29, మార్చి 2011, మంగళవారం

ఫాల్గుణ పున్నమి

ఈ మాసపు పున్నమికి  ప్రత్యేకత... అది ఈ సంవత్సరపు చివరి వెన్నెల రోజు కావటమే..! చివరిదైతేనేం... కాలంలో అది కూడా ఒక అందమైన రోజు... అంతకంటే ముఖ్యంగా... మన మనసులకి అతి  చేరువవుతున్న రోజు...చూపులకి అన్ని అందాలు కనిపించేటంతగా దగ్గరవుతున్న రోజు..! ఆ తరవాత  ఇంకా అంతకంటే కూడా అందమైన రోజులని అందించటానికి నాంది పడే రోజు..! మరి అంతకు  ముందెప్పుడూ ఆయన మనకి అంత దగ్గరగా లేడా... మనన్ని ఎప్పుడూ దూరంగానే ఉంచేశాడా... అదేం  కాదు... ఆయనెక్కడున్నా... ఎంత దూరంలో ఉన్నా మనసులు దగ్గరగా ఉంటే చాలు అన్నట్టుగా  ఉన్నాడు... ఇప్పుడు కూడా అంతే..! ఇది నిజానికి చివరిది కాదు... కాల గమనంలో మరొక పున్నమి రోజు ... అంతే అని తెలియజేసే రోజు..!

వెన్నలోని చల్లదనాన్ని, చంద్రుడిలోని వన్నెలనీ... మల్లె మొగ్గలలోని మధురిమలనీ... జాజి  పూవులలోని మకరందాన్నీ... నిశా రాత్రి తాలూకు అందాలనీ... అంతలోనే ధవళ కాంతులనీ ... చల్లటి  గాలుల ఝరులనీ ... శృతిలయల సవ్వడులనీ... లయబద్ధంగా వీచే వేప వాసనలనీ... చుట్టూ మిణుగురు పురుగుల్లా అలరిస్తున్న చుక్కల ముగ్గునీ... అక్కడి వింతలనీ కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తూ... వీనుల విందైన ఘంటసాల మాష్టారి మధుర గీతాలు చెవులకి సార్ధకత కలిగిస్తూ ఉండగా... అప్పుడు తెలిసింది... ఓహ్... మావయ్య మనకి అతి దగ్గరగా వచ్చి పలకరిస్తూ మనల్ని అలరించే రోజు...అదే...ఫాల్గుణ  పున్నమి రోజు ఇదే కదూ... చూస్తూ ఉండగానే అద్భుత కౌముది క్షణాలు మన ముందుకొచ్చేశాయే అని..! అలా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోవటం నా వంతు అయింది...!



విరోధి నామ సంవత్సర చివరి పౌర్ణమి రోజున ఇలా చంద్రుడు మనకి ఇంత దగ్గరికి రావటం వింతేనేమో.. మరి లేకపోతే... ఏడాది కాలంగా లేనిది ఇప్పుడే ఈయన ఇంత దగ్గరికెందుకొస్తున్నట్టో..! ఖర నామ సంవత్సరంలో మనం ఇంకా ఇంకా ఇంతకంటే కూడా దగ్గరయ్యి .. చంద్ర శే"ఖర" నామ సంవత్సరంగా పిలిచుకునే అవకాశం మనకిస్తున్నాడేమో..! తెలుగు భాషలో ఖరము అనే పదానికి ఉన్న అర్ధం గార్ధభం అయినప్పటికీ... అంతకంటే శేఖరమునే తలపింపచేస్తున్న మన మావయ్యకి జోహార్లు..!

