల పాటు మర్చిపోయాను.
ఇది మీరు నమ్మాలి.

2, అక్టోబర్ 2011, ఆదివారం

చిక్కితే చిక్కు

ఆంద్రజ్యోతి పత్రికలో నేను చదివిన ఒక హాస్య శీర్షిక ఇక్కడ మీ కోసం. అక్కడ ఉన్నదాన్ని నా మాటల్లో చెప్తున్నాను.

ఒక వ్యక్తి బరువు తగ్గాలనుకున్నాడు.  అందుకోసం ఒక పేరున్న క్లినిక్ ని సంప్రదించి వివరాలు తీసుకున్నాడు. అయిదు రోజుల్లో అయిదు కేజీలు తగ్గిస్తామన్నారు వాళ్ళు. ఈ పెద్దాయన సరేనన్నాడు.
మర్నాడు ఉదయం ఓ అందమైన యువతి ఈయన ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. కాళ్ళకి షూస్, ప్యాంటు షర్టు వేసుకున్న ఆమె మెడలో "నన్ను పట్టుకుంటే నేను నీ దాన్ని" అనే బోర్డు. అది చూసాక, ఇంకేముంది.. ఇలాంటి అమ్మాయి దక్కితే అంతకంటే కావలసింది లేదు అనుకుని, వెంటపడటం మొదలెట్టాడు. పరిగెత్తీ పరిగెత్తీ అలసట వచ్చిందే కానీ అమ్మాయి దక్కలేదు. ఇలా అయిదు రోజులు గడిచాయి. తరవాత చూసుకుంటే నిజంగానే అయిదు కేజీలు తగ్గాడు.

మన వాడికి ఉత్సాహం వచ్చి.. వాళ్లకి ఫోన్ చేసి - నేను ఇంకా బరువు తగ్గాలి అని చెప్పాడు. సరే అయితే.. ఈ సారి అయిదు రోజుల్లో పది కేజీలు అని చెప్పారు వాళ్ళు.

మరుసటి రోజు పొద్దున్నే తలుపు తట్టింగ్... మన వాడు డోర్ ఓపెనింగ్. ఈ సారి అంతకు ముందు వచ్చిన అమ్మాయి కంటే కూడా అద్భుత సౌందర్యవతి వచ్చింది.. మెడలో మళ్ళీ అవే మాటలతో బోర్డు... "నన్ను పట్టుకుంటే నేను నీ దాన్నే..". ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిని వదులుకోకూడదని నిశ్చయించుకుని వెంట పడటం మొదలుపెట్టాడు. ఇలా అయిదు రోజుల నిర్విరామ కృషితో మన వాడు నిజంగానే పది కేజీలు తగ్గాడు. అమ్మాయి దక్కలేదే అని ఒకింత నిరాశ కలిగినా, బరువు విషయం గుర్తొచ్చి, ఇదేదో బావుందే అని అనుకుని, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ఫోన్ చేసి నేను ఇంకా బరువు తగ్గాలనుకుంటున్నాను అని చెప్పాడు. అది విని వాళ్ళు.. ఈ సారి ఏడు రోజుల్లో పాతిక కిలోలు, కానీ ఇది క్లిష్టమైన పని అని చెప్పారు. ఫరవాలేదు సిద్ధమే అని చెప్పాడు సదరు పెద్దాయన.

మర్నాడు పొద్దున ఎప్పటికంటే కూడా గట్టిగా తలుపు కొట్టిన చప్పుడయ్యేసరికి, వెళ్లి తలుపు తీశాడు ఈయన. తీరా చూస్తే.. అక్కడ ఒక దృఢకాయుడు నిలబడి ఉన్నాడు. అతని మెడలో ఉన్న బోర్డు చూశాక మన వాడు, ఈ సారి క్లినిక్ వాళ్ళు చెప్పినదాని కన్నా.. ఓ అయిదు కిలోలు ఎక్కువే తగ్గాడు. ఇంతకీ అతని మెడలో ఉన్న బోర్డు చెప్పిన మాట ఇదీ... "నేను నిన్ను పట్టుకుంటే నువ్వు నా వాడివవుతావు...."

.............!!!???

