19, మే 2011, గురువారం

డామేజర్ అను ఒక మేనేజర్...

డైరెక్టర్ రూంలో బాగా వాయింపు అయినట్టుంది...మొహం మాడ్చుకుని బయటికొచ్చాడు. అదేంటో... వాడలా బయటికొస్తుంటే రకరకాల భావాలు కనిపిస్తున్నాయి మొహంలో...! సినిమా మధ్యలో దొరికిన బ్రేక్ టైంలో ఓపెనర్ తో ట్రీంగ్...ట్రూయీంగ్.. అంటూ కూల్ డ్రింక్స్ బాటిల్స్ మీద ఓపెనర్ తో రాస్తూ అమ్ముకోటానికి వచ్చే వాడిలాగా..కోఠి బస్సు స్టాండ్లో "యే పల్లి బఠానేయ్ గరం గరం.. " అని అరుస్తూ జనం వెంటపడే వాడిలాగా... కిరాణా కొట్టులో పని చేసే పిల్ల వాడిని "ఒరేయ్.. కిలో కంది పప్పు కట్టమని చెప్పాను...కట్టావా" అంటూ కసురుకునే వాడిలాగా... అదేంటో...ఇలా రకరకాలుగా కనపడుతూ ఉంటాడు. అక్కడికేదో మునిగిపోతున్నట్టు..హడావిడిగా వాడి డెస్క్ దగ్గరికొచ్చేసి... అర్జెంటుగా ఓ నలుగురి మీద ఏ మాత్రం అవసరం లేకపోయినా సరే కాకి లాగా అరిచేస్తే కానీ...నాలుక మీద దురద తీరదు అన్నట్టు...మనశ్శాంతి ఉండదు అన్నట్టు.. పరిగెట్టుకొచ్చేస్తూ  ఉంటాడు... తీరా  చూస్తే  అక్కడేమీ అంత అజ్జెంటు పని ఉండి చావదు... వెధవ మొహానికి. అదేలెండి.. నేను  మాట్లాడేది  మీరనుకుంటున్న సదరు మహానుభావుడి గురించే. ఆఫీసు ల్యాండ్ లైన్ నుండి నా సెల్ ఫోన్ కి  మిస్ కాల్  ఇచ్చే కక్కుర్తి  మొహమూ వాడునూ. అదేంటో... ఈ మేనేజర్ అనేవాడు ఉన్నాడు చూసారు... ఏదో  చేసేద్దామనుకుని  ఏదేదో  మొదలెట్టేస్తాడు... చివరికి చేసేదేమీ ఉండదు. కొంతమంది మేనేజర్లు అయితే  మరీనూ, వాళ్లకన్నీ  తెలుసనుకుంటారు. కానీ వాడొక మైదానంగాడన్న సంగతి అందరికీ తెలుసన్న సంగతి వాడికి తెలీదు. పైగా ఒక దిక్కుమాలిన భావం ఒకటీ మొహానికి.. అదేదో సినిమాలో బాలకృష్ణ గావుకేకలు పెడుతూ "నేను కొట్టినా చస్తావు..నన్ను కొట్టినా చస్తావు..." అని అంటున్నట్టుగా..!!!

ఒక్కోసారి చూడండి.... డైరెక్టర్ రూంలో నుండి బయటికి వస్తూ... అదేదో అడ్వర్టైస్మెంట్ లో... (క్లోజ్-అప్ అనుకుంటా) వాడి నవ్వు చూడగానే.. "దగ్గరగా రా...దగ్గరగా రా..." అనే ఒక ఆర్తనాదం గుర్తొస్తుంది. అబ్బో, లేక లేక ప్రేమతో గుఱ్ఱం పళ్ళేసుకుని సకిలించుకుంటూ మరీ పిలిచాడు కదా అని నవ్వుకుంటూ  దగ్గరికెళ్తామా... తీరా చూస్తే మళ్ళీ అదే కంపు, అవే అరుపులు, అవే తిట్లు, అదే కసురు. అప్పుడర్ధమౌతుంది అసలు విషయం, ఇది ఏడవలేక నవ్వూ అనీ. కంపెనీ కాబ్ లో కూరగాయలు కొనుక్కోటానికెళ్ళే  పింజారీ మొహమూ...వాడూను.