ఈయనెవరో కాదు... మల్లె పూల రేడు..! మల్లె శేఖరుడు...! మల్లికార్జునుడి శిరస్సు మీద ఉండీ ఉండీ ...మల్లె శేఖరుడు అయిపోయాడు...మా చంద్రయ్య..! అవును మరి...ఇద్దరికీ సారూప్యత ఉందిగా...!!
మల్లె  పూలు ఆయన్ని చూసి విరబూస్తే...చంద్రుడు వాటిని చూసి వికసిస్తాడు..! చంద్రుడి రంగుని మల్లె పూలు పులుముకుంటే... వాటి పరిమళాన్ని రంగరించి చంద్రుడు వెన్నెల కురిపిస్తాడు...! వెన్నెలని  పీల్చుకుందామని అనుకుంటామా... అది కమ్మని మల్లె పూల వాసనతోనే ముక్కులోకి దూరిపోతుంది..! ఆ రోజున వాళ్ళిద్దరూ అలా కలగలిసిపోయి నాట్యాలాడుతుంటే... అది చూసి జాజి పూల పరవశం మాటల్లో  చెప్పలేనిది..! ఎందుకంటే మీ రంగు, పరిమళాలకి నా రుచి కలిస్తేనే మీకు అందం అని చెప్తూ... వాటితో  పాటు సంగమించి .. చక్కటి రుచిని చేకూరుస్తాయి మా విరజాజులు..! ఇక్కడ ఒక వింత గమనించారా... మల్లె పూలు చంద్రుణ్ణి ప్రత్యక్షంగా చూడచ్చుగా.. కానీ అలా వద్దట...ఎందుకంటే అలా ప్రత్యక్షంగా చూస్తుంటే చంద్రుడిలో ఏదో లోపం ఉందిట... అందుకే అవి ..తొంగి తొంగి జాజి కొమ్మల్లో నుండి దోబూచులాడుతూనే కనిపించీ కనిపించని చంద్రుణ్ణి చూస్తాయట... అంటే జాజి పూల తాలూకు మకరందం చంద్రుడి కాంతుల్లో  కలిస్తేనే మల్లె పూలకి నచ్చుతుందిట..! ఈ మూడిటి బంధం ఎంటో మానవ మాత్రులకి అర్ధం కానిదీ... అర్ధం చేసుకోలేనిదీ కూడా..! అసలెప్పటిదో ఈ బంధం...!

ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది... వేప పువ్వు వాసనలు...మధురమైన జాజి పువ్వు మకరందపు  పరిమళాలు.. మల్లె పూల మధురిమలు... ఇవన్నీ ఉండగా వచ్చిన వెన్నెలలో  అలా రాత్రంతా  తడిస్తే... ఉదయాన్నే లేచి చూసేసరికి... మన శరీరాలు మనకి తెలీకుండానే తెల్లగా అయిపోయినట్టుగా  అనిపించటమో... లేక ..ఆ మధుర సువాసనలు మనకి వంటబట్టి... అలా కొంచెం సేపు ఉండిపోతాయనో  అనిపిస్తూ ఉంటుంది..!

పైగా... ఫల్గుణ పౌర్ణమి అంటే ఆ రోజున రంగుల పండగ..! ప్రజలంతా ఆనందోత్సాహాలలో తేలియాడే రోజు..! రంగు రంగులతో పగలంతా గడిపేసి... చీకటి పడేసరికి...అన్ని రంగులనీ మర్చిపోతూ అందరూ ఒకే రంగుని పులుముకుని... ధవళ  కాంతిలో మెరిసిపోతూ ఉంటారు..! ఎన్ని రంగులు పూసుకున్నా.. ఎన్ని రంగుల్లో మనన్ని మనం  చూసుకున్నా.. అదేంటో ఆయన.. అదే.. మనందరికీ మావయ్యా.. చంద్రయ్య అలా మన పైకి  రాగానే.. మన రంగులన్నీ వెలవెలబోతాయి..! మరి ఆయన తన వెన్నెల దుప్పట్లో మనల్ని అందరినీ  కప్పేస్తాడుగా..! ఆ దుప్పటి మన మీద పడగానే రంగులన్నీ పోయి... కేవలం ఒకే ఒక్క వర్ణం...అదే.. మానవ జాతికి కావలసిన .. కల్మషం లేని... వెండి వర్ణం... చల్లని తెలుపు వర్ణం పులుముకుంటుంది...! అసలు మనుషుల రంగులు వేరు ఏమో కానీ .. వాళ్ళ మనసుల రంగు మాత్రం ఇది మాత్రమే ఉండాలి అని చాటి చెప్పే వర్ణం! మరి వర్ణం ఒకటే అయితే....వైరుధ్యం అనేది ఉండదుగా..! వైరుధ్యం అనేదే లేనప్పుడు విరోధి ఉండడుగా.! విరోధి లేకపోతే మరి ఉండేది ఏంటీ .. వైభవమేగా..! మరి ఆ వైభవం కోసమేగా ఖర నామం రాబోతోంది ..అదే...శేఖర నామం రాబోతోంది..!

ఫల్గుణ (కొంచెం సేపు ఫాల్గుణ అని అనుకోకపోతే) అంటే అర్జునుడు  అని కదా..! మరి అదే  అర్జునునికి  విజయ,  కిరీటి, సవ్యసాచి లాంటి నామాలెన్నో ఉన్నాయి కదా..! అంటే ఈ పున్నమి నుండి మనం కూడా  అన్నిటిలోనూ  విజయం సాధిస్తూ కీర్తి కిరీటాలని సాధించబోతున్నామా..? ఏమో...నిజమేనేమో..!