7, జులై 2011, గురువారం

చెత్త బుట్ట

అతి తక్కువ ధరలో దొరికినా మనిషికి అత్యంత విలువైన వస్తువు, చెత్త బుట్ట. దీన్ని మేనేజ్ చెయ్యటంలో ఒక్కరోజు తేడా వస్తే చాలు, మన  బతుకుల్ని దుర్గంధభరితం చెయ్యగల శక్తి దీని సొంతం. దాని తీవ్రత ఎంతలా ఉంటుందంటే.. చివరికి అసలీ దుర్గంధం అంతా మన వల్లేనా.. మనం తిన్న ఆహారం వల్లేనా.. అంటే మనం ఇంత దుర్గంధభరితమైన ఆహారాన్ని రెచ్చిపోయి మరీ మేస్తున్నామా అనే అనుమానాలొచ్చి మన మీద మనకే అసహ్యం పుట్టించేంత! అయితే ఇక్కడ కేవలం తినే వస్తువుల కారణంగానే వస్తోందా ఆ దుర్గంధం. లేదు, ఈ గంధానికి కారణం.. ఆకులూ, చెత్త కాగితాలూ, తొక్కలు - ఇలా ఇంకా రకరకాల వస్తువులు. అయితే చాలా రోజుల వరకు చెత్త అంటే ఇదే అని అనుకునేవాణ్ణి. కానీ తరవాత్తరవాత శానా విషయాలు తెలిసిపోయినాయి నాకు. ఎలాగంటే - ఇప్పుడూ... దేవుడి విషయంలో "ఇందుగలడందు లేడని లేదు ఎందెందు వెదకిన అందందే గలడు" అనే మాట నిజం. కాకపోతే మనం వెతకగలగాలి; వెతికినా కనిపించాలి; కనిపించినా మనం చూడగలగాలి. కానీ ఈ మధ్య నేను కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే.. చెత్త "ఎందెందు చూసిన అందందే కలదు" అని. అంటే దైవం వెతికితే కానీ కనిపించదు. చెత్త దర్శనం మాత్రం.. చూడాలి అని జస్ట్ అలా మనసులో అనుకుని, ప్రయత్నిస్తే చాలు.. ఎక్కడైనా సరే.. ఎందులో అయినా సరే కనిపించేస్తుంది. అంత కరుణామయి ఈ చెత్త దేవత. ఈ చెత్తలో నేను తెలుసుకున్న రకాలు చాలానే ఉన్నాయి కానీ.. ముఖ్యమైనవి కొన్ని చెప్తాను. వాటిలో మొదటిది... సరే, అందరికీ తెలిసిందే. నేను ఇందాకే చెప్పేశాను. అదే.. రోజువారీ దానికి చెయ్యాల్సిన గౌరవ మర్యాదలు దానికి చెయ్యకపోతే.. ఒక కంటితో  ఆర్తితోను, ఇంకో కంటితో కోపం గాను అలా నోరు తెరుచుకుని మన వైపు ఆరాటంగా చూస్తూ ఉండే చెత్త బుట్టలోని చెత్త.
 
