28, జూన్ 2011, మంగళవారం

రమణీయం

కొహోతి కొమ్మచ్చి
కొమ్మకి రెమ్మొచ్చి
రెమ్మకి పువ్వొచ్చి
పువ్వుకి నవ్వొచ్చి
నవ్వుకి నువ్వొచ్చి
నీకు నేనొచ్చి
కోతి కొమ్మచ్చి..!

పదాలతో ఆడుకుంటూ, పాడుకుంటూ, మనన్ని ఒక ఆట ఆడించిన (ఆడుకున్న) ముళ్ళపూడి వెంకటరమణుల వారికి ముందుగా శతకోటి నమస్సుమాంజళులు. పదాలతో నవ్వించినా.. అక్షరాలతో గారడీ చేసినా.. మనసు తేలిక పడేలా చేసినా.. ఆయనకే చెల్లు. ఎందుకంటే ఆయన కళామతల్లి ముద్దుబిడ్డ కాబట్టి. నేను నవ్వను, నేనింతే... అని రాయి కంటే కూడా గట్టిగా బిగుసుకుని ఉండే వ్యక్తిని కూడా నవ్వించగల శక్తి ఆయన సొంతం. కళ అనే పదానికి చక్కటి నిర్వచనం రమణులవారు. అవును మరి, మాటలు రాయటం.. ఆ రాతలని పలికించటం.. ఆ పలుకులని చిత్రీకరించటం.. ఆ చిత్రాన్ని అందంగా చూపించటం.. ఆ అందాన్ని ఆనందించేలా చెయ్యటం.. ఆ ఆనందాన్ని మనకివ్వటం.. ఇవన్నీ ఒకే మనిషి  చెయ్యగలడా..? ఈయన చేశారు. నువ్వు రాసేవాడివైతే నేను గీసేవాణ్ని అంటూ రమణగారి మాటలని అత్యద్భుతంగా బొమ్మీకరించారు ఈయన చిరకాల స్నేహితుడైన బాపుగారు.

"నను గోడ లేని చిత్తరువుగా చేసి వెళ్ళిపోయిన నా వెంకట్రావు కోటి కోట్ల జ్ఞాపకాలకు సభక్తికంగా" అంటూ నమస్కరిస్తున్నబాపుగారికి ప్రణామం చేస్తున్నాను.

వీళ్ళిద్దరి స్నేహం గురించి మాట్లాడుకోవాలంటే బహుశా ఒక గ్రంధం చదివినంత పని అవుతుందేమో. ఎందుకంటే స్నేహమనే పదంలో చెరో అక్షరం వీళ్ళిద్దరూ. సృష్టిలో వీళ్ళు లేకపోతే అసలు స్నేహం అనే పదానికి అర్ధం ఉండేది కాదేమో అనేంత అందమైన బంధం వీళ్ళది. ఇప్పటికీ చాలామంది ఆంధ్రులకి బాపు, రమణ అనే వాళ్ళు ఇద్దరు వ్యక్తులు అంటే తెలీదు. బాపు రమణ అనేది ఒకే వ్యక్తి పేరు అని అనుకొంటారు. అంతలా కలిసిపోయారు వీళ్ళిద్దరూ. వీళ్ళని ఒకటిగా చూశాం కానీ ఇద్దరిగా చూడలేకపోయాం. ఇంత మంచి స్నేహితులు ఉన్న కాలంలో మనం కూడా ఉన్నాం అనే భావన గొప్పగా ఉంటుంది.