అందుకే ఈ ఖర నామం...శేఖర నామంగా అయ్యి..వచ్చే సంవత్సరం మొత్తం అందరికీ సకల శుభాలు జరగాలనీ...జరుగుతాయనీ.. జరగటానికి ఈ ఫాల్గుణ పౌర్ణమి ఒక నాందిగా అవుతుందని ఆశిస్తున్నాను ..!

12, ఫిబ్రవరి 2011, శనివారం

నట రాజయకీయం

ప్రజారాజ్యం మరణించింది..!
ప్రజారాజ్యం అసువులు బాసింది..!
ప్రజారాజ్యం నికృష్ట చావుని చూసింది..!
ప్రజారాజ్యం దారుణ హత్య..!
ప్రజారాజ్యం నీచ ముగింపు..!


ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ప్రజారాజ్యానికి సరిగ్గా అతికినట్టు సరిపోతుందేమో..! నేను సైతం అంటూ ఉప్పెనలా వచ్చి.. అశ్రువొక్కటి ధారవోసాను అంటూ బీరాలు పలికి... ప్రజలను మోసం చేసిన కొంత మంది చిరాయువులు...చివరికి వెన్ను పోటు పొడిచి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు..! చివరికి...సదరు ప్రజారాజ్యాన్ని నమ్ముకుని సమిధలు అయింది ఎవరు... దాని కోసం పని చేసిన కార్యకర్తలు..! దాని స్థాపకుల అభిమానులు..! సత్య పాలన తాలూకు ప్రగల్భాలని నమ్మిన ప్రజలు..!


గత ఆరు దశాబ్దాలుగా లభించని, కనిపించని అభివృద్ధి ఇప్పటికైనా వస్తుంది అని ఎవరిని చూసి ఆశించారో... ఎవరిని నమ్ముకుని చర్చించుకున్నారో... ఎవరిని నిజమైన జగదేక వీరుడని అనుకున్నారో... ఎవరిని చూసి అన్యాయాన్ని, అవినీతిని అంతం చేసే త్రినేత్రుడని అనుకున్నారో..."ఊరికి ఇచ్చిన మాట" ని నిలబెట్టుకునే "మగమహారాజు" అని  ఎవరిని సమర్ధించారో.. ఆ "చిరంజీవి" ఒక "మహానగరంలో మాయగాడన్న" సంగతి...అతి భయంకర అవినీతి పరులతో చేయి కలిపి, పదవి కోసం పాకులాడుతూ...దాని కోసం ఎంతకైనా తెగించే "రాక్షసుడన్న"  సంగతి... ఇష్టంతో స్థాపించుకున్న రాజకీయ సంస్థని స్వార్ధంతో అన్యులకు ధారాదత్తం చేసే "లంకేశ్వరుడన్న" సంగతి ఎవరూ కనిపెట్టలేకపోయారు..!


నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అని పలికి... ఇప్పుడు అదే ప్రపంచం తెల్లబోయేలా ప్రవర్తించింది ఎందుకు...? "చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలూ, ధనవంతుల పన్నాగాలూ, ఇంకానా? ఇకపై చెల్లవు"... "సమన్యాయమే మన లక్ష్యం... సమ సమాజమే మన గమ్యం" అంటూ ఢంకా భజాయించారు....! కానీ జరిగిందేమిటి... తరచి చూడకుండానే తెలుస్తోందిగా... అవినీతి పాలిట "రుద్రనేత్రుడు" అని అనుకున్నవాడు "దేవాంతకు"డయ్యాడు..!

అభివృద్ధి ఆశలు చూపిస్తూ... వేంకటేశుడి పాదాల సాక్షిగా చేసిన "చాణక్య శపధాన్ని"  తుంగలో తొక్కి జనం నమ్మకాన్ని వమ్ము చేస్తూ... అభిమానులు, కార్యకర్తల ఉత్సాహాన్ని నీరు గారిచిన కిరాతకుడయ్యాడు... "రాక్షసుడయ్యాడు"..!

పురిటి నొప్పులు పడినంత సేపు పట్టలేదు... ఇది ఎంతో కాలం నిలబడేది కాదు అనే నిష్టుర సత్యాన్ని గ్రహించటానికి... ఎలాగో దీపాన్ని నిలబెట్టాములే అని అనుకుంటున్నంతలోనే అంతర్గత విబేధాలు... మనసుల మధ్య లుకలుకలు...! అవన్నీ సద్దుమణగకముందే ఎన్నికలు...మరి విజయం రమ్మంటే ఎలా వస్తుంది...ఐకమత్యం లేనివాళ్ళని ప్రజలెలా నమ్ముతారు...! అందుకే తగిన గుణపాఠం...పజ్జెనిమిదితో సరిపెట్టుకో అంటూ..! మరి అనుభవం పాఠం నేర్పిందా.... లేదు...! అప్పటికీ ఇంకా ఏవో శుష్క ప్రవచనాలు..! దాని ఫలితమే చివరికి ఆరిపోయిన ఈ దీపం..! అంటే... కేవలం రెండు సంవత్సరాల పసికందుని హత్య చేసిన మహా పాపం..!