ఆ మధ్య ఓసారి ఉన్నట్టుండి డెస్క్ దగ్గరికొచ్చి, రేపు శనివారం షాపింగ్ కి వెళ్దాం రాగలవా శాండిల్య అని అడిగాడు. ఇంతమంది ఉంటే నన్ను అడుగుతున్నాడేంటబ్బా..  ఇదేదో ఉపద్రవానికొచ్చినట్టుందే అని అనుకుని, "హా వస్తానండి.. ఇంతకీ ఏం కొనాలి మీరు అని అడిగాను. వాడు ఓ చిన్న లిస్టు చూపించాడు. ఆ అతి చిన్న లిస్టు  చదవటానికి నాకు కనీసం ఓ  ముప్పావు  గంట పట్టింది. అసలు వాడు ఈ లిస్టుని రాయటానికి చేసిన కృషి  చదువుకునేప్పుడు కనుక చేసి ఉంటే.. ఈ పాటికి ICWAI పాస్ అయిపోయి ఉండేవాడు దరిద్రుడు. పైగా..  అందులో  వాడు కొనాలనుకుని రాసిన వస్తువులు ఏంటా అని చదివేసరికి.. ఈ వస్తువులు కొనుక్కోటానికి ఎవడైనా పెళ్ళాన్ని తీసుకుని వెళ్తాడ్రా పిచ్చుక పీనుగా.. అలాంటిది నన్ను అడుగుతావెంట్రా ముష్టి మిధునం అని తిట్టుకుని "అంటే ఇప్పుడు నేను రావటం కుదురుతుందో లేదో తెలీదు" అని అంటూ నసుగుతూ తటపటాయించాను. నేను రాను, రాలేను అని అంటానేమో అని వాడు గ్రహించినట్టున్నాడు, వెంటనే, ఆర్టీసీ బస్సులో పక్కసీట్లో  ఉన్నవాడు లేవగానే అక్కడ ఇంకొకడు వచ్చి కుర్చుంటాడేమో అని, అందరినీ తోసేసుకుంటూ.. ఓ నలుగురు కింద పడిపోయేలా గంతులేస్తూ వెళ్లి మరీ ఆ సీట్లో కూలబడే కక్కుర్తి మొహంగాడిలాగా.. నన్ను ఇంకో మాట మాట్లాడనివ్వకుండా "నువ్వొస్తున్నావు అంతే" అనేశాడు. సరే కానీలే.. శనిగ్రహం బలం ఎక్కువగా ఉన్నప్పుడు మనం తప్పించుకోవటం కష్టం అనిపించి సరేనన్నాను. పైగా శనిగ్రహానికి ఉపగ్రహంగాడే  ప్రత్యక్షంగా  చెప్తున్నాడు.. నీకు బ్యాడ్ టైం స్టార్ట్  అయిపొయింది అని. అలాంటప్పుడు ఇంక చేసేదేముంటుంది. అసలు వాడు కొనాలనుకున్న వస్తువుల్లో తొంభై శాతం అన్నీ వంటింటి సామానే ఉన్నాయి. ఇంతకీ వీటి షాపింగ్ విషయంలో వాడు నన్నే పిలవటానికి కారణం.. వీడు తెలుగువాడే అయినప్పటికీ చిన్నప్పటి నుండి బెంగుళూరులోనే ఉండి చచ్చాడు. అందువల్ల హైదరాబాద్  అంతగా పరిచయం లేదుట.. అది నా  ప్రాణానికొచ్చింది ఇప్పుడు. అసలు నాకు అనుమానం ఏంటంటే... ఇలా లిస్టు రాసేప్పుడు వాడు వాళ్ళావిడతో చెప్పి ఉంటాడు.. "ఇవన్నీ కొనేప్పుడు నాతో రావటానికి ఓ గైడ్ ఉన్నాడు, హైదరాబాద్లో వాడు మనకి డ్రైవర్ లాంటివాడు" అని..!