నీ రాతలు - నా గీతలు అంటున్నట్టుగా... ముళ్ళపూడి వారి మాటలకి బాపుగారి బొమ్మలు ఉండేవి. అసలు నాకొక అనుమానం ఎప్పటి నుండో అలా ఉండిపోయింది. అదేంటంటే, రమణగారు రాస్తే.. దానికి తగ్గట్టుగా బాపు బొమ్మలు రూపుదిద్దుకునేవా? లేక బాపుగారు గీస్తే.. వాటికి తగ్గట్టుగా రమణగారి మాటలు పలికేవా? ఏది ఏమైనా... దాదాపు ఏడు దశాబ్దాల స్నేహం.. అంతే వయసు గల రచన. ఈయన బొమ్మలు ప్రాణం పోసుకొంటూనే ఉన్నాయి. అంతలోనే ఆ కలం అలసిపోయింది. రాసింది చాల్లే కానీ ఇక రావయ్యా అంటూ లాక్కెళ్ళాడు ఆ రామయ్య. 'అదేంటీ నువ్వే లేకపోతే నా బొమ్మలకి మాటలు నేర్పించేది ఎవరు మరి' అని ఒక పక్కన ప్రియనేస్తం అడుగుతున్నా సరే వినిపించుకోకుండా రాముడంటే వెళ్ళిపోయింది ఈ కలం. పాపం.. ఆ బొమ్మలన్నీ మూగరోదనతో అలా చూస్తూ ఉండటం తప్ప ఏమీ చెయ్యలేకపోయాయి. మాటలొచ్చిన బొమ్మలు మాత్రం ఇక ఇప్పటినుండి ఒకళ్ళకొకళ్ళం అంటూ నమ్మలేని ఈ నిజాన్ని జీర్ణించుకోటానికి ప్రయత్నిస్తున్నాయి. మాటలు నేర్చిన మనం మాత్రం ఈయన చేతుల్లో బొమ్మలమైపోయాం. ఆ బొమ్మలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు ఈ పెద్దాయన. కానీ చివరికి ఇలా ఏ మాత్రం కనికరం లేకుండా ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు.. చెప్పా పెట్టకుండా. ఇప్పుడు ఈయన రాతలతో, రాతల విన్యాసాలతో స్వర్గలోకపు వాసులని అలరించటానికి, రాములోరి చెంత చేరి సేద తీరుతున్నాడు. ఈయన కోసం ఎంతోమంది దేవతలు భూలోకానికి చేరుతుంటే, ఈయన మాత్రం స్వర్గలోకానికి భవ బంధనాల ముళ్ళ"పూడిక" తొలగించుకుని మరీ వెళ్ళాడు. ఇదిగో..ఇప్పుడిలా హాయిగా నవ్వుతూ స్వర్గలోక వాసులని కూడా ఆయన చతురోక్తులతో ఓలలాడిస్తున్నాడు.



చరిత్రలో క్రీస్తుశకం 1931వ సంవత్సరం ఎంతో అదృష్టం చేసుకుంది. ఎందుకంటే ఈ సంవత్సరం రమణగారికి జన్మనిచ్చింది మరి. అదే జరిగి ఉండకపోతే, ఈ రోజున అసలు సాహితీలోకం ఈ సంవత్సరం గురించి మాట్లాడుకునే  అవకాశమే ఉండేది కాదేమో. ఆహా.. ఎంతటి అదృష్టం ఈ సంవత్సరానికి. అలా ఓ మనిషికి జన్మనిచ్చి.. ఇలా శాశ్వతమైన ప్రఖ్యాతి కొట్టేసింది. దాని తరవాత మళ్ళీ అంతటి ముఖ్యమైన సంవత్సరంగా స్థిరపడిపోయింది 1942. ఈ సంవత్సరంలోనే రమణ గారు అందమైన స్నేహ బంధానికి తెర తీస్తున్నారు అన్నట్టుగా బాపుగారిని మొట్టమొదటిసారిగా కలిశారు.

సినీ రమణీయం, బాపు రమణీయం, కధా రమణీయం, కదంబ రమణీయం... లాంటి ఎన్నో పుస్తకాలు ఆంధ్రుల మనస్సులలో ఎంత రమణీయంగా నాటుకుపోయాయో  తెలిసిందే.