నాయకత్వం చేతకాకపోవటం తప్పు కాదు...అలాంటప్పుడు ఎవరి సహాయాన్ని అర్ధించాలో కూడా తెలీని మానసిక దౌర్బల్యంతో ఉండటం కూడా తప్పు కాదు..! కానీ కొన్ని విషయాలని అడ్డం పెట్టుకుని ప్రజలని మోసం చేయాలనుకోవటం మాత్రం క్షమించరాని నేరం..! ఏ క్షణాన దురితులతో చేతులు కలిపాడో...స్వార్ధ రాజకీయుల పంచన నిలిచాడో... ఆ క్షణానే ధర్మ పాలననీ... అవినీతి నిర్మూలననీ కాంక్షించే వారి దృష్టిలో "నకిలీ మనిషి" అనే ముద్ర వేయించుకున్నాడు...!

నటించిన ప్రతి సారీ విజయమే సిద్ధిస్తుంది అని భ్రమించే వాళ్లకి ఇదొక గట్టి పాఠం..! జీవించాడే అనేట్టుగా నటిస్తే చప్పట్లు కొట్టే అభిమానులే... నటననే జీవితంగా మార్చాలనుకుంటే...ఏమార్చాలనుకుంటే...  ఏమౌతుందో తెలియ చెప్పారు..! అన్ని పాత్రలలోనూ నటించటం అంత సులభం కాదన్న విషయం ఇప్పటికైనా తెలుసుకుని మసలుకుంటే మంచిది..లేదంటే కనీసం నటించటానికి కూడా అవకాశం లేని జీవితాన్ని ప్రసాదించే శక్తి అదే అభిమానులకి ఉంటుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి వస్తుంది సదరు "రాజా వక్రమార్కుల" వారికి...!
నటన నటనే... జీవితం జీవితమే అన్నట్టుగా ప్రవర్తించి... అభివృద్ధి కాంక్షని చేతల్లో చూపించి... దాన్ని సాకారం చేసి చూపించిన అన్నగారికి... రాజ్య కాంక్షతో ప్రజలని మోసం చేసి పబ్బం గడుపుకోవాలనుకుని అన్నయ్య, తమ్ముడు అనే ముద్ర వేసుకుని తిరిగే "తోడు దొంగలకీ" పోలిక ఎలా ఉంటుంది...!



ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు...  అభివృద్ధి సాధన, అవినీతి అంతం అనే లక్ష్యాలని చేరుకోవటానికి సమాజంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయనే విషయాన్ని గమనించలేకపోయానంటూ ఒక నెపం సమాజం మీదికే..! అంత పెద్ద లక్ష్యం కోసం ఒక పని చేసే ముందు ఎటువంటి ఇబ్బందులు వస్తాయో కూడా ముందుగా ఊహించగలిగే శక్తి లేదా..? మరి అలాంటప్పుడు జనాన్ని మభ్యపెట్టేట్టుగా "అన్నయ్య" చెలామణీ ఎందుకో..! రాజకీయం అంటే "మంచు పల్లకీ" అనుకున్నాడేమో..!



"రొట్టె ముక్కా, అరటి తొక్కా, బల్ల చెక్కా... నీ వేపే చూస్తూ ఉంటాయ్, తమ లోతు కనుక్కోమంటాయ్" అంటూ తన కవితావేశం లో శ్రీ శ్రీ గారన్నట్టు...  "చిత్రసీమ, రక్త పానం, రాజకీయం... నీ వేపే చూస్తూ ఉంటాయి తమని అందుకోమంటాయ్" అని ఇప్పుడు ఈ ఘనులని చూసి మనం అనుకోవాలేమో...! శ్రీ శ్రీ గారి కవితల్లో "కాదేదీ కవితకనర్హం.." అని చెప్పినట్టుగానే...ఇప్పుడు మనం కూడా వీళ్ళని చూసి అర్ధం చేసుకోవాలేమో... "కాదేదీ ధనార్జనకనర్హం..." అనే విషయాన్ని..!


ఇలాంటి వాళ్ళ ఆట కట్టించాలంటే ప్రతి వ్యక్తీ.."నేనంటే... విశాల జగత్తు, విరిసిన మహత్తు! నేనంటే...ముసుగేసిన అక్షరవనం, ముసురేసిన నీలిమేఘం" అనే శ్రీ శ్రీ గారి మాటల్లోని వాడిని వంటబట్టించుకుని ముందుకు పోవాలి..! లేదంటే...దొంగల ముఠా చేతుల్లో హతమవాల్సిందే..!