సరే.. ఇంకేం.. శనిగాడు, శనివారం రానే వచ్చాయి. అసలు ఇవన్నీ కొనాలంటే మేము వెళ్ళాల్సిన ప్రాంతం... అత్యంత భయంకరమైన జన సమ్మర్దంగా ఉండే ప్రాంతం. ఇక్కడికి రాగానే ఓ చిలిపి ఆలోచన వచ్చింది - "ఇసుక వేస్తే రాలనంత జనాలు" అని అంటూ ఉంటారు కదా.. అసలది ఎంతవరకూ నిజమో చూద్దాం అని. అంతే.. వచ్చిందే తడవుగా అలా విసిరి చూశాను. "రాలను పో" అని ఓ వెటకారపు నవ్వు నవ్వి అలా గాల్లోనే కలిసిపోయింది పాపం ఆ ఇసుక. ప్రాణం లేని ఆ ఇసుక ప్రాణాలు ఆ విధంగా గాల్లోనే కలిసిపోయేలా చేసిన పాపం చుట్టుకున్నాను.. కింద అంతమంది జనాలున్నారు మరి! హుమ్మ్.. అంతా నా భ్రమలే అని అనుకుని.. మళ్ళీ ప్రయత్నిద్దాం అని అలాగే చేశాను. ఓ గుప్పెడు ఇసుకని పైకెగరేసి అలా చూస్తూ ఉన్నాను. ఓ నాలుగైదు నిమిషాల తరవాత  "అలా రోడ్డు మధ్యలో నిలబడి నోరు తెరుచుకుని మరీ చూస్తావెంట్రా దరిద్రుడా.. నీ చుట్టూ ఇంతమందిని పెట్టుకుని కింద పడమంటే ఎట్లా.. నీ బుర్రని ఏమనాల్రా పిచ్చి పీనుగా" అని కొన్ని మధురమైన వాక్కులు వినిపించాయి. చంటి పిల్లలని చంపెయ్యటానికి ఆకాశంలోకి ఎగరేసిన కంసుడితో పలికినట్టుగా నాతో కూడా ఆకాశవాణి అలా అంటోందేమో అని అనుకున్నాను.. ఆ తరవాత అర్ధమైంది.. నన్నలా తిట్టింది నేను విసిరిన ఇసుకే అని. అదేంటో.. ఈ శనిగాడు పక్కనుండేసరికి దాని ప్రభావం వల్లనేమో నాకు  ఈ రోజు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి! అప్పుడు రుజువైంది నాకు బ్యాడ్ టైం చాలా దారుణంగా  మొదలైపోయిందని! అయినా ఇంత మంది జనం ఉండే ప్రదేశం ఏంటా, ఎక్కడుందా అని కదూ మీ అనుమానం.. సామాన్యంగా జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు  అక్కడికెళ్ళి మోక్ష ప్రాప్తి కోసం చూస్తూ ఉంటారు కొంతమంది మా హైదరాబాద్ వాళ్ళు! అంతటి పుణ్య ధామం అది. అక్కడి దుమ్ము.. క్షమించండి.. ధూళి పవిత్రమైంది. నుదుటి మీద పూసుకోవక్కర్లేదు, దానంతట అదే మొహం అంతా పులుముకుంటుంది. అక్కడి మనుషుల మనసులు.. అబ్బో ఇంక దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏవండీ అని పిలిస్తే చాలు.. అక్కడికేదో మనం వాణ్ని అమ్మ నా బూతులూ ఉపయోగించి తిడుతూ పలకరించినట్టు చూస్తూ ఉంటాడు ప్రతి వాడూను. హుమ్మ్... ఇంకా అర్ధం కాలేదా, అదే... హైదరాబాద్లోనే అత్యంత అందమైన ప్రదేశం... అఫ్జల్ గంజ్ అని ఒకటుందిలే.
