29, మార్చి 2011, మంగళవారం

ఫాల్గుణ పున్నమి

ఈ మాసపు పున్నమికి  ప్రత్యేకత... అది ఈ సంవత్సరపు చివరి వెన్నెల రోజు కావటమే..! చివరిదైతేనేం... కాలంలో అది కూడా ఒక అందమైన రోజు... అంతకంటే ముఖ్యంగా... మన మనసులకి అతి  చేరువవుతున్న రోజు...చూపులకి అన్ని అందాలు కనిపించేటంతగా దగ్గరవుతున్న రోజు..! ఆ తరవాత  ఇంకా అంతకంటే కూడా అందమైన రోజులని అందించటానికి నాంది పడే రోజు..! మరి అంతకు  ముందెప్పుడూ ఆయన మనకి అంత దగ్గరగా లేడా... మనన్ని ఎప్పుడూ దూరంగానే ఉంచేశాడా... అదేం  కాదు... ఆయనెక్కడున్నా... ఎంత దూరంలో ఉన్నా మనసులు దగ్గరగా ఉంటే చాలు అన్నట్టుగా  ఉన్నాడు... ఇప్పుడు కూడా అంతే..! ఇది నిజానికి చివరిది కాదు... కాల గమనంలో మరొక పున్నమి రోజు ... అంతే అని తెలియజేసే రోజు..!

వెన్నలోని చల్లదనాన్ని, చంద్రుడిలోని వన్నెలనీ... మల్లె మొగ్గలలోని మధురిమలనీ... జాజి  పూవులలోని మకరందాన్నీ... నిశా రాత్రి తాలూకు అందాలనీ... అంతలోనే ధవళ కాంతులనీ ... చల్లటి  గాలుల ఝరులనీ ... శృతిలయల సవ్వడులనీ... లయబద్ధంగా వీచే వేప వాసనలనీ... చుట్టూ మిణుగురు పురుగుల్లా అలరిస్తున్న చుక్కల ముగ్గునీ... అక్కడి వింతలనీ కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తూ... వీనుల విందైన ఘంటసాల మాష్టారి మధుర గీతాలు చెవులకి సార్ధకత కలిగిస్తూ ఉండగా... అప్పుడు తెలిసింది... ఓహ్... మావయ్య మనకి అతి దగ్గరగా వచ్చి పలకరిస్తూ మనల్ని అలరించే రోజు...అదే...ఫాల్గుణ  పున్నమి రోజు ఇదే కదూ... చూస్తూ ఉండగానే అద్భుత కౌముది క్షణాలు మన ముందుకొచ్చేశాయే అని..! అలా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోవటం నా వంతు అయింది...!



విరోధి నామ సంవత్సర చివరి పౌర్ణమి రోజున ఇలా చంద్రుడు మనకి ఇంత దగ్గరికి రావటం వింతేనేమో.. మరి లేకపోతే... ఏడాది కాలంగా లేనిది ఇప్పుడే ఈయన ఇంత దగ్గరికెందుకొస్తున్నట్టో..! ఖర నామ సంవత్సరంలో మనం ఇంకా ఇంకా ఇంతకంటే కూడా దగ్గరయ్యి .. చంద్ర శే"ఖర" నామ సంవత్సరంగా పిలిచుకునే అవకాశం మనకిస్తున్నాడేమో..! తెలుగు భాషలో ఖరము అనే పదానికి ఉన్న అర్ధం గార్ధభం అయినప్పటికీ... అంతకంటే శేఖరమునే తలపింపచేస్తున్న మన మావయ్యకి జోహార్లు..!

ఈయనెవరో కాదు... మల్లె పూల రేడు..! మల్లె శేఖరుడు...! మల్లికార్జునుడి శిరస్సు మీద ఉండీ ఉండీ ...మల్లె శేఖరుడు అయిపోయాడు...మా చంద్రయ్య..! అవును మరి...ఇద్దరికీ సారూప్యత ఉందిగా...!!
మల్లె  పూలు ఆయన్ని చూసి విరబూస్తే...చంద్రుడు వాటిని చూసి వికసిస్తాడు..! చంద్రుడి రంగుని మల్లె పూలు పులుముకుంటే... వాటి పరిమళాన్ని రంగరించి చంద్రుడు వెన్నెల కురిపిస్తాడు...! వెన్నెలని  పీల్చుకుందామని అనుకుంటామా... అది కమ్మని మల్లె పూల వాసనతోనే ముక్కులోకి దూరిపోతుంది..! ఆ రోజున వాళ్ళిద్దరూ అలా కలగలిసిపోయి నాట్యాలాడుతుంటే... అది చూసి జాజి పూల పరవశం మాటల్లో  చెప్పలేనిది..! ఎందుకంటే మీ రంగు, పరిమళాలకి నా రుచి కలిస్తేనే మీకు అందం అని చెప్తూ... వాటితో  పాటు సంగమించి .. చక్కటి రుచిని చేకూరుస్తాయి మా విరజాజులు..! ఇక్కడ ఒక వింత గమనించారా... మల్లె పూలు చంద్రుణ్ణి ప్రత్యక్షంగా చూడచ్చుగా.. కానీ అలా వద్దట...ఎందుకంటే అలా ప్రత్యక్షంగా చూస్తుంటే చంద్రుడిలో ఏదో లోపం ఉందిట... అందుకే అవి ..తొంగి తొంగి జాజి కొమ్మల్లో నుండి దోబూచులాడుతూనే కనిపించీ కనిపించని చంద్రుణ్ణి చూస్తాయట... అంటే జాజి పూల తాలూకు మకరందం చంద్రుడి కాంతుల్లో  కలిస్తేనే మల్లె పూలకి నచ్చుతుందిట..! ఈ మూడిటి బంధం ఎంటో మానవ మాత్రులకి అర్ధం కానిదీ... అర్ధం చేసుకోలేనిదీ కూడా..! అసలెప్పటిదో ఈ బంధం...!

ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది... వేప పువ్వు వాసనలు...మధురమైన జాజి పువ్వు మకరందపు  పరిమళాలు.. మల్లె పూల మధురిమలు... ఇవన్నీ ఉండగా వచ్చిన వెన్నెలలో  అలా రాత్రంతా  తడిస్తే... ఉదయాన్నే లేచి చూసేసరికి... మన శరీరాలు మనకి తెలీకుండానే తెల్లగా అయిపోయినట్టుగా  అనిపించటమో... లేక ..ఆ మధుర సువాసనలు మనకి వంటబట్టి... అలా కొంచెం సేపు ఉండిపోతాయనో  అనిపిస్తూ ఉంటుంది..!

పైగా... ఫల్గుణ పౌర్ణమి అంటే ఆ రోజున రంగుల పండగ..! ప్రజలంతా ఆనందోత్సాహాలలో తేలియాడే రోజు..! రంగు రంగులతో పగలంతా గడిపేసి... చీకటి పడేసరికి...అన్ని రంగులనీ మర్చిపోతూ అందరూ ఒకే రంగుని పులుముకుని... ధవళ  కాంతిలో మెరిసిపోతూ ఉంటారు..! ఎన్ని రంగులు పూసుకున్నా.. ఎన్ని రంగుల్లో మనన్ని మనం  చూసుకున్నా.. అదేంటో ఆయన.. అదే.. మనందరికీ మావయ్యా.. చంద్రయ్య అలా మన పైకి  రాగానే.. మన రంగులన్నీ వెలవెలబోతాయి..! మరి ఆయన తన వెన్నెల దుప్పట్లో మనల్ని అందరినీ  కప్పేస్తాడుగా..! ఆ దుప్పటి మన మీద పడగానే రంగులన్నీ పోయి... కేవలం ఒకే ఒక్క వర్ణం...అదే.. మానవ జాతికి కావలసిన .. కల్మషం లేని... వెండి వర్ణం... చల్లని తెలుపు వర్ణం పులుముకుంటుంది...! అసలు మనుషుల రంగులు వేరు ఏమో కానీ .. వాళ్ళ మనసుల రంగు మాత్రం ఇది మాత్రమే ఉండాలి అని చాటి చెప్పే వర్ణం! మరి వర్ణం ఒకటే అయితే....వైరుధ్యం అనేది ఉండదుగా..! వైరుధ్యం అనేదే లేనప్పుడు విరోధి ఉండడుగా.! విరోధి లేకపోతే మరి ఉండేది ఏంటీ .. వైభవమేగా..! మరి ఆ వైభవం కోసమేగా ఖర నామం రాబోతోంది ..అదే...శేఖర నామం రాబోతోంది..!

ఫల్గుణ (కొంచెం సేపు ఫాల్గుణ అని అనుకోకపోతే) అంటే అర్జునుడు  అని కదా..! మరి అదే  అర్జునునికి  విజయ,  కిరీటి, సవ్యసాచి లాంటి నామాలెన్నో ఉన్నాయి కదా..! అంటే ఈ పున్నమి నుండి మనం కూడా  అన్నిటిలోనూ  విజయం సాధిస్తూ కీర్తి కిరీటాలని సాధించబోతున్నామా..? ఏమో...నిజమేనేమో..!

అందుకే ఈ ఖర నామం...శేఖర నామంగా అయ్యి..వచ్చే సంవత్సరం మొత్తం అందరికీ సకల శుభాలు జరగాలనీ...జరుగుతాయనీ.. జరగటానికి ఈ ఫాల్గుణ పౌర్ణమి ఒక నాందిగా అవుతుందని ఆశిస్తున్నాను ..!