ఆయన రాసిన మొట్టమొదటి గల్పిక "అమ్మ మాట వినకపోతే" 1945లో అచ్చు వేయబడటంతో మొదలైంది ఆయన సాహితీ ప్రస్థానం. అటుపైన చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండగా 1953లో ఆంధ్రపత్రికలో రిపోర్టర్ గా ఉద్యోగం సంపాదించి.. తరవాత నెమ్మదిగా చిత్రసీమతో సాన్నిహిత్యం కలిగేసరికి ఆయనలోని పూర్తిస్థాయి కళ  బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం దొరికింది. అది వినా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదనే చెప్పచ్చు. కధా రచయితగా, మాటల రచయితగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న రమణగారు - అందమైన చిత్రాల స్రష్ట కూడా.

అన్నపూర్ణమ్మ సహాయంతో "ఇద్దరు మిత్రుల"ని కలిపినా..
"బుద్ధిమంతుడి"గా కనిపిస్తూనే "ప్రేమించి చూడు" అని ఊరించి కవ్వించినా..
"సంపూర్ణ రామాయణా"న్ని అత్యద్భుతంగా ఆవిష్కరించినా..
"గోరంత దీపం"తో సాహితీ ప్రియులకి కొండంత వెలుగుని అందించినా..
మహా భక్తుడైనటువంటి "త్యాగయ్య" చేతనే కీర్తనలు పాడించినా..
తెలుగువారి మీదికి హాస్య "బుల్లెట్"లు విసిరినా..
"ముత్యాల ముగ్గు" వేసి మరీ "అందాల రాముణ్ణి" ఆహ్వానించినా..
"మూగ మనసుల" వలన మాట్లాడలేకపోయిన సావిత్రీ నాగేశ్వరరావులని "నవరాత్రుల"లో నానా అల్లరీ చేయించి చివరికి వాళ్ళిద్దరినీ కలిపినా..
"Mr. పెళ్ళాం" తో "దాగుడుమూతలా"డించినా..
చక్కటి హాస్యానికి మాత్రం "సాక్షి"గా నిలవటం.. సాహిత్యంలో "పూలరంగడి"లా ఉండటం ఆయనకే చెల్లింది. బాపు గారి సహచర్యంతో "ప్రాణ మిత్రులు"గా ఇద్దరు స్థిరపడిపోయారు.

తెలుగులో ఆణిముత్యాల్లాంటి 37 చిత్రాలతో పాటు.. హిందీలో హిట్ హిట్ హుర్రే అనిపించుకున్న "హమ్ పాంచ్" లాంటి రెండు చిత్రాల కోసం పనిచేసి బాలీవుడ్ లో కూడా జెండా పాతారు. ఆయన పని చేసిన కొన్ని సినిమాలలోని డైలాగులు విన్నాక ప్రేక్షకులు నవ్వీ నవ్వీ బాపు'రే అనటం మామూలే.
ఇడిగిడిగో బుడుగు అని అంటూనే వాణ్ని "చిచ్చుల పిడుగు" అని అభివర్ణించినా... "వైకేరియస్ లయబిలిటీ"  (vicarious liability) లాంటి పదాలని ప్రయోగించి జీవితంలో ఎదుర్కున్న కష్టాల్ని కూడా అత్యంత హాస్యంగా వర్ణించినా... ఈ రోజున బుడుగు పుస్తకంలోని ఎన్నో మాటలని పెద్ద వాళ్ళు, వాళ్ళ పిల్లలకి  అలవాటయ్యేలా నేర్పించినా.. ఎంతో మంది ప్రేమికులు ఆయన సృష్టించిన రాధాగోపాళాల లాగానే  ఉండాలని  ప్రయత్నించినా.. పక్కింట్లో లావుపాటి పిన్నిగారు లాంటి వ్యక్తి ఉండాలని కోరుకున్నా.. ప్రతి ఇంట్లోను ఒక బాబాయ్ ఉండాలనుకున్నా.. ఒకవేళ లేకపోతే బాబాయ్ ఉన్నట్టుగా ఊహించుకుంటూ మాట్లాడినా.. ఇవన్నీ మన జీవితాల మీద ఆయన రాతల ప్రభావం ఎంతగా ఉందో రుజువు చేసేవే.