ఇప్పుడు మరో రకం ఏంటంటే.. డిజిటల్ చెత్త. అబ్బో... ఇది శానా డేంజర్ లే. ఎందుకంటే.. ఈ చెత్త వాసన ఒకసారి చూశామా.. ఇహ అది వ్యసనం అయిపోతుంది. ఓ రెండుమూడేళ్ళ క్రితం నేను కూడా చూశాను దీని వాసన. మా  ఫ్రెండ్ ఒకడున్నాడులే.. వాడి ప్రోద్బలంతో చవి చూసిన అనుభూతి ఇది. అంతే.. ఇక అప్పటి నుండి అదేదో  మధురమైన జాజి మల్లెల వాసన చూడటానికి  పరితపించిపోతున్నట్టుగా.. ఈ డిజిటల్ చెత్త వాసన చూడటానిక్కూడా పరితపించిపోయేవాళ్ళం. కొంతమందికి అయితే తిండి తినటం ఓ గంట ఆలస్యమైనా ఫరవాలేదు కానీ దీని వాసన చూడకపోతే మాత్రం నాలుక పిడచ కట్టుకుపోతున్నట్టు, కళ్ళు నీరసంతో ఊడి పడిపోతాయేమో అన్నట్టూ.. ఇలా రకరకాల మానసిక శారీరక ఇబ్బందులు పడిపోయేంతలా అలవాటైపోయింది. పైగా దానికి ఇంగ్లీష్ లో ఒక ముద్దు పేరు.. స్క్రాప్ బుక్ అంటూ! దీని పేరుకి తగ్గట్టే ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళంతా నానా చెత్త విషయాలనీ మాట్లాడేసుకుంటూ ఉంటారు. చివరికి పొద్దున్నే ముక్కు చీదేప్పుడు ఎవరికైనా తుమ్ము వస్తే.. అది కూడా 'బిన్ లాడెన్ ని అమెరికా సైన్యం తుదముట్టించింది' అన్నంత ముఖ్యమైన సమాచారం అన్నట్టుగా చీదటం  మధ్యలో ఆపేసి మరీ వచ్చి.. వాళ్ళ ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ 'ఇప్పుడే అందిన వార్తా' అని అరుచుకుంటూ మరీ చెప్పేస్తారు. దాన్ని చదివిన వాళ్ళంతా పూల బొకేలతో సదరు వ్యక్తికి ప్రగాఢ పరామర్శ ఒకటీ. ఈ మధ్య ఈ చెత్త అందరికీ కనిపించేట్టుగా ఉందనే భావనతో.. దాన్ని కప్పి పెట్టేలా మూత ఉన్న చెత్త కుండీలు కావాలని జనం కోరుకుంటున్నారన్న విషయం కొంత మందికి తెలిసిందేమో.. దాంతో వెంటనే కొత్త ప్యాంటు షర్టు వేసుకుని వచ్చేసి మరీ.. ఒక కొత్త అందమైన చెత్తకుండీని తయారు చేసి ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క చెత్తబుట్టని చేతిలో పెట్టి మరీ వెళ్ళారు. దానికి ఇంకో అందమైన పేరు.. "ముఖ పుస్తకం" అని.  మనసులో ఉండే చెత్తనంతా అవతలి వాళ్ళ మొహాన్ని పుస్తకంగా చేసుకుని అక్కడ కక్కి పారేయి.. అదేలెండి.. అక్కడ రాసి పారెయ్యండి అని చెప్తున్నట్టుగా.. ఫేస్ బుక్ అంటూ ఒక  కొత్త చెత్తకుండి..! "ఒక కొత్త చెత్తకుండి" అన్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన  విషయం ఏంటంటే.. కొత్త చెత్త వేసుకునే కుండి అని కాదు. చెత్త పాతదే.. దాన్ని వేసుకునే కుండీ మాత్రం కొత్తది అని. అంటే "old wine in new bottle" లాగా అన్నమాట. వైన్ పాతబడుతున్న కొద్దీ ఎంత భీభత్సమైన వాసన వస్తూ మందుబాబులకి కిక్కెక్కిస్తుందో... చెత్త కూడా ఓల్డ్ అవుతున్న కొద్దీ మాంచి కిక్కెక్కిస్తూ ఉంటుంది ఇక్కడి డిజిటల్ జనాలకి. డిజిటల్ జనాలంటే వాళ్ళెవరో మర మనుషులనుకునేరు.. కానే కాదు. డిజిటల్ చెత్తకి అలవాటు పడ్డ జనాలు అని నా ఉద్దేశ్యం. అవును మరి.. మాటలు ఎంత చెత్తగా ఉన్నా సరే.. ఎంత విసుగు తెప్పించేవిగా ఉన్నా సరే.. ఇవే మాటల్ని మాట్లాడుకునే మనుషులు రోజురోజుకీ పెరుగుతున్నారు అంటే ఏంటీ.. దీని కంపు.. సారీ.. దీని సువాసన వీళ్ళందరికీ మత్తెక్..కాదు.. కిక్కెక్కిస్తోంది అనే కదా.