27, నవంబర్ 2010, శనివారం

అమావాస్య - చంద్రుడు


మాములుగానే వెన్నెల అంటే చాలా ఇష్టం నాకు..! కానీ అదేంటో.. అది ఇష్టం నుండి పిచ్చిలోకి మారిపోయింది ఈ మధ్య..! చంద్రుడంటే ఎందుకంత ఇష్టం అంటే.. ఏమో మరి...తెలీదు...! ఆ మాటకొస్తే...నిండు చంద్రుడే కానక్కర్లేదు...నెలవంక అయినా కూడా తెగ ఇష్టంగా ఉంటుంది నాకు..! ఎంత అందంగా ఉంటాడో చంద్రుడు నెల'వంకర గా ఉన్నప్పుడు కూడా..! తెలుపు రంగు మంచికీ, స్వచ్ఛతకీ మారుపేరు అయితే చల్లదనానికి మారుపేరు చందమామ. చల్లటి హృదయంతో స్వచ్చమైన చంద్రుడు కటిక చీకట్లో నిలబడి ఒక ఆజానుబాహుడిలా నవ్వుతుంటే కేవలం ఆయన పెదవులు మాత్రమే చిరుమందహాసంతో తెల్లగా కనపడుతుంటే మనకిలా నెలవంక లాగా అయిపోయి కనపడుతూ ఉంటాడేమో అనిపిస్తుంది...!
ఒక్కోసారి మరీను...అమావాస్య కోసం ఎంత ఎదురు చూస్తానో.. మరి అమావాస్య వస్తేనే కదా నా నెలవంక ఎదురు పాడేది..! ఈ చీకటి నాకో బహుమతిని ఇస్తూ ఉంటుంది ప్రతి నెల రోజులకో సరి..! అదే..నెలవంక..! ఆకాశంలో చీకటిని నేను ఆరాధిస్తే తరవాత కేవలం మూడు నాలుగు రోజుల్లో నెలవంకని ప్రత్యక్షమయ్యేట్టు చేస్తుంది అదే చీకటి నాకోసం..! మరి చీకటే లేకపోతే నేను నెలవంకని స్పష్టంగా చూడలేనుగా..అందుకే నాకు ఈ విధంగా సహాయం చేస్తున్న చీకటంటే ఏదో తెలియని అభిమానం, ఆప్యాయత..! అందరూ పౌర్ణమి అంటే ఇష్టపడతారు..నాకెందుకో అమావాస్య అంటే కూడా ఇష్టమే..ఎందుకో ఏముంది...ఇందుకేనేమో..! ఎంత చక్కగా నవ్వుతాడో అమావాస్య తరవాత చంద్రుడు..! చిరుమంద హాసంతో మొదలెట్టి రోజుకు కొంచెం చొప్పున తన నవ్వుల శబ్దాన్ని.. అదేలే..బరువుని పెంచుతూ నెమ్మది నెమ్మదిగా మన ముందు పూర్తిగా ప్రత్యక్షమౌతాడు..! అంటే చంద్రుడు కొద్దికొద్దిగా ఆకృతిని దాల్చుతుంటేనే మనం పౌర్ణమి అందాన్ని ఆస్వాదిస్తున్నామేమో..! అమావాస్య తరవాత ఒక్కసారిగా ఉన్నట్టుండి పౌర్ణమి వచ్చేస్తే మనం ఇంతగా  ఆస్వాదించలేమేమో..లేక తట్టుకోలేమేమో..! ఏమో మరి..! చీకటిలో కూడా ఇంత అద్భుతం ఉందా..ఇంత ఆనందం ఉందా..ఇంత అందం ఉందా..?
అంత బానే ఉంది కానీ...మరి నక్షత్రాలెందుకు అలా దోబూచులాడుతూ ఉంటాయి ఒక్కోసారి..వాటికి కూడా మన చంద్రుడు రాకపోతే ఇష్టంగా ఉండదేమో..! ఎట్లా అయితే చంద్రుడు కొద్దికొద్దిగా ఆకారాన్ని పొందుతూ ఉంటాడో ...దానికి తగ్గట్టే ఒక్కొక్క నక్షత్రం బయటికొచ్చి వొళ్ళు విరుచుకుంటూ ఉంటుంది బద్ధకంగా..! మ్... ఎక్కడో ఆకాశంలో ఉన్న వాటికి కూడా ఈ మత్తు ఏంటో... ఈ బద్ధకం ఏంటో..మనకు లాగానే..! ఓ సారెప్పుడో  నేను, మా భరణి గాడు చీకట్లో మా ఇంటి మీద పడుకుని ఆకాశంలో చూస్తూ కబుర్లాడుకుంటూ ఉంటే ఉన్నట్టుండి నాకు అనుమానం వచ్చేసరకి వాణ్ని అడిగాను... "వొరే...ఎందుకురా ఈ రోజు చుక్కలు సరిగ్గా కనిపించట్లేదు ఆకాశంలో" అని..! వాడన్నాడు కదా... "చంద్రుడు లేని ఆకాశం వాటికి కూడా అక్కర్లేదేమోరా" అని..! ఇంతకీ ఆ రోజు అమావాస్య..అదీ విషయం..! అదేంటో...చంద్రుడి కంటే ఎంతో ఎంతెంతో ఎత్తులో ఉండే చుక్కలకి చంద్రుడితో పనేంటో .!