తెలుగింటి దంపతులకు 'బుడుగు' ముళ్ళపూడి వారి వరప్రసాదం. వాళ్ళ పిల్లలు సరిగ్గా ఇలాగే ఉండాలని కోరుకునేంత అందంగా సృష్టించారు వేంకటరమణుల వారు. బుడుగు చేసే అల్లరి పనులు, వాడి చేష్టలు.. అలాగే పెసూ వేసే కొంటె ప్రశ్నలు...దాని హావ భావాలు..ఇలా ఎంతో ఆహ్లాదకర హాస్య పూరిత సుందర పర్ణశాలలో తిప్పుతారు రచయిత వారి మైత్రి బాపుతో సహా.

ఆయన జీవితచరిత్రని తెలుసుకోవాలన్నా.. అసలు జీవితంలో ఎదురయ్యే సమస్యలని ఎంత సులభంగా అధిగమించచ్చు అనే విషయాన్ని అర్ధం చేసుకోవాలన్నా.. సమస్యల్లో కూడా నవ్వగలగటం ఎలా అనే  రహస్యాన్ని వంటపట్టించుకోవాలన్నా.. అసలు సమస్యని చూసే దృక్కోణం ఎలా ఉండాలనే విషయాన్ని అర్ధం చేసుకోవాలనుకున్నా.. ముళ్ళపూడి వారి "కోతి కొమ్మచ్చి" ఆటలని చూస్తే సరి. ఇంత వయసులో కూడా అన్నన్ని కుప్పి గంతులేస్తూ.. ఆయనతో పాటే మనన్ని కూడా ఒక కొమ్మ మీది నుండి ఇంకో కొమ్మ మీదికి  తీసుకెళ్తూ... ఆ గంతుల్లోనే ఎన్నో విషయాల్ని చక్కటి  హాస్యంతో చూపించిన ఈయనకి... సలాం....!!! ఈయన జీవితాన్ని కోతికొమ్మచ్చితో పోల్చి.. అసలు జీవితమంటే ఇదే.. ఎన్నో విషయాలని ఒకే సమయంలో ఎన్నో ఆటలాడటమే అనేట్టుగా చిత్రీకరిస్తూ అంతలోనే.. ఇంకోతి కొమ్మచ్చి అంటూ మరెన్నో విషయాలతో మనన్ని గుక్క తిప్పుకోకుండా చేసిన ఈయన... సాహిత్యంలో అమరులయ్యారు, వంగ్యపూరిత వర్ణనలో మహర్షులయ్యారు.

ఈ రోజు (జూన్ 28) ముళ్ళపూడి వెంకటరమణగారి జయంతి. ఈ సందర్భంగా... ముళ్ళపూడి వారికి నమస్కరిస్తూ... అందరికీ సుపరిచితమే అయినా... ఈతరం వాళ్ళు, వీళ్ళ ద్వారా రాబోయే తరం వాళ్ళు కూడా ఈ పుస్తకాలని చదవాలి... తద్వారా.. చక్కటి సాహిత్యంతో కూడిన అందమైన హాస్యాన్ని అందరూ ఆస్వాదించాలనే ఒక కోరికతో.. తెలుగు తీయదనం అంటే ఇలా ఉంటుందని రుజువు చేయాలనే తపనతో.. ఇక్కడ నా ఆంధ్రులందరి కోసం బుడుగు పుస్తకం లింక్ ఇస్తున్నాను. దాంతో పాటే.. బాపు హాస్యగుళికలని కూడా రెండు భాగాలుగా జత చేశాను. ఎవరికి ఎప్పుడు ఏ రోగం వచ్చినా కూడా ఈ పుస్తకాల్లో నుండి వారిక్కావలసిన మందు ఏదో ఒకదాన్ని తీసుకుని వేసుకోవచ్చు. ముఖ్య గమనిక.. ఈ గుళికలని ఉపయోగించిన తరవాత భోజనానికి కనీసం ఒక రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి, లేదంటే భోజనం వంట పట్టదు.ఆ తరవాత మీ ఇష్టం.

Budugu pustakam
Bapucartoons-part - 1
Bapu cartoons part - 2

ఝాటర్ ఢమాల్....!!!!