సరే.. ఎలాగో మొత్తమ్మీద అక్కడ మా శనిగాడు, నేను కలిసి వాడిక్కావలసిన చెత్త మొత్తం దాదాపు కొనేశాం.. ఇంతలో అలా ఉన్నట్టుండి దారి తప్పి.. వాడు నేను చెరోవైపుకి  వెళ్ళిపోయాం. ఎక్కడున్నాడా కనుక్కుందాం.. అసలే హైదరాబాద్ తెలిసి చావదు వీడికి అని ఫోన్ చేసి "ఎక్కడున్నారు సార్ మీరు?" అని అడిగితే వాడిచ్చిన సమాధానం విని... ప్రపంచంలో బూతు అనే మాట కూడా సిగ్గుపడేలా తిట్టుకున్నాను వాణ్ని! మా మేనేజర్ పీనుగు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా...  "నీకు చంద్రుడు కనిపిస్తున్నాడా" అని అడిగాడు. ఇంత మంది మధ్యలో వీడికి కేరాఫ్ చంద్రుడి అడ్రస్ ఎందుకబ్బా అని అనిపించింది. వీడు ఏ చంద్రుడి విషయం అడుగుతున్నాడో అర్ధమయ్యి చావక తల పైకెత్తి "హా కనిపిస్తున్నాడండి" అని చెప్పాను "హా.. సరిగ్గా దానికింద ఓ షాప్ ఉంది, దాని ముందు నిలబడి ఉన్నాను" అని చెప్పాడు. "ఇన్ని లక్షలమందీ ఉన్నది చంద్రుడి కిందనే కదరా... అమావాస్య రోజు వెన్నెల కోసం మిడిగుడ్లేసుకుని ఎదురుచూసే గుడ్డి బద్రీ" అని తిట్టుకుని... తరవాత ఎందుకో అనుమానం వచ్చి చుట్టూ పరికించి చూశాను. అప్పుడు అర్ధమైంది వీడి కక్కుర్తి పవర్ ఏంటో... అది వీడి చేత ఎలా మాట్లాడిస్తుందో. వీడికి తాగుడు పిచ్చి. తెగ తాగి చస్తాడు. మంచి నీళ్ళు కాదు, మత్తెక్కించే మంచి తీర్థం గురించి చెప్తున్నాను నేను! బార్ కనిపిస్తే చాలు.. కుక్కలాగా చొంగ కార్చుకుంటూ మరీ పరిగెత్తుతాడు. అక్కడేదో చంద్ర బార్ అని ఉంది. దానికి ఈ నికృష్టుడు పెట్టుకున్న ముద్దు పేరు చంద్రుడు. దాని కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో నగల దుకాణం  ఉంటే.. దొంగతనం చేశాకా వాడి సహ-దొంగ కార్ తీసుకు రాగానే అందులోకి దూకేసి చకాచకా పారిపోయే ప్లాన్ లో ఉన్న దొంగవెధవ లాగా కళ్ళు తిప్పుతూ అక్కడ నాకోసం చూస్తూ ఉన్నాడు. వంటింటి సామగ్రి కావాలంటూ.. ఆభరణాల షాప్ కి వెళ్లి ఏం చేసి చస్తున్నావురా దరిద్రుడా అని ఓసారి మా మేనేజర్ని  అతి సామాన్యంగా తలచుకుని... వాడి దగ్గరికెళ్ళి "ఇంక ఇంటికి వెళ్దామా సార్.. అయిపోయిందిగా షాపింగ్" అని అడిగాను. వీణ్ణి అంత తేలిగ్గా వదిలితే ఎక్కడ త్వరగా కొంపకెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటాడో అని అనుకున్నాడేమో.. ఇప్పుడు వెళ్లి బట్టలు కొనుక్కుందాం పద అన్నాడు. ఇప్పుడు వీటన్నిటినీ ఏ షాప్ వాడూ లోపలికి రానివ్వడు సార్ అని చెప్పాను. ఓహో అవును కదా అని ఆలోచిస్తుంటే.. అమ్మయ్య, అయితే  ఈ రోజుకి  వద్దులే అని అంటాడనుకున్నాను. వాడు ఊరుకుంటాడా "దీని గురించి ఎందుకు కంగారు.. నా కార్ ఉందిగా.. అందులో వేసి పారేద్దాం" అని అన్నాడు. అప్పుడనుకున్నాను.. "అందులో వేసి పారేద్దాం" అనే వీడి మాటలు నిజమయ్యేట్టుగా.. వీడి సామాను, కార్ తో సహా దొంగలెట్టుకెళ్తే పీడా విరగడైపోతుంది అని అనుకుని.. తప్పదుగా.. సరేనన్నాను. అక్కడ కూడా వీడి చేష్టలు, హావ భావాలు చూసి నాకు షాపింగ్ అంటేనే విరక్తి పుట్టేసింది. వీడెళ్లి అక్కడ ఓ పింక్ కలర్ ప్యాంటు, ఎల్లో కలర్ షర్టు కొనుక్కుని, దాని మీదికి చాలా బాగా సూట్ అవుతుంది అని గెంతుకుంటూ వెళ్లి  ఒక ఆకుపచ్చ రంగు టై కొనుక్కున్నాడు. అప్పుడు మాత్రం.. అదేదో సినిమాలో సుత్తీరబద్దర్రావ్ తిట్టుకున్నట్టు, నేను కూడా "నన్ను షాపింగ్ కి అని పిలిచీ ఇలాంటి దారుణమైన పనులు చేస్తావారా.. పోతావురోరేయ్.. నాశనమైపోతావురా! ఇంకోసారి నన్ను షాపింగ్ అని పిలిస్తే నీ నవరంధ్రాల్లో మైనం కూరుతాను వెధవ్వా!!!" అని తిట్టుకున్నాను.
ఆ తరవాత ఎండా కాలంలో అనుకోకుండా వచ్చే చల్లటి వర్షం అన్నట్టు.. ఏదో అలా అలా వీడికి పొరపాటున మంచితనం అనేది పుట్టిందేమో, నన్ను ఇంటి దాకా దింపుతాను అనేసరికి హాశ్చర్యంతో నోరు తెరిచేసాను. బయట వేడికి తట్టుకోలేక, లోపల చల్లగా ఉందనుకున్నాయేమో... ఈలోగా నాలుగైదు ఈగిల్స్ (ఈగలు కాదు)  అలా కొంచెం సేపు నా నోట్లో విహరించి మరీ వచ్చేసాయి. షాపింగ్ చేసీ చేసీ బాగా ఆకలిగా ఉన్నట్టుంది, ఇంటికెళ్తూ దారిలో వాడు బెంగుళూరులో చేసిన అరివీర భయంకర సాహసోపేత కృత్యాలన్నిటినీ నాకు చెప్తూ కడుపు నింపుకున్నాడు.

కానీ మనకంటూ ఒకడు ధైర్యం చెప్పేవాడు.. కష్ట సమయాల్లో నేనున్నానంటూ వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు; ఒకే సమయంలో తన పై అధికారులకి సమాధానం చెప్పుకుంటూ, తన కిందివాళ్ళని సంభాళించుకుంటూ, పని సాఫీగా జరిగేలా జాగ్రత్త పడుతూ, ఎన్నో చికాకులని అదుపులో పెట్టుకుంటూ; మనకేదైనా కావాలంటే అతడున్నాడు అనే ధైర్యాన్ని మనసులలో కలిగిస్తూ... ముందుకు సాగే ఒక హీరో కూడా అతడే.

మళ్ళీ ఇదేంటీ ఉన్నట్టుండి అనుకుంటారేమో.. ఏం లేదులెండి.. ఎంత కాదనుకున్నా త్వరలో నేను కూడా ఓ మేనేజర్ని అవాల్సినవాణ్ణేగా.. కాబట్టి వీణ్ణి అన్న మాటల్లో నన్ను నేను చూసుకోలేక, వాణ్ని తిట్టుకున్న ప్రతిసారీ చివరిలో ఇలా కూడా అనుకుంటూ తృప్తి పడుతూ ఉంటాను. అంతే కానీ వాడి మీద అభిమానంతో మాత్రం కాదు. అసలు మా మేనేజర్ని మనస్ఫూర్తిగా  అభిమానించగలిగే జీవి ఈ భూమ్మీద ఉంటుందని కూడా నేననుకోవట్లేదు.
హెల్మెట్ పెట్టుకుని కార్ నడిపే తింగరి మొహమూ వాడూ..!