వాటికంటే ఎంతో తక్కువ ఎత్తులో ఉండే ఈయన వల్ల వాటికెందుకో అంత ఆనందం..! సామాన్యంగా ఎవరైనా వాళ్ళకంటే ఎక్కువ ఎత్తులో ఉండేవాళ్ళకోసం చూస్తారు. మరి ఈ చుక్కల తీరేంటో నాకైతే అర్ధం కాలేదు..! హా.. ఆలోచించగా చించగా..నాకో విషయం తట్టింది ఏంటంటే.. మన కంటే ఎక్కువ ఎత్తులో ఉండే వాళ్ళు ఏ విధంగా అయితే మనకి ఆదర్శమో..మన కంటే తక్కువ ఎత్తులో ఉండే వాళ్ళు అదే విధంగా మనకి ఆనందాన్ని కలిగిస్తారేమో అని. కాబట్టి...ఎవరి ఎత్తు ఎంత అనే విశ్లేషణలని పక్కన పెట్టి అటువంటి పోలికలని మానేసి అందరితోను ప్రేమతో, ఆరాధనతో, అభిమానంతో ఉంటే అందరూ ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటారు అనే సందేశాన్ని ఇస్తున్నాయేమో..! అందుకే నక్షత్రాలు వాటి కంటే ఎంతో కిందకి ఉన్న చంద్రుణ్ణి కూడా, వాటిలో ఎటువంటి గర్వము లేకుండా...వినమ్రంగా తలలు వంచి మరీ..కిందికి చూస్తూ ఆరాధిస్తున్నాయేమో..! ఏమో... నిజమేనేమో..!
హా.. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే...అంత ఎత్తున ఉండే చుక్కలు తలలు వంచి మరీ ఆయన్ని చూస్తుంటే..ఆయన కంటే ఎత్తులో ఉన్న చుక్కల కోసం పాకులాడాల్సింది పోయి...ఆయనేమో ఆయనకంటే కింద ఎక్కడో ఉన్న మన కోసం చూస్తూ ఉంటాడు. లోకరక్షకుడు అయినటువంటి విష్ణుమూర్తి బావమరిది కదా.. అంతెందుకు..ఆయన రెండు కళ్ళలో ఒకటి ఈయనే కదా..మరి అంత గొప్ప వాడు అయ్యుండీ, మనకోసం ఆయనకెందుకు ఆరాటం..విచిత్రం కదా..! పైగా మొన్నామధ్య "ఎందుకు మాస్టారు మీకు మాతో.. మీరసలే బిజీ కదా" అని కొంచెంగా దెప్పుతుంటే, నాతో అన్నాడు కదా..."అల్లుడు...మీరంతా లేకపోతే నేను మాత్రం ఉండి ఏం చేస్తాను..నాలో మీరు ఇష్టపడే వెన్నెలని మీ కోసం కాకపోతే మరి ఎవరి కోసం కురిపించాలి....దాన్ని అడవిని కాయాలా.. సముద్రాన కురిపించాలా...అక్కడెవరున్నారు చెప్పు నాకు మాత్రం..! మీరేగా నా ఆత్మీయులు, నా వాళ్ళునూ..! నాకూ, నానుండి కురిసే ఈ వెన్నెలకీ ఓ అర్ధాన్ని పరమార్ధాన్నీ కలిగించింది మీరేగా...మీ మనుషులేగా..నీలాంటి అభిమానులేగా..! మీరే కనుక లేకపోతే ఈ రోజున అసలు నా గురించి మాట్లాడుకునే వారెవరుంటారు చెప్పు..! నాకంటే ఎంతో ఎత్తులో ఉండే నక్షత్రాలు నన్ను చూసి ఆనందించేవే తప్ప ఎప్పుడూ మాట్లాడుకోవు...!" అనేసాడు..పిచ్చి మావయ్య..! చూసావా..ఆయన నుండి వచ్చే వెన్నెలనీ..దాని గొప్పతనాన్నీ, ఇంకా ఆయన ప్రత్యేకతలనీ ...ఇలా అన్నిటినీ మనకే ఆపాదించేసి మనకే గొప్పదనాన్ని తెచ్చిపెట్టాడు..! పిచ్చభిమానం కదూ..! ఏంటో.. ఈ అభిమానాలు...ఆప్యాయతలు..! మనమేం ఇచ్చామని ఆయనకీ, మనమంటే అంత ఇష్టం..! పైగా...పర్యావరణాన్ని పాడు చేసి ఆయనకి కూడా మచ్చ తెచ్చిపెడుతున్నాం  మనం..!
అందుకే పెద్ద వాళ్ళు అంటూ ఉంటారేమో..అందరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటూనే ఉంటుంది అనీ! లేకపోతే మరి అందరినీ ఎందుకు సృష్టించాడు ఈ విధాత..! మానసికంగా పిచ్చి వాడి వల్ల కూడా ఏదో జరగాల్సి ఉందేమో...అందుకే సృష్టించాడేమో..! ఏమో..! ఆ క్షణాన ఎవరెక్కడుంటే ఏంలే..ప్రతి వాళ్ళు ఏదో సాధించాలి...ఏదో చెయ్యాలి...ఏదో నిర్వర్తించాలి...వాళ్ళెంత ఎత్తులో ఉన్నారన్నదాంతో సంబంధం లేకుండా..!