మనన్ని మభ్య పెడుతున్న మరో చెత్త... సినిమా చెత్త. ఒకానొకప్పుడు.. అంటే రంగుల బొమ్మలు లేని రోజుల్లో.. సినిమా అనేది ఒక అద్భుతమైన కళ... అదొక అందమైన కళాత్మక రంగం అని పేరు. దానికి తగ్గట్టే మంచి మంచి చిత్రాలెన్నో వచ్చేవి. రంగుల ప్రపంచం ఆవిష్కృతం అయ్యాక కూడా చాలానే మంచి చిత్రాలొచ్చాయి. కానీ ఎటొచ్చీ.. ఒక నాలుగైదారేడెనిమిదేళ్ళుగా వచ్చిన సినిమాలలో పట్టుమని పది సినిమాలని కూడా మంచివి అని చెప్పలేకపోతున్నాం. దీనిక్కారణం కూడా ఎవరో కాదండోయ్... మనమే. కధ ఎటువంటిదైనా, నటీనటులెవరైనా, ఆ చిత్రాన్ని నిర్మించేది ఎవరైనా.. ఇవన్నీ అనవసరం. సినిమా హాల్ కి వెళ్ళామా.. కొంచెం సేపు అక్కడ కూర్చున్నామా.. వాడు చూపించిన చెత్తని చూశామా.. ఎంతసేపు ఇదే తప్ప.. ఆ సినిమా ఏంటీ.. అందులో చూపించింది ఏంటీ.. ఆ చిత్రం ద్వారా మనకి చెప్పాలనుకున్న సందేశం ఏంటీ.. ఇవేమీ చూడకుండా మనం వెళ్లిపోతూ ఉంటాం, వాటి వెంట పరిగెత్తుతూ. ఇటువంటి మనన్ని చూసి.. అసలు కధ ఏదైనా ఫరవాలేదు.. ఇటువంటి జనాలున్నంత వరకు మనకు ధోకా లేదు అని అనుకుంటూ... సినీ దర్శకులు జనమేజయులు అయిపోతున్నారు. జనమేజయులు అంటే.. ఇటువంటి తింగరి జనాల వల్ల అజేయులు అయ్యేవారు అని తెలుగు సాహిత్యం కొత్తగా చెప్తున్న అర్ధం. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నాక ఇక్కడ ఎవరు చెత్త అనేది చెప్పటం నా వల్ల కావట్లేదు. ఎందుకంటే ఇటువంటి సినిమాలు తీస్తున్నందుకు గాను దర్శకులు, నిర్మాతలని చెత్త అనాలా? లేక ఈ సినిమాల్లో నటించే కళాకారులని చెత్త అనాలా? లేక వీటిని ప్రోత్సహిస్తూ ఆనందిస్తున్న జనాలని చెత్త అనాలా? నాకైతే చివరిది సరి అయిందేమో అనిపిస్తోంది.
 
ఇకపోతే మరో రకం చెత్త. ఇది కొంచెం భయంకరమైంది. అయితే అసలీ చెత్త ఏంటి, ఇది ఏ రకానికి చెందింది అనే దాన్ని చెప్పటానికి ముందు నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే.. సృష్టిలో ఏదీ వ్యర్ధం కాదు. వ్యర్ధం అనేది లేదు అనేదాన్ని నిజం చేద్దాం అని అనుకున్నారేమో; పైగా రాష్ట్రంలో చెత్త బాగా  పేరుకుపోతోందీ.. దీని వల్ల చాలా పర్యావరణ, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి; పైగా పెరుగుతున్న జనాభాకి కావలసినంత ఇంధనం కూడా మన దగ్గర లేదు; వీటన్నికి చక్కటి పరిష్కారం.. చెత్త నుండి  ఇంధనం/ విద్యుత్తూ తయారు చెయ్యటమే.. కాబట్టి ఆ  విధంగా మనం ముందుకెళ్దాం అని అంటూ ఒక చక్కటి ఉపాయంతో ముందుకొచ్చింది అప్పటి చంద్రబాబునాయిడు గారి ముఖ్యమంత్రిత్వం. మరి అది ఏ కాలనీలో చెత్తకుండీ వరకు ముందుకెళ్ళిందో, ఎంతవరకు ఈ కల సాకారమైందో నాకు తెలీదు కానీ.. ఆలోచన అయితే చాలా మంచిది. చెత్త తగ్గుతుంది. ఇంధనం పెరుగుతుంది. జనం అవసరాలు తీరుతాయి కూడాను. సరే, ఇప్పుడు  విషయానికొస్తే.. మరో రకం చెత్త ఏదైతే ఉందో.. అది ఇలా దేనికోసమైనా సదుపయోగం చెయ్యదగింది కూడా కాదు. అదేంటీ.. సృష్టిలో ఏదీ వ్యర్ధం కానేరదు అని కదా అన్నావు అని అడుగుతారేమో. నిజమే.. కానీ నాక్కూడా ఈ మధ్యే తెలిసింది; అసలేమాత్రం పనికి రానివీ, ఉపయోగించలేనివీ, పైగా మానవాళికి చాలా నష్టాన్ని తెచ్చిపెట్టేవి కూడా ఉన్నాయని.
 
రకరకాల ఆపరేషన్లలో ఉపయోగించటం వల్ల నానా రకాల మరకలు పడ్డ దూది.. కొన్ని నాలాల నుండి మురుగుకంపు కొట్టే చెత్త.. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో కలిపే భయంకరమైన రసాయన వ్యర్ధాలు.. కొన్ని నదుల నుండి తీసి బయటపడేసే కొన్ని జంతువుల మృత కళేబరాలు.. ఇలా రకరకాల చెత్త కనిపిస్తూ ఉంటుంది. వాటి నుండి వచ్చే వాసన సంగతి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే దేనికీ పనికి రాకుండా ఉండే చెత్త నిజానికి ఇది కాదు, కానీ వీటన్నిటినీ ఎందుకు చెప్తున్నానంటే.. ఇక్కడ నేను చెప్పిన ఈ మూడు నాలుగు రకాల చెత్తనీ ఎప్పుడైనా లారీలలో తీసుకెళ్ళి.. అక్కడెక్కడో డంప్ చెయ్యటం కంట పడితే.. చెత్తని డంప్ చేస్తున్నట్టుగా కనిపించదు నాకు. ఉదాహరణకి.. హుస్సేన్ సాగర్ విషయమే తీసుకుంటే.. ఆ రసాయనిక  చెత్తని డంప్ చేస్తుంటే.. అతి ప్రమాదకరమైన కొంతమంది రాయలసీమ ప్రజా నాయకుల (?) ని డంప్ చేస్తున్నట్టుగా; ఆసుపత్రుల దూదిని డంప్ చేస్తుంటే.. వోక్స్ వాగెన్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి రాకపోవటానికి కారణమైన ఒక చెత్త
నాయకుడిని డంప్ చేస్తున్నట్టుగా; మృత కళేబరాలని డంప్ చేస్తున్నప్పుడేమో.. రాష్ట్రంలో అసలు 'లా అండ్ ఆర్డర్' అనేది ఉందా అనే అనుమానం వచ్చేట్టుగా పాలన సాగిస్తున్న కొన్ని రాజ-కిరణాలని డంప్ చేస్తున్నట్టుగా; నాలాల నుండి తీసిన చెండాలమైన మురికిని డంప్ చేస్తుంటే.. తెలంగాణా పేరుతో సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్న వ్యక్తి.. ఇలా ఒక్కో రకమైన చెత్తకీ ఒక్కో రాజకీయ నాయకుడు/రాలు గుర్తొస్తూ ఉంటారు నాకు. ఇదంతా రాజకీయానికి చెందిన చెత్త అని నాకనిపిస్తోంది.
 
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద చెత్త పురాణమే తయారవుతుంది. మొత్తం చదివేశాక అసలిక్కడ రాసిందంతా ఒక చెత్త అని అనిపించుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే.. ఈ పెపంచకంలో నానా రకాల చెత్త బుట్టలూ ఉన్నాయని చెప్పుకుంటూ పోయి చివరికి నేను రాసిన దానికే "చెత్త బుట్ట" నామకరణం జరక్కూదడనే ఉద్దేశ్యంతో ఇక్కడితో నా చేత్తోపాఖ్యానాన్ని ఆపేస్తున్నాను. లేదంటే నిజంగానే ఇదొక చెత్త బుట్ట అయిపోతుంది.