22, అక్టోబర్ 2010, శుక్రవారం

వెన్నెల తరకలు..!

ఈ శరత్ పౌర్ణమి సందర్భంగా దేవులపల్లి వారి వెన్నెల పాట ఒకటి గుర్తొచ్చింది నాకు...!
ఇదిగో ఇదే ఆ పాట..!

"రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా
ఎవరో..చల్లినారమ్మా... వెన్నెల చల్లినారమ్మా..!
కరిగే పాల కడవల పైన నురుగు నురుగులుగా 
మరిగే రాధ మనసూ పైన తరక తరకలుగా
ఎవరో పరచినారమ్మ... వెన్నెల పరచినారమ్మా..!!
కడమి తోపుల నడిమీ బారుల
ఇసుక బైళుల మిసిమీ దారుల
రాసి రాసులుగా...రాసి రాసులుగా...
ఎవరో...పోసినారమ్మా.. వెన్నెల పోసినారమ్మా..!!"

18, అక్టోబర్ 2010, సోమవారం

వీర బ్లాగుడు..!

     ఏవండోయ్... మిమ్మల్నే.. ఒక సారి నేను చెప్పేది కూడా వినండి..! ఏంటంటే... ఇప్పుడూ... నేనేదో నా దారిన నే పోతుంటే.. వచ్చి నువ్వు కూడా ఓ బ్లాగ్ మొదలెట్టచ్చుగా అని అడిగింది..నేస్తం..! నేను రాసేదేంటి... నాకేం రాయటం వచ్చని అడుగుతున్నావ్... నీకేదో పిచ్చి పట్టింది...అందుకే నన్ను బ్లాగమని అడుగుతున్నావ్ అని చెప్పాను..! అయినా సరే... పట్టుబట్టి మరీ నన్నీ ప్రపంచంలోకి లాగింది..! దాంతో ఎలా చెప్పాలో తెలియక ఓ ఉత్తరం రాశాను నేస్తానికి..! అదే ఇక్కడ మీకోసం ఉన్నదున్నట్టుగా రాసేస్తున్నాను..! అది చదివాక..అప్పటికీ బ్లాగ్ ప్రపంచంలోకి వచ్చినందుకు తిట్టాలనుకుంటే తిట్టండి..! కానీ ఒక్క విషయం...నా అంతట నేనుగా వచ్చింది కాదు ఇక్కడికి..!
     "బ్లాగులు తీరిన యోధులు ఉన్న ఈ బ్లాగ్ ప్రపంచంలో నేనేదో పిల్ల కాకిని వచ్చి ఏదో బ్లాగ్ మొదలెట్టేసి అమ్మ బ్లాగోయ్ అని అందరూ ఆశ్చర్యపోయేంతగా, బ్లాగు బ్లాగు అని అందరూ మెచ్చుకునేంతగా, అపర బ్లాగరి అని బిరుదు కూడా వచ్చేంతగా నేను రాయాలంటే ఎంత బ్లాగుడు బ్లాగాలో నీకు తెలియదా ప్రియమైన బ్లాగాక్షీ..! నా బ్ల్యాగులో ఉన్న పుస్తకాలన్నిటినీ వెతికి పట్టి చదివి రాసినా... ఇవి భ్లోగి మంటల్లో వెయ్యటానికి తప్ప ఇంకెందుకూ పనికిరావేమో బ్లాగేశ్వరీ..! పుట్టిన రోజు సందర్భంగా నువ్వు ఒక బ్లగుమతిని ఇవ్వమని అడిగావు కదా అని సరేనన్నాను..నువ్వేమో చివరికి ఏదీ దొరకనట్టు నా నెత్తిన ఈ బ్లగువుని పెంచే బాధ్యత ఇస్తావనుకోలేదు..! ఏదైతేనేం... దీన్ని నా బ్లాఘ్యతగా స్వీకరించి మరీ నీకు బ్లగుకరిస్తాను భ్లాగీరధీ...! నా గీతల వల్ల నీకు అంతగా బ్లాగానందం ఉంటుందంటే మరి అది నాకు కూడా బ్లాగందమేగా..! 

      అయినా వేమన ఏం చెప్పాడు..బ్లాగులందు వీడి బ్లాగులు వేరయా బ్లాగాభిరామ బ్లాగువేమా.. అని కదా..!! మరి అలాంటప్పుడు నా రాతల్ని ఎవరు చదువుతారే భ్లాగ్యలక్ష్మీ..!! ఏంటో నీ పిచ్చి కానీ..ఏదో పిచ్చి బ్లాగుడు బ్లాగే నాకు ఈ బ్లాగుల బ్లాగోతం ఏంటో..!!

      ఇదంతా ఏమో కానీ..నాకు ఈ సందర్భంగా రెండు పాటలు గుర్తొస్తున్నాయి బ్లాగాదేవీ..! ఒకటి ..."బ్లాగు బ్లాగోయన్న బ్లాగో నా సామి.. బ్లాగులున్నాయి మాంచి జోరు..!" రెండోది.. "బ్లాగు రాసుకుని బ్లాగు చదువుకుని చల్లగ బ్లాగులు చూడాలోయ్ ..మీరెల్లరు బ్లాగుగ ఉండాలోయ్.." అంటూ..! రెండూ ఘంటసాల మాష్టారు పాడినవే..! ఈ బ్లాగుల గురించి అప్పట్లోనే ఎంత బ్లాగా చెప్పారు కదా..!!

     నాకు తెలిసి చాలా రకాల బ్లాగులున్నాయి. లేత బ్లాగులు..ముదురు బ్లాగులు..! చేదు బ్లాగులు..తీపి బ్లాగులు..! హాస్య బ్లాగులు..లాస్య బ్లాగులు..! సూటి బ్లాగులు..పోటు బ్లాగులు..! అగ్గి బ్లాగులు..గుగ్గి బ్లాగులు..! పెద్ద బ్లాగులు..మొద్దు బ్లాగులు..! సుత్తి బ్లాగులు..సోది బ్లాగులు..! ఇలా ఎన్నెన్నో..!
లేత బ్లాగులు రాసేవాణ్ని లేత బ్లాగరి అనీ..హాస్య బ్లాగులు రాసేవాణ్ని హాస్య బ్లాగరి అనీ..ఇలా ఆయా రకాన్ని బట్టి ఆ బ్లాగరి పేరు మారుతూ ఉంటుంది..!! ఇందులో మన బ్లాగు ఏ రకానికి చెందినది అని నా సందేహం బ్లాగాకుమారీ..! హా...ఏదైతేనేం..మన గురించి ఎవరెన్ని బ్లాగినా మనకనవసరం..కాబట్టి మరీ ఎక్కువగా బ్లాగోచించకుండా నీ బ్లాగుడు నువ్వు బ్లాగి పారేయి అంటావా..సరే.. అలాక్కానీ..!

      నువ్వు ఏం బ్లాగేంద్రజాలం చేశావో తెలీదు కానీ..నా మనసులో కూడా బ్లాగాగ్ని రాజుకునేలా చేసావు..! దాంతో బ్లాగుని బ్లాగుతోనే తియ్యాలి అనే సూక్తితో ముందుకి వెళదామని నిర్ణయించుకున్నాను బ్లాగాంబికా..! కానీ ఒక్క మాట..నేను చేస్తున్న ఈ బ్లాగ్యజ్ఞంలో నీ బ్లాగోపరేషన్ కూడా ఉంటే బ్లాగుంటుంది అని నా అభిప్రాయం బ్లాగాంజలీ..! అసలే బ్లగ్గిరవ్వ రాజుకుంది ....!
ఇతి బ్లాగోపాఖ్యానం సమాప్తి..!!"
ఇదండీ ఆ ఉత్తరం..!